Interest Rates: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించిన విషయం తెలిసిందే. కాని ఇంకా కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు 9.5% వరకు FD వడ్డీ ఇస్తున్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఏఏ బ్యాంకులు ఎంతెంత వడ్డీ ఇస్తున్నాయో చూద్దామా?
రిజర్వ్ బ్యాంక్ (RBI) 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు రెపో రేటుని తగ్గించింది. అంటే 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ చర్య లోన్ తీసుకునే వాళ్లకి కాస్త ఊరటనిచ్చింది. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) చేసే వాళ్లకు వడ్డీ తగ్గడం పెట్టుబడిదారులకు ఇబ్బంది కలిగించింది. తమకు రావాల్సిన వడ్డీ తగ్గిపోయిందని చాలా మంది ఇతర పెట్టుబడి మార్గాలు అన్వేషించుకుంటున్నారు. బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నా, కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఇంకా 9.5% వరకు వడ్డీ ఇస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి ఇది మంచి అవకాశం. ఆ బ్యాంకులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Slice Small Finance Bank)
స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (స్లైస్ SFB) అనేది ఒక ఫిన్‌టెక్ కంపెనీ. నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(NESFB) ల విలీనం ఫలితంగా ఏర్పడింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ విలీనాన్ని ఆమోదించింది. 2025 నుంచి దేశ వ్యాప్తంగా సేవలందిస్తోంది. ఈ బ్యాంకు వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..
7 రోజుల నుంచి 120 నెలల వరకు FD లకి 3.50% నుంచి 9.00% వరకు వడ్డీ ఇస్తోంది.
సీనియర్ సిటిజన్స్ కి అదనంగా 0.50% వడ్డీ.
1 సంవత్సరం FD: 7.00%
3 సంవత్సరాల FD: 8.75%
5 సంవత్సరాల FD: 8.00%
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Unity Small Finance Bank)
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (యూనిటీ SFB) అనేది భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్-ఫస్ట్ బ్యాంక్, దీనిని సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు భారత్‌పే స్థాపించాయి.
అత్యధిక వడ్డీ: 8.60%
సీనియర్ సిటిజన్స్ కి 0.50% అదనపు వడ్డీ.
1 సంవత్సరం FD: 7.25%
3 సంవత్సరాల FD: 8.15%
5 సంవత్సరాల FD: 8.15%
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Suryoday Small Finance Bank)
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SSFB) భారతదేశంలోని ఒక నూతన తరం డిజిటల్ బ్యాంక్. ఇది గతంలో మైక్రోఫైనాన్స్ సంస్థ. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి ఆమోదం పొందిన తరువాత జనవరి 23, 2017న ఒక చిన్న ఫైనాన్స్ బ్యాంకుగా కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ బ్యాంకు వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..
అత్యధిక వడ్డీ: 8.40%
సీనియర్ సిటిజన్స్ కి 0.40% అదనపు వడ్డీ.
1 సంవత్సరం FD: 7.90%
3 సంవత్సరాల FD: 8.40%
5 సంవత్సరాల FD: 8.00%
శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Shivalik Small Finance Bank)
శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం భారతదేశంలోని నోయిడాలో ఉంది. ఇది చిన్న ఆర్థిక బ్యాంకుగా పనిచేయడానికి ఏప్రిల్ 26, 2021న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పర్మీషన్ ఇచ్చింది. ఇది దేశ వ్యాప్తంగా సేవలందిస్తోంది. ఈ బ్యాంకు వడ్డీ రేట్లు గమనిస్తే..
అత్యధిక వడ్డీ: 8.30%
సీనియర్ సిటిజన్స్ కి 0.50% అదనపు వడ్డీ.
1 సంవత్సరం FD: 6.00%
3 సంవత్సరాల FD: 7.50%
5 సంవత్సరాల FD: 6.50%
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్(Utkarsh Small Finance Bank Limited)
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో బ్యాంకు ప్రధాన కార్యాలయం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిన లైసెన్స్‌ను అనుసరించి, జనవరి 23, 2017న USFBL ఒక చిన్న ఫైనాన్స్ బ్యాంకుగా కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళతో సహా వివిధ రాష్ట్రాలలో శాఖలు, టచ్ పాయింట్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఈ బ్యాంకు వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
అత్యధిక వడ్డీ: 8.25%
సీనియర్ సిటిజన్స్ కి 0.50% అదనపు వడ్డీ.
1 సంవత్సరం FD: 6.25%
3 సంవత్సరాల FD: 8.25%
5 సంవత్సరాల FD: 7.75%
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Jana Small Finance Bank)
ఇది కూడా బెంగళూరు ప్రధాన కేంద్రంగా నడుస్తున్న చిన్న ఫైనాన్స్ బ్యాంకు. మార్చి 28, 2018న కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ బ్యాంకులో ప్రస్తుతం వడ్డీ రేట్లు ఏవిధంగా ఉన్నాయంటే..
అత్యధిక వడ్డీ: 8.20%
సీనియర్ సిటిజన్స్ కి 0.50% అదనపు వడ్డీ.
1 సంవత్సరం FD: 7.50%
3 సంవత్సరాల FD: 8.05%
5 సంవత్సరాల FD: 8.20%
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్(Ujjivan Small Finance Bank)
బెంగళూరులో ఉన్న చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఇది, 1 ఫిబ్రవరి 2017న కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ బ్యాంకు వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
అత్యధిక వడ్డీ: 8.05%
సీనియర్ సిటిజన్స్ కి 0.50% అదనపు వడ్డీ.
1 సంవత్సరం FD: 7.90%
3 సంవత్సరాల FD: 7.90%
5 సంవత్సరాల FD: 7.20%
పెట్టుబడి పెట్టేముందు అన్ని విషయాలు చెక్ చేసుకోండి
FD లలో ఎక్కువ వడ్డీ ఇచ్చే చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టే ముందు బ్యాంకు నమ్మకం, క్రెడిట్ రేటింగ్, RBI నియంత్రణ వంటివి చూసుకోవాలి. అన్ని షెడ్యూల్డ్ బ్యాంకుల్లోనూ DICGC ద్వారా రూ.5 లక్షల వరకు FD, సేవింగ్స్ ఖాతాలకి భద్రత ఉంటుంది. ఇది మీ సేవింగ్స్, FD, RD అన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి రూ.5 లక్షల వరకు మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితం. సీనియర్ సిటిజన్స్ కి ఇది మంచి ఆదాయ మార్గం.
