Asianet News TeluguAsianet News Telugu

రూపీకి క్రూడ్ మంట: ఫారెక్స్ మార్కెట్లో విలవిల

ఇరాన్ నుంచి పెట్రోలియం దిగుమతులను అనుమతించబోనని అమెరికా చేసిన ప్రకటనతో డాలర్ విలువ పైపైకి దూసుకెళ్లగా, రూపాయి విలువ విల్లవిల్లాడింది. ఫలితంగా బుధవారం విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో డాలర్ పై రూపాయి విలువ 24 పైసలు బలహీన పడి 69.86 వద్ద స్థిర పడింది. రూపాయి ఒకానొక దశలో 69.97ను తాకింది.

Rupee Ends Lower At 69.86 Against Dollar
Author
New Delhi, First Published Apr 25, 2019, 9:37 AM IST

ముంబై: ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలు.. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, దేశీయంగా అమెరికా డాలర్లకు డిమాండ్ పెరిగింది.  ఫలితంగా డాలర్ పై రూపాయి మారకం విలువ బలహీనపరిచింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 24 పైసలు బలహీనపడి డాలర్తో పోలిస్తే 69.86 వద్ద ముగిసింది. 

మరోవైపు దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో ఒక దశలో రూపాయి నాలుగు నెలల కనిష్టస్థాయి 69.97ను కూడా చూసింది. అమెరికాలో గృహ కొనుగోళ్లు బాగున్నాయన్న గణాంకాలు ఆ దేశ మాంద్యం భయాలను తగ్గించాయి. దీనితో ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 97పైన పటిష్టంగా కొనసాగుతోంది. 

క్రూడ్ ధరల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో రూపాయి ఇంకొంత బలహీనపడాల్సి ఉంది. కానీ దేశంలోకి భారీగా వస్తున్న విదేశీ పెట్టుబడులు, ఈక్విటీల పటిష్ఠ ధోరణి రూపాయిని భారీగా నష్టపోకుండా చూస్తున్నాయి. రూపాయి సమీపంలో 70–68 శ్రేణిలో స్థిరీకరణ పొందవచ్చనేది  మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.   

గతేడాది అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో క్రమంగా కోలుకున్న రూపాయి క్రమంగా రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. 

మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయి నుంచి దాదాపు 20 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్ల మీదకు ఎక్కింది. నాలుగు నెలల క్రితం 72–70 మధ్య కదలాడింది. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టేది మోదీనేనన్న అంచనాలు, స్థిరంగా దేశంలోకి వస్తున్న విదేశీ నిధులు, ఈ నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ  రూపాయికి గత రెండు నెలలుగా సానుకూలమవుతోంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios