ఆగస్టు సమావేశంలో RBI వడ్డీ రేట్లను 5.5% వద్ద స్థిరంగా ఉంచే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అక్టోబర్‌లో రేట్ల కోతను కొందరు ఊహిస్తుండగా, మరికొందరు వెంటనే తగ్గింపుకు అవకాశం ఉందని భావిస్తున్నారు.
అమెరికా విధించిన 25 శాతం సుంకాల నేపథ్యంలో ఆగస్టు 5 నుంచి 7 వరకు జరగనున్న ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ఎలాంటి నిర్ణయాలుంటాయన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేటును 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
ANIతో ప్రత్యేకంగా మాట్లాడిన పలువురు ప్రముఖ ఆర్థికవేత్తలు ఆగస్టు 7న వెలువడనున్న విధాన నిర్ణయంపై తమ అంచనాలను, ఊహలను పంచుకున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్త దీపన్విత మజుందార్ మాట్లాడుతూ… రాబోయే సమావేశంలో RBI "వెయిట్ అండ్ వాచ్" విధానాన్ని అవలంబించే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే RBI ముందస్తు చర్యలు తీసుకున్నందున వేచి చూసే ధోరణిని అవలంబిస్తుందని ఆమె అన్నారు.
భారత జిడిపిపై టారీఫ్స్ ఎఫెక్ట్ :
అమెరికా సుంకాలు భారతదేశ ఆర్థిక వృద్ధికి ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంటున్నారు. అమెరికాకు భారతీయ ఎగుమతుల విలువ 10 శాతం తగ్గినా GDPపై దాదాపు 0.2 శాతం ప్రభావం చూపే అవకాశం ఉందని వారు అంటున్నారు.
అయితే ప్రపంచ సరఫరా గొలుసుల్లో ముఖ్యంగా ఆగ్నేయాసియాలో మరింతగా విలీనం కావడానికి, చాలా రంగాలలో ఎగుమతి పోటీతత్వాన్ని మెరుగుపరచుకోవడానికి ఇది భారతదేశానికి ఒక అవకాశంగా వారు పేర్కొన్నారు.
వడ్డీ రేట్లపై ఆర్థిక వేత్తల అభిప్రాయమిదే
పిరమల్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ దేబోపమ్ చౌదరి ANIతో మాట్లాడుతూ.. "వారు (RBI) చాలావరకు వడ్డీ రేటును 5.5 శాతం వద్దే ఉంచుతారు. అయితే అక్టోబర్‌లో 25 బేసిస్ పాయింట్ల రేట్ల కోతను మనం ఆశించవచ్చు. RBI ఆగస్టులో తన విధాన వైఖరిని పునఃపరిశీలించి, దానిని తటస్థం నుండి సర్దుబాటుకు మార్చవచ్చు." అన్నారు
బ్యాంకింగ్, మార్కెట్ నిపుణుడు అజయ్ బగ్గా కొద్దిగా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాబోయే సమావేశంలో RBIకి రేట్ల కోతకు అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. "వచ్చే వారం ఆగస్టు సమావేశంలో RBI 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించడానికి అవకాశం ఉంది. మేము రేట్ల కోతను ఆశిస్తున్నాము," అని బగ్గా ANIతో అన్నారు.
ప్రపంచ ద్రవ్య విధాన వాతావరణంపై కూడా బగ్గా వ్యాఖ్యానించారు. "అమెరికా ఫెడ్ ఊహించినట్లుగానే రేట్లను స్థిరంగా ఉంచింది. అయితే చైర్ పావెల్ పత్రికా సమావేశంలో చేసిన దూకుడు వ్యాఖ్యల కారణంగా సెప్టెంబర్ రేట్ల కోత సంభావ్యత 41 శాతానికి పడిపోయింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా ఈ ఉదయం రేట్లను స్థిరంగా ఉంచింది" అని ఆయన తెలిపారు.
మొత్తంమీద అభిప్రాయాలు మారుతూ ఉన్నప్పటికీ రాబోయే MPC సమావేశంలో RBI తన ప్రస్తుత విధాన రేటును కొనసాగిస్తుందని… ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో దానిపై ఆధారపడి స్వల్పకాలంలో సడలింపుకు అవకాశం ఉందని ఆర్థికవేత్తల సాధారణ అభిప్రాయం.
