న్యూఢిల్లీ: సంపద సృష్టిలో రిలయన్స్ ఇండస్త్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది. 2014-19 వ్యవధిలో ఆర్‌ఐఎల్ రూ.5.6 లక్షల కోట్ల సంపదను సృష్టించిందని మార్కెట్ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. మోతీలాల్ ఓస్వాల్ తమ ‘వార్షిక సంపద సృష్టి అధ్యయనం-2019’ నివేదికను బుధవారం విడుదల చేసింది. 

also read  జొమాటో కొత్త ఆఫర్.. లేటైతే పుడ్ ఫ్రీ!

టాప్-100 సంస్థలు ఈ ఐదేళ్లలో అదనంగా రూ.49 లక్షల కోట్ల సంపదను సృష్టించాయని మోతీలాల్ ఓస్వాల్ సంస్థ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. మునుపెన్నడూ ఈ స్థాయిలో సంపద సృష్టి జరుగలేదని తమ తాజా అధ్యయనంలో మోతీలాల్ ఓస్వాల్ స్పష్టం చేసింది. ఏడేళ్ల విరామం తర్వాత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి సత్తా చాటింది. 

2014-19 మధ్య కాలంలో అతిపెద్ద సంపద సృష్టికర్తగా రిలయన్స్ నిలిచింది. మొత్తం రూ.5.6 లక్షల కోట్ల సంపద ఆర్‌ఐఎల్ ద్వారా పుట్టింది అని మోతీలాల్ ఓస్వాల్ తెలియజేసింది. అత్యంత వేగంగా సంపద సృష్టించడంలో ఇండియాబుల్స్ వెంచర్స్ వరుసగా రెండోసారి అగ్ర స్థానాన్ని దక్కించుకున్నది. ఈ సంస్థ స్టాక్స్ విలువ అమాంతం పెరిగిపోవడంతోనే ఈ ఘనతను సొంతం చేసుకున్నది. 

ఇక బ్యాంకింగ్ రంగంలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ అత్యంత సుస్థిర సంపద సృష్టికర్తగా నిలిచింది. సంపద సృష్టిలో ఆర్థిక రంగ సంస్థలే ముందుండగా, ప్రైవేట్ రంగ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు ఈ రంగంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి.కానీ సంపద సృష్టించడంలో ప్రభుత్వ రంగ సంస్థలు వెనుకబడ్డాయి. తాజా అధ్యయనంలో టాప్-100 సంస్థల్లో కేవలం తొమ్మిది ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే చోటు దక్కింది.

also read శామ్సంగ్ చైర్మన్ కి జైలు శిక్ష... కారణం..?

ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, ఇంద్రప్రస్థా గ్యాస్, ఎల్‌ఐసీ హౌజింగ్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్‌బీసీసీ సంస్థలు ఉన్నాయి. 2014-19 కాలంలో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో చోటుచేసుకున్న మార్పుల ఆధారంగా ఈ అధ్యయనాన్ని మోతీలాల్ ఓస్వాల్ చేసింది. విలీనాలు, విడదీతలు, పెట్టుబడులు, షేర్ల బైబ్యాక్ వంటి వాటినీ పరిగణనలోకి తీసుకున్నది.