హైదరాబాద్: పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. మండుతున్న ఎండలకు తోడుగా.. మార్కెట్లో టమాటోపాతో కూరగాయల ధరలు కూడా మండిపోవడంతో కొనుగోల్ల పరిమితిని తగ్గించుకుంటున్నారు సామాన్యులు.

రెండు వారాల క్రితం వరకు రూ.15 పలికిన టామాట ధర ఇప్పుడు రూ. 40కి చేరడం గమనార్హం. ఇక మిగితా కూరగాయల ధరలు కూడా ఇలాగే ఉన్నాయి. మండిపోతున్న ఎండలు, నీటి కొరతతో ఉత్పత్తి పడిపోవడంతో హైదరాబాద్ నగరానికి దిగుమతులు భారీగా తగ్గాయి. 

మోండా మార్కెట్, ఎల్బీనగర్, గుడిమల్కాపూర్, బోయిన్‌పల్లి వంటి ప్రధాన కూరగాయల మార్కెట్లతోపాటు రైతు బజార్లకు కూరగాయల సరఫరా తగ్గిపోయింది. దీంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.

గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి దిగుమతులు బాగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే, డిమాండ్ ఉండటంతో టమాటతోపాటు ఇతర కూరగాయల ధరలను కొంతమొత్తం పెంచి విక్రయిస్తున్నట్లు తెలిపారు.

ఇదే అదనుగా చూసి మరికొంత మంది వ్యాపారులు టమాటను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కిలో రూ.30 నుంచి రూ.40కి విక్రయిస్తున్నారు. రైతుబజార్లలోనూ కిలో రూ.38 చొప్పున అమ్ముతున్నారు. ఇక కాలనీల్లోని చిరు వ్యాపారుల మరింత పెంచేసి అమ్ముతున్నారు.

హైబ్రిడ్‌ టమాటా కిలో రూ.45–48, దేశీ టమాటా  రూ.35–40 చొప్పున విక్రయిస్తున్నారు. మార్చి చివరి వారంలో కిలో రూ.10–15, ఏప్రిల్‌ తొలి వారంలో రూ.15–18 మధ్య ఉన్న ధరలు ఒక్కసారిగా ఇంత మొత్తంలో పెరగడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రధానంగా మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేటతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచే హైదరాబాద్ నగరానికి అధికంగా కూరగాయలు దిగుమతి అవుతాయి. వీటితోపాటు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా, క్యాప్సికం, ఆలు, పచ్చి మిర్చి తదితర ఉత్పత్తుల దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. 

ఉత్పత్తి తగ్గడంతో సరఫరా కూడా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. రెండు వారాల క్రితం 100-150 లారీల మేర టమాటాలు దిగుమతి అయితే.. ప్రస్తుతం 50-60లారీలే వస్తున్నాయని తెలుస్తోంది. వర్షాకాలం వచ్చే వరకు కూడా కూరగాయల ధరలు తగ్గే పరిస్థితి లేదని వ్యాపారులంటున్నారు.