Asianet News TeluguAsianet News Telugu

టోకు ద్రవ్యోల్బణానికి కూర‘గాయ’ల సెగ

జూన్ టోకు ధరల ద్రవ్యోల్బణం ఎన్నడూ లేని విధంగా నాలుగేళ్ల గరిష్ఠ స్థాయిలో 5.77 శాతంగా నమోదైంది. 2013 డిసెంబర్ టోకు ధరల సూచి 5.99గా రికార్డైంది. దీని ప్రభావంతో స్టాక్ మార్కెట్లలో షేర్లు పతనం అయ్యాయి.

WPI inflation spikes to 4-yr high of 5.77% in June

న్యూఢిల్లీ: మండిపోతున్న కూరగాయలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరల ప్రభావం టోకు ద్రవ్యోల్బ ణంపై స్పష్టంగా కనిపించింది. జూన్‌ నెల టోకు ద్రవ్యోల్బణం నాలుగేళ్ల గరిష్ఠానికి 5.77శాతానికి ఎగబాకింది.  2013 డిసెంబర్‌ తర్వాత ఈ స్థాయిలో టోకు ద్రవ్యోల్బణం పెరగడం ఇదే ప్రథమం. ఆ ఏడాది టోకు ద్రవ్యోల్బణం 5.9 శాతంగా నమోదైంది. కాగా రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్లను పెంచాలన్నా, తగ్గించాలన్న రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుం టుంది. జూన్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా ఐదు నెలల గరిష్ఠానికి ఎగబాకి 5 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. మే నెల ద్రవ్యోల్బణం 4.43 శాతానికి పరిమితం కాగా, గతేడాది జూన్ నెలలో 0.90 శాతంగా రికార్డైంది. 

జూన్‌ నెలలో ఆహార ద్రవ్యోల్బణం 1.80 శాతం పెరిగితే.. అంతకు ముందు మే నెలలో 1.60 శాతంగా నమోదైంది. అదే కూరగాయల విషయానికి వస్తే జూన్‌ నెలలో 8.12 శాతం, అంతకు ముందు మే నెలలో 2.51 శాతంగా నమోదైంది. ఇక ఇంధనంలో విద్యుత్‌ ద్రవ్యోల్బణాన్ని తీసుకుంటే జూన్‌లో ఏకంగా 16.18 శాతం పెరిగితే.. మే నెలలో 11.22 శాతంగా నమోదైంది. గ్లోబల్‌ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగితే దాని ప్రభావం దేశీయ ఇంధన ధరలపై పడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బంగాళదుంపల ధరలు జూన్‌లో అత్యధికంగా 99. 02 శాతం, మేలో 81.93 శాతం పెరిగాయి. ఉల్లి ధరలు జూన్‌లో 18.25 శాతం పెరిగితే.. మే నెలలో 13.20 శాతం పెరిగాయి. పప్పుల ధరలు గత నెలలో ప్రతిద్రవ్యోల్బణం స్థాయికి దిగివచ్చి 20.23శాతంగా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా ఏప్రిల్‌ నెల టోకు ద్రవ్యోల్బణం ముందుగా అంచనా వేసిన 3.18 శాతం నుంచి 3.62 శాతానికి సవరించారు.

జూన్ టోకు ద్రవ్యోల్బణం పెరుగుదల తాత్కాలికమేనని భారత కార్పొరేట్ రంగం ఆశాభావంతో ఉన్నది. సరఫరా వ్యవస్థలో అంతరాయాల వల్లే ఇదంతా జరిగిందని, వర్షాలు సాధారణంగా కురిస్తే సమీప భవిష్యత్‌లో పరిస్థితి మెరుగవుతుందని అంచనా వేస్తోంది. పీహెచ్డీ చాంబర్ అధ్యక్షుడు అనిల్ ఖైతాన్ మాట్లాడుతూ భవిష్యత్‌లో ‘రాబోయే నెలల్లో ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యం 4% (+/-2%)ను చేరుకుంటుందన్న నమ్మకం ఉంద’ని అన్నారు. వాణిజ్య అనిశ్చితి, అంతర్జాతీయంగా పెరుగుతున్న రక్షణాత్మక ధోరణి వంటి సమస్యలు టోకు ధరల ద్రవ్యోల్బణ రూపంలో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం కాగలవని అసోచామ్ ఆందోళన వ్యక్తం చేసింది. 

టోకు ద్రవ్యోల్బణం నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి చేరడంతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం పడింది. మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. బ్యాంకింగ్‌, ఔషధ, లోహ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్‌ 218 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 11,000 పాయింట్ల దిగువకు చేరింది. నిఫ్టీ 50 షేర్లలో 35 డీలా పడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా స్టీల్‌, లుపిన్‌ 5 శాతానికిపైగా నష్టపోయాయి. నొప్పి నివారణకు ఉపయోగించే డాక్టర్‌ రెడ్డీస్‌ ఉత్పత్తులైన బ్యుప్రెనార్ఫిన్‌, నాలోక్సోన్‌ సుబ్లింగ్వల్‌ల తదుపరి అమ్మకాలు, వాణిజ్య సంబంధిత విషయాలపై న్యూజెర్సీ జిల్లా కోర్టు తీసుకున్న నిర్ణయంతో డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు కుదేలయ్యాయి. 

చైనా ఆర్థిక వృద్ధి ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నెమ్మదించిందన్న వార్త, అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ భయం నేపథ్యంలో దాదాపు అన్ని ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌ ఉదయం 36,658.71 పాయింట్ల వద్ద సానుకూలంగానే ప్రారంభమైంది. టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలవగానే మార్కెట్లు ప్రతికూల ధోరణికి మారాయి. ఒక దశలో 36,298.94 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసిన సెన్సెక్స్‌ చివరకు 217.86 పాయింట్ల నష్టంతో 36,323.77 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 82 పాయింట్లు కోల్పోయి 10,936.85 వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్‌లో ఈ సూచీ 10,926.25-11,019.50 పాయింట్ల మధ్య కదలాడింది.

Follow Us:
Download App:
  • android
  • ios