న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు పొంచి ఉన్నదని ఓ తాజా నివేదికలో డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్స్‌ (డీఅండ్‌బీ) హెచ్చరించింది. ఈ ఏడాది అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో భారత జీడీపీ మాంద్యంలోకి జారుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. 

కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో వచ్చిపడిన లాక్‌డౌన్‌.. అన్ని వర్గాల ఆదాయానికి గండి కొట్టిందని, ఉద్యోగాలు భారీగా పోతున్నాయని డీఅండ్‌బీ పేర్కొన్నది. ఈ క్రమంలోనే వినియోగదారులు కొనుగోళ్లు, ఖర్చుల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. దీంతో ఈ మహమ్మారి అదుపులోకి వచ్చిన తర్వాత కూడా మార్కెట్‌లో మందగమనం కొనసాగవచ్చునని అభిప్రాయ పడింది. 

బ్యాంకు రుణాల్లో మొండి బకాయిలు పెరిగే ప్రమాదముందని, బ్యాంకింగ్‌ రంగాన్ని ఈ పరిణామం మరింత ఒత్తిడికి గురిచేయవచ్చునని  డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్స్‌ (డీఅండ్‌బీ) పేర్కొన్నది. దేశ ఆర్థిక వ్యవస్థ ఈ కష్టాల నుంచి ఎప్పుడు కోలుకోవచ్చన్నది.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపనల అమలుపైనే ఆధారపడి ఉందని డీఅండ్‌బీ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త అరుణ్‌ సింగ్‌ అన్నారు. 
దాదాపు రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రభుత్వం ప్రకటించినా ప్రజల చేతుల్లోకి నగదు వచ్చే వీలు లేకపోవడం ఈ మెగా ఉద్దీపనలోని భారీ లోటుగా అరుణ్‌ అభివర్ణించారు. కాగా, రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా 40 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించిన రెపో రేటు.. జీడీపీకి జోష్‌ ఇవ్వగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ పొడిగించిన మారటోరియం సైతం వ్యాపార, పారిశ్రామిక రంగాలకు కలిసి రావచ్చని అభిప్రాయపడ్డారు.

దేశంలో ప్రస్తుతం ప్రజలు కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యల కంటే ఆర్థిక సంక్షోభం గురించే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. లక్నో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్ (ఐఐఎం‌)లోని  సెంటర్‌ ఫర్‌ మార్కెటింగ్‌ ఇన్‌ ఎమర్జింగ్‌ ఎకానమీస్‌ (సీఎంఈఈ) ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

దేశంలో కరోనా వ్యాప్తిపై 79 శాతం మంది ఆందోళనకు గురవుతున్నారని, 40 శాతం మందిలో భయం, 22 శాతం మందిలో విచారం నెలకొన్నదని ఈ అధ్యయనంలో తేలింది. 23 రాష్ర్టాల్లోని 104 నగరాల్లో వివిధ వర్గాల ప్రజలపై ఈ అధ్యయనం నిర్వహించారు. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికంగా జరుగుతున్న నష్టంపై 32 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.

లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే జనం అసంబద్ధంగా వ్యవహరిస్తారని, దీంతో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుందని 15 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల గురించి 16 శాతం మందిలో, కరోనా వైరస్‌ బారిన పడతామని 14 శాతం మందిలో భయం నెలకొన్నట్టు ఈ అధ్యయనంలో తేలిందని లక్నో ఐఐఎం వెల్లడించింది.

ఇదిలా ఉంటే వినియోగదాుల డిమాండ్‌-సైప్లె వ్యవస్థలను సమతూకంగా ఉంచడమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాల్‌ అని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లతోపాటు రెడ్‌ జోన్లలో ఉత్పత్తిని జాగ్రత్తగా అందుబాటులోకి తేవాలని, నిలిచిన ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదాలన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా మొండి బకాయిలు భారీగా పెరిగే వీలుందని, బ్యాంకులు రుణాల పునర్‌వ్యవస్థీకరణకు వెళ్తే మంచిదని సూచించారు.