ముంబై: లాభాల బాటలోనే నడిచినట్లు అనిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, దేశీయంగా జోరుగా కొనసాగిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేశాయి. దీంతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. 

సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పతనం కాగా, నిఫ్టీ 11,500 మార్క్‌ను కోల్పోయింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి రావడం కూడా అంతర్జాతీయ మార్కెట్లను దెబ్బతీశాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. 

మంగళవారం ఉదయం బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లు రాణించడంతో సూచీలు లాభాల బాటాలో నడిచాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 200 పాయింట్ల వరకు లాభపడింది. నిఫ్టీ కూడా 11,600పైన ట్రేడ్ అయ్యింది. అయితే, మధ్యాహ్నం నుంచి మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. 

టాటా మోటార్స్, ఐటీసీ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంటి దిగ్గజ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీలను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. దీంతో చివర గంటలోనే మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయి.   

మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 324 పాయింట్లు పతనమై 38,276 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 11,497 వద్ద స్థిరపడ్డాయి. ఫిబ్రవరి తర్వాత భారీ పతనం ఇదే కావడం గమానర్హం.