న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ అన్ని రంగాలను అతలాకుతలం చేస్తున్నది. ప్రతి రంగం కూడా వైరస్‌ కష్టాల కడలిలో కాలం వెల్లదీస్తున్నది. ఈ మహమ్మారితో ఆతిథ్య రంగానికి అపారనష్టం సంభవించింది.

ఈ వైరస్‌ను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, ఇతర ఆతిథ్య, రవాణా రంగ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ప్రత్యేకంగా ఈ వేసవి సీజన్‌లో ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి సొమ్ము చేసుకోవాలని చూసిన సంస్థలకు నిరాశే మిగిలింది.

ఈ మహమ్మారి కారణంగా ఆతిథ్య రంగ సంస్థలు 5 లక్షల కోట్లకు పైగా నష్టపోయాయి. వీటిలో సంఘటిత రంగానికి చెందిన సంస్థలు మూడో వంతు ఆదాయాన్ని కోల్పోయాయని ఒక నివేదిక వెల్లడించింది. ఆదాయ, నష్టాలతోపాటు ఉపాధికి కూడా గండికొట్టింది. దేశంలో అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో ఒకటైన ఈ రంగంలో సుమారు 2 కోట్ల మంది ఉపాధి కోల్పోనున్నారని తాజా అంచనా. 

భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఆతిథ్య రంగానికి ఎంఎస్‌ఎంఈ ట్యాగ్‌ ఇవ్వాలని కేంద్రానికి సీఐఐ సూచించింది. రూ.5 కోట్ల నుంచి రూ.75 కోట్ల లోపు వార్షిక టర్నోవర్‌ కలిగిన సంస్థలకు ఇచ్చే ఎంఎస్‌ఎంఈ ట్యాగ్‌ను రూ.250 కోట్ల లోపు టర్నోవర్‌ కలిగిన ఆతిథ్య సంస్థలకు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 

also read  అక్టోబర్ నాటికి ఎకానమీ కుప్పకూలడం ఖాయం.. డీ అండ్ బీ హెచ్చరిక ...

అలాగే వచ్చే ఏడాది మార్చి వరకు ఆతిథ్య రంగ సంస్థలకు జారీ చేసిన రుణాల వసూళ్లను నిలిపివేయాలని సీఐఐ సూచించింది. ఈ సంస్థలకు ఎంఎస్‌ఎంఈ ట్యాగ్‌ ఇవ్వడం వల్ల ఆర్థికంగా చేయూత లభించినట్లు అవుతుదని, ముఖ్యంగా తక్కువ వడ్డీకే రుణాలు లభించనున్నాయని సీఐఐ సూచిస్తున్నది. ఈ కరోనా సంక్షోభంతో కుదేలైన రంగాల్లో ఆతిథ్య రంగం ముందువరుసలో ఉన్నదని, ఈ ఏడాది చివరి నాటికి కోలుకునే అవకాశాలు లేవని స్పష్టంచేసింది. 

మరోవైపు దేశీయ రిటైల్‌ వ్యాపారులు గత 60 రోజుల్లో రూ.9 లక్షల కోట్ల వ్యాపారాన్ని కోల్పోయారని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) ఆదివారం తెలిపింది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ రూపంలో దాదాపు రూ.1.5 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్టు పేర్కొన్నది.

 కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా దుకాణాలు, వాణిజ్య మార్కెట్లు మూత పడటంతో దేశీయ వ్యాపారరంగం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ప్రభుత్వం నుంచి ఎటువంటి విధానపరమైన తోడ్పాటు లభించక భవిష్యత్తుపై వ్యాపారులు ఆందోళన చెందుతున్నారని తెలిపింది. 

గత సోమవారం నుంచి 5 శాతం వ్యాపార కార్యకలాపాలు మాత్రమే సాగుతున్నాయని, 80 శాతం మంది ఉద్యోగులు తమ స్వస్థలాలకు తరలిపోవడంతో ప్రస్తుతం దుకాణాల్లో కేవలం 8 శాతం మంది సిబ్బందే విధులకు హాజరవుతున్నారని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ వివరించారు.