Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: అగ్ర రాజ్యం నుంచి ‘క్లోరోక్వీన్’కు ఫుల్ డిమాండ్

గతంలో మలేరియా జ్వరం తగ్గించడానికి తెలుగునాట.. ఆ మాటకొస్తే భారతావని అంతటా ఉపయోగించిన ‘క్లోరోక్విన్​’ ఔషధానికి అంతర్జాతీయంగా.. అందునా అగ్రరాజ్యం అమెరికా నుంచి భారీ ఆర్డర్లు వచ్చాయని సమాచారం. 

US orders Chloroquine from Indian Pharma Companies
Author
New Delhi, First Published Mar 25, 2020, 11:33 AM IST

న్యూఢిల్లీ: గతంలో మలేరియా జ్వరం తగ్గించడానికి తెలుగునాట.. ఆ మాటకొస్తే భారతావని అంతటా ఉపయోగించిన ‘క్లోరోక్విన్​’ ఔషధానికి అంతర్జాతీయంగా.. అందునా అగ్రరాజ్యం అమెరికా నుంచి భారీ ఆర్డర్లు వచ్చాయని సమాచారం. 

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​ను అదుపు చేసే క్రమంలో యాంటీ వైరల్​ ఔషధాలతో కొన్ని దేశాలు చికిత్స అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్లోరోక్విన్​కు గిరాకీ పెరిగింది. ఈ క్రమంలో దేశీయ ఫార్మా కంపెనీలకు అమెరికా వంటి దేశాల నుంచి ఈ ఔషధం కోసం పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నట్లు సమాచారం.

దాదాపు నాలుగైదు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్కూళ్లు, గ్రామ పంచాయతీ ఆఫీసులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గోడలపై రాసిన ప్రకటన ఒకసారి గుర్తు చేసుకుందాం.. ‘జ్వరమా! మలేరియా కావచ్చు. క్లోరోక్వీన్ మాత్రలు వాడండి’ అని రాసిన ప్రభుత్వ ప్రకటన ఇది. ఇప్పుడు సంపన్న దేశాలకు.. యావత్ ప్రపంచానికి జీవనాడిగా మారుతోంది. 
అప్పట్లో మలేరియా పెద్ద వ్యాధి. ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో దానికి చికిత్సపై ప్రజల్లో చైతన్యం పెంచటానికి అందరినీ ఆకర్షించేలా ప్రభుత్వం ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. రెండు మూడు రోజుల పాటు జ్వరం తగ్గకపోతే మలేరియా పరీక్ష చేసి నిర్ధారణైతే క్లోరోక్విన్‌ మాత్రలు వాడాలని వైద్యులు సలహా ఇచ్చేవారు.

తదుపరి కాలంలో ప్రజల్లో చైతన్యం పెరిగి, వైద్య వసతులు అందుబాటులోకి వచ్చి మలేరియా వ్యాధి అదుపులోకి వచ్చింది. అందువల్ల క్లోరోక్విన్‌ అనే మందు అవసరం అంతగా ఏర్పడలేదు. కానీ ఇప్పుడు కరోనా వైరస్‌ వ్యాధి (కోవిడ్‌-19) విస్తరణ వల్లమళ్లీ ఈ మలేరియా మందు తెరమీదకు వచ్చింది.

కరోనా వైరస్‌ వ్యాధిని అదుపుచేసే ఔషధం కోసం ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది. ఈలోపు అందుబాటులో ఉన్న యాంటీ-వైరల్‌ ఔషధాలతో బాధితులకు కొన్ని దేశాల్లో చికిత్స చేస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. 

కానీ వీటన్నింటికంటే మలేరియా ఔషధమైన క్లోరోక్విన్‌ (హైడ్రాక్సి క్లోరోక్విన్‌) బాగా ఫలితం ఇస్తుందని వైద్యులు, శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. దీంతో అనూహ్యంగా ఇప్పుడు ఈ మందుకు గిరాకీ ఏర్పడింది. వివిధ దేశాలు ఈ మందును పెద్దఎత్తున ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు, నిల్వ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాధితో అల్లాడిపోతున్న అమెరికా మనదేశంలోని ఔషధ కంపెనీల నుంచి క్లోరోక్విన్‌ మాత్రలను భారీగా కొనుగోలు చేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇక్కడి కొన్ని ఔషధ కంపెనీలకు అవసరమైన అనుమతులన్నీ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. 

మలేరియా మందుల తయారీకి సంబంధించి మనదేశానికి చెందిన సన్‌ ఫార్మాస్యూటికల్స్‌, నాట్కో ఫార్మా, ఇప్కా లేబొరేటరీస్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతులు ఉన్నట్లు పరిశ్రమ వర్గాల కథనం. ఈ నేపధ్యంలో ఇప్కాపై ఉన్న ‘దిగుమతి ఆంక్షల’ను రెండు రోజుల క్రితం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తొలగించింది.

ఇప్కా లేబొరేటరీస్‌కు చెందిన మధ్యప్రదేశ్‌లోని రట్లామ్‌, పీతాంపూర్‌లలోని యూనిట్లు, కేంద్ర పాలిత ప్రాంతమైన సిల్వాసాలో ఉన్న యూనిట్లలో మలేరియా ఔషధాలు తయారు చేసే అవకాశం ఉంది. ఈ యూనిట్లలో హైడ్రాక్సి క్లోరోక్విన్‌ సల్ఫేట్‌, క్లోరోక్విన్‌ ఫాస్పేట్‌ ఏపీఐలను (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌), హైడ్రాక్సి క్లోరోక్విన్‌ సల్ఫేట్‌ ట్యాబ్లెట్లను తయారు చేయటానికి అనుమతించింది.

ఈ మేరకు ఈ సంస్థ యూనిట్లపై ఉన్న ఆంక్షలను అమెరికా సడలించింది. అందువల్ల ఈ ఔషధాల తయారీ, సరఫరాకు వెంటనే చర్యలు చేపట్టినట్లు ఇప్కా లేబొరేటరీస్‌ వెల్లడించింది. ఇదే విధంగా నాట్కో ఫార్మాకు చెందిన విశాఖపట్నం యూనిట్లో మలేరియా ఔషధం తయారీకి అవసరమైన ద్రువీకరణ ఇచ్చేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

ఓపక్క అమెరికా నుంచి మలేరియా ఔషధానికి గిరాకీ అధికంగా ఉండగా, అదే సమయంలో దేశీయ అవసరాలకు తగినట్లు ఈ మందును సరఫరా చేయటానికి ఫార్మా కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి అవసరం కాబట్టి కొన్ని కంపెనీలు మాత్రమే అమెరికాకు ఈ మందును సరఫరా చేస్తాయి.

కానీ దేశీయంగా హైడ్రాక్సి క్లోరోక్విన్‌ సల్ఫేట్‌ ఔషధాన్ని సరఫరా చేయటానికి పలు కంపెనీలకు అనుమతి ఉంది. పైగా దీని తయారీ పరిజ్ఞానం కూడా ఎన్నో కంపెనీలకు ఉంది అందువల్ల దేశీయ అవసరాలకు తగినంతగా క్లోరోక్విన్‌ ఔషధాన్ని సరఫరా చేయటానికి ఫార్మా కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి.

Also read:కరోనా పిడుగు: రూ. 2 లక్షల కోట్లు ఎల్‌ఐసీ ఎం-క్యాప్ గోవిందా!

కానీ ముడి పదార్ధాల రూపంలో సమస్య కనిపిస్తోంది. మలేరియా ఔషధాన్ని తయారు చేయటానికి అవసరమైన ముడిపదార్ధాలను దేశీయ కంపెనీలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. పొరుగు దేశం నుంచి ముడిపదార్థాలు సరఫరా కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సవాల్ నుంచి ఎలా గట్టెక్కాలని దేశీయ ఫార్మా కంపెనీలు మదన పడుతున్నాయి. 

దీంతో కొన్ని సంస్థలు ఇప్పుడు దేశీయంగా ముడిపదార్ధాల తయారీని చేపట్టాయి. అందువల్ల వచ్చే కొద్దిరోజుల్లో దేశీయ అవసరాలకు సరిపడా మలేరియా ఔషధాలను తయారు చేయగలిగే పరిస్థితి వస్తుందని భావిస్తున్నాయి.

ఏదైమైనా కరోనా వైరస్‌ రూపంలో ప్రాణాంతక వ్యాధి విస్తరిస్తుందనేది ఎవరూ ఊహించనట్టే, ఎన్నో ఏళ్లనాటి మలేరియా ఔషధం దీనికి కొంతమేరకు ఉపశమనం కల్పిస్తుందని వెల్లడి కావటం, దానికి అనూహ్య గిరాకీ ఏర్పడటం వైద్య, ఔషధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios