విదేశీ సంస్థల చేతికి ‘పెట్రోల్ పంపులు’....

ముడి చమురు రంగంతో నేరుగా సంబంధం లేని సంస్థలు కూడా దేశీయంగా పెట్రోల్ పంపులు నడుపుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇంతకుముందు రూ.2500 కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనను సరళతరం చేసి రూ.250 కోట్లకు పరిమితం చేసింది. అయితే పెట్రోల్ పంపుల ఏర్పాటు ప్రారంభించిన ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఐదు శాతం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
 

Centre eases rules for setting up petrol pumps, allows non-oil cos in business

న్యూఢిల్లీ: రిటైల్ ఇంధన విక్రయ రంగంలో మునుపెన్నడూ లేనివిధంగా భారీ సంస్కరణకు తెరతీసింది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయడానికి ఉన్న నిబంధనలను సడలించారు. చమురేతర వ్యాపార సంస్థలూ పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రకటించింది. 

ఈ నిర్ణయంతో దేశీయ రిటైల్ పెట్రో మార్కెట్‌లోకి మరిన్ని ప్రైవేట్ రంగ, విదేశీ సంస్థల రాకకు దారితీయనుండగా, పోటీని కూడా తీవ్రతరం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ఇంధన విక్రయ లైసెన్సు పొందడానికి హైడ్రోకార్బన్ అన్వేషణ, ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్‌లైన్లలోగానీ, ద్రవరూప సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ)టర్మినల్స్‌పైనైనా రూ.2000 కోట్ల పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉన్నది. 

తాజా నిర్ణయం ప్రకారం రూ.250 కోట్ల నికర విలువ కలిగిన కంపెనీలన్నీ రిటైల్ పెట్రోల్ పంపుల వ్యాపారంలోకి అడుగు పెట్టవచ్చు. పెట్రోల్, డీజిల్‌ను అమ్మేసుకోవచ్చు. అయితే కొత్తగా పెట్టే బంకుల్లో 5 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉండాల్సిందేనని ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) భేటీ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అలా జరుగని పక్షంలో రూ.3 కోట్ల జరిమానా ఉంటుందన్నారు. 

also read ఎంటిఎంఎల్, బీఎస్ఎన్ఎల్ విలీనం చేయాలి : కేంద్ర మంత్రి

పెట్రోల్ రిటైల్ బిజినెస్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఐదేళ్లలో ఈ నిబంధనను అమలు పరుచాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. బంకులను ఏర్పాటు చేసిన మూడేళ్లలోగా సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, బయో ఇంధనాలు లేదా విద్యుత్ ఆధారిత వాహనాల చార్జింగ్ ఏదో ఒక స్టేషన్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పారు. 

కొత్త పెట్రోల్ రిటైల్ విధానం దేశీయంగా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహద పడుతుంది. ముఖ్యంగా దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుంది. అంతేగాక ఈ రంగంలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి, ఉద్యోగావకాశాలకు పెద్ద ఎత్తున కలిసొస్తుంది. 

రిటైల్ ఔట్‌లెట్లు పెరిగితే పోటీ అధికమై వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుతాయి అని కేంద్ర మంత్రి జవదేకర్ అన్నారు. 2002లో చివరిసారిగా ఇంధన విక్రయ రంగంలో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సిఫార్సులపై ఈ మార్పులు చేసింది.

Centre eases rules for setting up petrol pumps, allows non-oil cos in business

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో విదేశీ సంస్థలకు కలిసి రానున్నది. ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎస్‌ఏ, సౌదీ అరేబియా ఆరామ్కో, బ్రిటన్‌కు చెందిన బ్రిటిష్ పెట్రోలియం, సింగపూర్ పూమా ఎనర్జీ వంటి గ్లోబల్ దిగ్గజాలు భారతీయ రిటైల్ ఇంధన మార్కెట్‌లోకి రావచ్చునన్న అంచనాలు ఉన్నాయి. 

అదానీ గ్రూప్‌తో కలిసి దేశవ్యాప్తంగా 1,500 పెట్రోల్ బంకులను తెరువాలని టోటల్ యోచిస్తున్నది. ఈ మేరకు గతేడాది నవంబర్‌లో లైసెన్సు కోసం దరఖాస్తు కూడా చేసుకున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో బ్రిటిష్ పెట్రోలియం కూడా పెట్రోల్ బంకులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని వేచి చూస్తున్నది. పూమా ఎనర్జీ కూడా ఈ రేసులో ఉండగా, ఆరామ్కో చర్చిస్తున్నది.

also read అద్దె ఇంట్లో....ఆదాయ పన్ను త‌గ్గించుకునేందుకు....

నిజానికి 3,500 బంకులు ఏర్పాటు చేసేందుకు బ్రిటిష్ పెట్రోలియం ఎప్పుడో కేంద్రం నుంచి లైసెన్సును దక్కించుకున్నా. పెట్రో ధరల్లో ఒడిదుడుకులు తదితర కారణాల రీత్యా వాటి ఏర్పాటు జరుగలేదు. 
ప్రస్తుతం దేశంలోని పెట్రోల్ బంకుల్లో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలవే ఎక్కువగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లకు చెందినవి 65,554 ఔట్‌లెట్లు ఉన్నాయి. 

ఇవిగాక రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్సార్ ఆయిల్, రాయల్ డచ్ షెల్ పెట్రోల్ బంకులున్నాయి. ఎస్సార్ ఆయిల్‌కు 5,344, రిలయన్స్‌కు సుమారు 1,400, షెల్‌కు 160 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఇక ఐవోసీకి 27,981, హెచ్‌పీసీఎల్‌కు 15,584, బీపీసీఎల్‌కు 15,708 ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios