జీఎస్టీ రేట్లు తగ్గిస్తామన్న ‘నిర్మల’మ్మ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో భారత్ తన ర్యాంకును మెరుగు పరుచుకున్నది. 190 దేశాల్లో పరిస్థితిపై ప్రపంచ బ్యాంకు జాబితాను విడుదల చేసింది. మరోవైపు ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు జీఎస్టీ పన్ను రేట్లు తగ్గిస్తామని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకు (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదా ఈవోడీబీ)ల్లో భారత్ 14 స్థానాలు మెరుగైంది. 190 దేశాలతో ప్రపంచ బ్యాంక్ గురువారం విడుదల చేసిన ‘డూయింగ్ బిజినెస్ 2020’ జాబితాలో భారత్‌కు 63వ స్థానం దక్కింది. గతేడాది ప్రకటించిన జాబితాలో 77వ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
మేక్ ఇన్ ఇండియా, దివాలా చట్టం (ఐబీసీ) తదితర సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసిన క్రమంలో వరుసగా మూడోసారి టాప్-10 అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన దేశాల్లో భారత్ నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి దేశం భారతేనని ప్రపంచ బ్యాంక్ పేర్కొనడం గమనార్హం.
భారత్‌తోపాటు చైనా, బహ్రెయిన్, సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, టోగో, తజికిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా దేశాలు ఈ టాప్-10 జాబితాలో ఉన్నాయి. మొత్తం జాబితాలో చైనాకు 31వ స్థానం లభించింది. సౌదీ అరేబియా 62, కువైట్ 83వ స్థానాల్లో నిలిచాయి.
కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లతోపాటు పలు ప్రముఖ దేశ, విదేశీ రేటింగ్ ఏజెన్సీలు భారత జీడీపీ అంచనాల్ని తగ్గిస్తున్న తరుణంలో విడుదలైన ఈ ర్యాంకుల్లో భారత్ సత్తా చాటడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నది.
2018 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మే 1 వరకు 190 దేశాల్లో సర్వే చేపట్టామని, 10 అంశాలను ప్రామాణికంగా తీసుకున్నామని, దాని ఆధారంగానే తాజా జాబితాను విడుదల చేశామని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. 2014లో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పుడు భారత్ ఈవోడీబీ ర్యాంక్ 142గా ఉన్నది.
also read రిలయన్స్ జ్యుయెల్స్ ప్రధాన స్టోర్ ప్రారంభం
2016లో ఈఓడీబీలో భారత్ ర్యాంకింగ్ స్థాయి 130గా ఉంటే, 2018లో 100కు చేరింది. 2019లో 77వ స్థానంలో నిలువగా, 2020కిగాను తాజా జాబితాలో 63ను తాకింది. ఐబీసీ అమలుతో భారత్‌లో వ్యాపార పరిస్థితులు చాలా మెరుగైయ్యాయని, దీనికి ముందు రుణగ్రహీతలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారని, ఇప్పుడా పరిస్థితి లేదని ప్రపంచ బ్యాంక్ తమ నివేదికలో పేర్కొన్నది.
ఐబీసీ అమలు నాటి నుంచి 2 వేలకుపైగా సంస్థలు దీన్ని వినియోగించుకున్నాయని, దాదాపు 470 సంస్థలు నగదీకరణకు, మరో 120కిపైగా సంస్థలు పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలకు వెళ్లాయని వివరించింది. ముఖ్యంగా అప్పుల ఊబిలో కూరుకున్నా, వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉన్న సంస్థలకు ఐబీసీ ఓ వరంగా పేర్కొన్నది.
ఈవోడీబీ ర్యాంకుల్లో భారత్ టాప్-50 దేశాల్లో నిలువాలంటే మరిన్ని సంస్కరణలు అవసరమని ప్రపంచ బ్యాంక్ ఆర్థికాభివృద్ధి విభాగం డైరెక్టర్ సైమన్ జంకోవ్ అన్నారు. ఇన్సాల్వెన్సీ బ్యాంక్ప్స్రీ కోడ్, పన్నుల సంస్కరణలు, ఒప్పందాల అమలు వంటివి కీలకమని, ఇవి కొనసాగితే టాప్-40లోకి కూడా చేరవచ్చన్నారు.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో కొన్ని సంస్కరణల అమలు కష్టతరమని అభిప్రాయపడ్డ ఆయన ఏ ఆటంకం లేకపోతే వచ్చే నాలుగేళ్లలో టాప్-25లోకి కూడా భారత్ వస్తుందన్నారు. ఈవోడీబీ ర్యాంకుల్లో దేశాల మధ్య ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొందని, ప్రభావవంతమైన నిర్ణయాలకే ఫలితం దక్కుతుందని ఆయన చెప్పారు.
మరోవైపు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ఇంకా సరళతరం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీనివల్ల దేశంలో వ్యాపార నిర్వహణ మరింత సులభతరం కాగలదన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకుల్లో భారత్ 14 స్థానాలు మెరుగైన నేపథ్యంలో గురువారం మంత్రి న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై నగరాలే ప్రాతిపదికగా ర్యాంకులు విడుదలవుతున్నాయని, వచ్చే ఏడాది నుంచి కోల్‌కతా, బెంగళూరులనూ సూచీలో పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు.
దీంతో భారత్ ర్యాంక్ మున్ముందు మరింత పెరుగగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన నిర్మలా సీతారామన్.. టాప్-50లోకి త్వరలోనే వస్తామన్న ధీమాను కనబరిచారు. కాగా, రుణాలను పొందడానికి ఉన్న ప్రామాణికతపై ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ మాట్లాడుతూ ఈ విషయం బ్యాంకుల పరిధిలో ఉంటుందన్నారు.
also read విదేశీ సంస్థల చేతికి ‘పెట్రోల్ పంపులు’....
ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశవ్యాప్తంగా రుణ మేళాలను నిర్వహించాలని బ్యాంకర్లను కేంద్రం కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు రూ.80 వేల కోట్ల రుణాలు ఇచ్చారని, ఇందులో 43 శాతం కొత్తవేనని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల్లో లక్ష కంపెనీలకు సుమారు రూ.8,500 కోట్ల రుణాలు అందాయన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య నెలకొన్న బేధాభిప్రాయాలను తొలగించే దిశగా వెళ్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రక్రియ కింద భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ ఆస్తుల జప్తుపై ఈడీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కేసు విచారణలో భాగంగా ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు మాకుందని ఈడీ వాదిస్తుండగా, దివాలా ప్రక్రియలో ఉన్న సంస్థపై ఈ రకమైన చర్యలకు దిగలేరని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటున్నది. ప్రస్తుతం ఈ కేసు నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) వద్ద ఉన్న సంగతి విదితమే.