ముంబై: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో మెగా ఒప్పందం కుదుర్చుకున్న నాలుగు రోజులకే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికాం సంస్థ జియో అనుబంధ జియో రిటైల్ వెంచర్ జియో మార్ట్ సేవలు ప్రారంభించింది.

రిలయన్స్ జియోమార్ట్ ఆన్‌లైన్ నిత్యావసర వస్తువుల సరఫరా సేవలను మొదలు పెట్టేసింది. ఫేస్ బుక్ సారథ్యంలోని మెసేంజర్ యాప్ వాట్సాప్ సహకారంతో కిరాణా సరుకులను అందించే ఆన్‌లైన్ పోర్టల్‌ను టెస్టింగ్ కోసం ఆవిష్కరించింది.

కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌  కష్టాలు కొనసాగుతున్న వేళ వాట్సాప్ ఆధారిత ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్‌ సేవలు ప్రస్తుతం నవీ ముంబై, థానే, కళ్యాణ్‌ నగరాల్లో మొదలయ్యాయి. జియోమార్ట్, దాని కొత్త భాగస్వామి వాట్సాప్‌తో కలిసి,ఈ ప్రాజెక్ట్  పైలట్ రన్‌ను త్వరలోనే అన్ని రాష్ట్రాలకు విస్తరించనుంది. 

జియో మార్ట్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవడానికి క‌స్ట‌మ‌ర్లు ముందుగా త‌మ పేరు, చిరునామా, ఫోన్ నంబ‌ర్ త‌దిత‌ర వివ‌రాల‌ను నమోదు చేయాలి. త‌రువాత త‌మ‌కు కావ‌ల్సిన స‌రుకుల‌ను ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. ఇందుకు జియోమార్ట్ 88500 08000 నంబర్ తమ మొబైల్స్ ఫోన్లలో సేవ్ చేసుకోవాలి. అనంత‌రం వాట్సాప్‌లో ఆ నంబ‌ర్‌కు హాయ్ అని మెసేజ్ పంపాలి.
 
ఆర్డర్‌ను కోసం జియోమార్ట్ ఒక లింక్‌ను అందిస్తుంది. ఈ లింక్ 30 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వినియోగదారులకు కావల్సిన సరుకులను ఎంచుకున్న తర్వాత, జియోమార్ట్ ఇన్‌వాయిస్‌తోపాటు సమీపంలోని స్టోర్  గూగుల్ మ్యాప్స్‌లో స్థానం,  చిరునామా, దాన్ని లింక్ ను షేర్ చేస్తుంది.

also read బి‌ఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్నెట్ వాడుతున్నారా...అయితే మీకో గుడ్ న్యూస్..
 
ఆర్డర్ చేసిన సరుకులు సిద్ధం అయ్యాక  సంబంధిత స్టోర్ నుంచి వినియోగదారుడికి ఎస్ఎంఎస్ వస్తుంది. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంట‌లలోపు చేసిన ఆర్డ‌ర్ల‌కు ఆ త‌రువాత 48 గంట‌ల్లో డెలివ‌రీ అవుతుంది. లేదా క‌స్ట‌మ‌ర్లు  స్టోర్ వద్దే డబ్బులు  చెల్లించి వస్తువులను అక్కడే తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి సంస్థ ఆన్‌లైన్ చెల్లింపులను అంగీకరించదనీ, త్వరలోనే ఈ వెసులుబాటు అందుబాటులోకి వస్తుందని  జియో తెలిపింది. వినియోగదారులు వివిధ గృహ ఆహార ఉత్పత్తులను రాయితీ ధరలకు మాత్రమే బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. వినియోగదారులు ఆర్డర్‌లను సవరించడానికి, లేదా రద్దు చేయడానికి ఆస్కారం లేదనీ, బిల్లింగ్‌కు ముందు  సదరుకిరణా షాపులోనే ఇలాంటివి చేసుకోవచ్చని తెలిపింది. 

జియోమార్ట్ చేపట్టిన పైలట్ ప్రాజెక్టు పరిధిలో 1200కి పైగా నైబర్ హుడ్ స్టోర్లు పాల్పంచుకోనున్నాయి. జియోమార్ట్ అధికార ప్రతినిధి మాత్రం దీనిపై మాట్లాడేందుకు నిరాకరించడం గమనార్హం. రిలయన్స్ జియోకు 38.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఫేస్ బుక్ సారధ్యంలో నడుస్తున్న వాట్సాప్ 40 కోట్ల మందికి పైగా వినియోగదారులను కలిగి ఉంది.  

ఫేస్ బుక్ ఉపాధ్యక్షుడు అజిత్ మోహన్ మాట్లాడుతూ జియోమార్ట్ సేవల విస్తరణలో రెండు సంస్థలు పరస్పర సహకారంతో ముందుకు వెళతాయన్నారు. స్థానిక స్టోర్లను గుర్తించిన యూజర్లు తమ వాట్సాప్ నంబర్ నుంచి ఆయా స్టోర్లతో సంప్రదించొచ్చు. అయితే దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల కోసం వాట్సాప్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఇంకా అనుమతులివ్వలేదు. 

ప్రస్తుత విపత్కర సమయంలో జియో మార్ట్ మెగా డీల్ ప్రాధాన్యం సంతరించుకుందని ఫిన్నోవిటి కన్సల్టింగ్ ఫౌండర్  పీఎన్ విక్రమన్ పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌తో ఒప్పందంతో  జియోమార్ట్ విస్తరణలో వాట్సాప్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.  

కాగా టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియోలో ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాను రూ.44 వేల కోట్ల‌కు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌లో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌తో క‌లిసి జియోమార్ట్ సేవ‌ల‌తో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలకు  షాకివ్వనుంది.