Asianet News TeluguAsianet News Telugu

త్వరలోనే ఓటీటీ హబ్‌గా భారత్: రూ.5,363 కోట్లకు మార్కెట్

కొన్నేళ్లలోనే వీడియో ఓవర్ ది టాప్ (ఓటీటీ) దిగ్గజంగా భారత్ నిలువనున్నది. 2022 నాటికి టాప్‌ 10లో చోటు దక్కించుకోనున్నది. భారత్‌లో వీడియో ఓవర్ ది టాప్ మార్కెట్ విలువ రూ.5000 కోట్లకు చేరుతుందని అసోచామ్–పీడబ్ల్యూసీ అధ్యయనం నిగ్గు తేల్చింది.

Video OTT market in India to be among global top 10 by 2020
Author
New Delhi, First Published May 10, 2019, 9:41 AM IST

న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నా దేశీయ వీడియో ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) మార్కెట్‌ 2022 నాటికి అంతర్జాతీయంగా టాప్‌ 10 మార్కెట్లలో ఒకటిగా ఎదగనున్నది. అప్పటికి భారత వీడియో ఓటీటీ మార్కెట్‌ పరిమాణం 823 మిలియన్‌ డాలర్లకు అంటే సుమారు రూ. 5,363 కోట్లకు చేరనున్నదని పరిశ్రమల సమాఖ్య-అసోచామ్, కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ సంయుక్త అధ్యయనంలో తేలింది.

‘భారత వీడియో ఓటీటీ మార్కెట్‌ ప్రస్తుతం శైశవ దశలో ఉంది. అంతర్జాతీయంగా ఈ మార్కెట్‌ వృద్ధి బాటలో సాగుతోంది. 2017–2022 మధ్య ఈ మార్కెట్‌ ఏటా 22.6% వృద్ధితోపాటు అంతర్జాతీయ ఓటీటీ మార్కెట్లో  10.1 శాతం వృద్ధితో టాప్‌ 10లో ఒకటిగా నిలుస్తుంది’ అని నివేదిక పేర్కొంది. 

దేశీయంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, యూట్యూబ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు ఓటీటీ సేవలు అందిస్తున్నాయి. దేశీయంగా ఓటీటీ మార్కెట్‌ వృద్ధికి పలు అంశాలు దోహదపడనున్నాయి. 

నిరంతరాయ కనెక్టివిటీ, కంటెంట్‌ కోసం ఎక్కువగా మొబైల్‌ ఫోన్లు ఉపయోగించడం పెరుగుతుండటం, కస్టమర్ వ్యక్తిగత అభిరుచులకు అనుగుణమైన కంటెంట్‌ను అందించే వీలు ఉండటం తదితరాలు ఇమిడి ఉన్నాయి.

మరోవైపు 2022 నాటికి స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య 12.9% వార్షిక వృద్ధి రేటుతో 85.9 కోట్లకు చేరుతుందనేది అసోచామ్ - పీడబ్ల్యూసీ నివేదిక అంచనా. 2017లో వీరి సంఖ్య 46.8 కోట్లుగా ఉంది. డేటా టారిఫ్‌లు భారీగా తగ్గిపోవడం, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతుండటంతో ప్రధానంగా వీడియో ఆన్‌ డిమాండ్‌ (వీవోడీ) మార్కెట్‌కు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది.

‘భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆన్‌లైన్‌ వీడియోలను వీక్షించేందుకు అనువైన డివైజ్‌ల లభ్యత పెరుగుతుండటం వీవోడీ పరిశ్రమకు తోడ్పడుతుంది. కంటెంట్‌ వినియోగం ఎక్కువగా స్మార్ట్‌ఫోన్స్‌తోనే జరుగుతోంది‘ అని నివేదిక వివరించింది. స్మార్ట్‌ ఫోన్లతోపాటు ట్యాబ్లెట్స్‌ కూడా వీవోడీ పరిశ్రమకు కీలకంగా మారుతున్నాయి. 

స్మార్ట్‌ఫోన్స్తతో పోలిస్తే హెచ్‌డీ కంటెంట్‌ చూడటానికి ట్యాబ్లెట్స్‌ అనువుగా ఉంటాయని అసోచాం–పీడబ్ల్యూసీ అధ్యయనం తెలిపింది. వినోద, మీడియా పరిశ్రమలో టీవీ అతి పెద్ద ప్రధాన విభాగమని, భవిష్యత్‌లోనూ అలాగే కొనసాగుతుందని వివరించింది. 

2017–2022 మధ్య కాలంలో భారత టెలివిజన్‌ పరిశ్రమ 10.6 శాతం వార్షిక వృద్ధితో 13.3 బిలియన్‌ డాలర్ల నుంచి 22 బిలియన్‌ డాలర్లకు చెందుతుందని నివేదిక పేర్కొంది. ఇదే వ్యవధిలో అంతర్జాతీయంగా టీవీ పరిశ్రమ వృద్ధి సగటు అత్యంత తక్కువగా 1.4 శాతంగా మాత్రమే ఉండగలదని వివరించింది. 

‘కంటెంట్‌ పరిశ్రమలో పెను మార్పులు వస్తున్నా భారత్‌లో సంప్రదాయ వినోద సాధనాల ఆధిపత్యమే కొనసాగుతోంది. అత్యంత చౌకగా కంటెంట్‌ను వినియోగించుకోవడానికి అనువైన సాధనాల్లో టీవీ ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో వినోదానికి ఇదే ప్రధాన వనరుగా ఉంటోంది‘అని నివేదిక వివరించింది.

ఇదిలా ఉంటే 2020 నాటికి భారత్‌లో ఆన్‌లైన్‌ వీడియోలు వీక్షించే వారి సంఖ్య 50 కోట్లకు చేరుతుందని టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఒక నివేదికలో తెలిపింది. భారతీయ వినియోగదారులు సమాచార సేకరణ, కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆన్‌లైన్‌ వీడియోలు గణనీయంగా మారుస్తున్నాయన్నది. 

భారతీయులు అన్వేషించే కంటెంట్‌పై బ్రాండ్స్‌కు అవగాహన కల్పించేందుకు రూపొందించిన నివేదిక ప్రకారం.. ఆన్‌లైన్‌ వీడియో సెర్చిలో మూడింట ఒక వంతు వినోద సంబంధ అంశాలే ఉంటున్నాయి. జీవన శైలి, విద్య, వ్యాపారం వంటి అంశాలు గత రెండేళ్లలో 1.5 నుంచి 3 రెట్లు దాకా వృద్ధి నమోదు చేశాయి.

కార్ల కొనుగోళ్ల నిర్ణయాలను ఆన్‌లైన్‌ వీడియో గణనీయంగా ప్రభావితం చేస్తోంది. కొనుగోలు చేసే కారుపై అధ్యయనానికి కార్ల కొనుగోలుదారుల్లో 80 శాతం మంది ఇదే మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రతి పది మంది కొత్త ఇంటర్నెట్‌ యూజర్లలో తొమ్మిది మంది భారతీయ ప్రాంతీయ భాషా కంటెంట్‌ను ఉపయోగిస్తున్నారు. 

ఏటా 4 కోట్ల మంది భారతీయులు కొత్తగా ఇంటర్నెట్‌ వినియోగదారులుగా మారుతు న్నారని గూగుల్ నివేదిక పేర్కొంది. ఈ విషయంలో ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి భారత్‌లోనే ఉంటోందన్నది.

దేశీయంగా ప్రతీ యూజర్ సగటున నెలకు 8 జీబీ మొబైల్‌ డేటాను వినియోగిస్తున్నారు. సంపన్న దేశాల్లో వినియోగానికి ఇది సరిసమానం అని గూగుల్ తెలిపింది.

ఆన్‌లైన్‌ సెర్చి విషయంలో ప్రస్తుతం మెట్రోయేతర ప్రాంతాలు .. మెట్రో నగరాలను మించి పోతున్నాయి. మెట్రో నగరాలతో పోలిస్తే ఇతర ప్రాంతాల వారే ఎక్కువగా బీమా, సౌందర్యం, పర్యాటక రంగ అంశాల సమాచారం కోసం అన్వేషిస్తున్నారు.

గూగుల్‌ ప్లాట్‌ఫాంపై నమోదయ్యే బ్యాంకింగ్, ఆర్థిక, బీమా సేవలకు సంబంధించిన సమాచార సేకరణలో 61 శాతం భాగం మెట్రోయేతర ప్రాంతాల నుంచే ఉంటోంది. వాహనాలకు సంబంధించి ఇది 55 శాతంగా ఉందని గూగుల్ నివేదిక వివరించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios