ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నదన్న సంకేతాల మధ్య ఆర్బీఐ మూడో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో మళ్లీ రేట్ల పెంపు వైపే మొగ్గు చూపింది. మూడు రోజులు జరిగిన ఆర్బీఐ సమీక్షలో పావు శాతం రేట్ల పెంపునకు పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో రెపో రేటు 6.5 శాతానికి, రివర్స్‌ రెపో రేటు 6.25 శాతానికి చేరాయి. బ్యాంకు రేటు, బ్యాంక్‌ రేటు, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ(ఎమ్‌ఎస్‌ఎఫ్‌) రేటు కూడా 6.75 శాతానికి పెరిగాయి. కీలక రేట్ల పెంపును ముందే అంచనా వేసిన ఎస్‌బీఐ తాజాగా ఫిక్సిడ్‌ డిపాజిటు రేటును 0.1 శాతం మేరకు పెంచింది. మిగిలిన బ్యాంకులు కూడా రుణ రేట్లును పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే గృహ, వాహన, వ్యక్తిగత రుణాల నెలవారీ వాయిదా (ఈఎంఐ) చెల్లింపులు మరికాస్త భారమవుతాయి.

వరుసగా ఇది రెండోసారి


ఆర్‌బీఐ కీలక రేట్లను పెంచడం వరుసగా ఇది రెండో సారి కావడం గమనార్హం. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే నాలుగున్నరేళ్లలోనూ ఇదే రెండో వడ్డన. మోదీ హయాంలో ఇప్పటి వరకు ఆర్‌బీఐ ఆరుసార్లు కీలక రేట్లను తగ్గించగా.. గత సమీక్షలోనే తొలిసారి కీలక రేట్లను ఆర్‌బీఐ పెంచింది. బుధవారం తాజాగా మళ్లీ కీలక రేట్ల పెంపునకు నిర్ణయం తీసుకుంది. చివరిసారి వడ్డీ రేట్లను తగ్గించింది 2017 ఆగస్టు 2న. ఆ రోజు రెపో రేటును పావు శాతం తగ్గించింది.

బేస్ రేట్ల పెంపునకు ఒక్కరే వ్యతిరేకం


ఎమ్‌పీసీలోని ఆరుగురు సభ్యుల్లో రవీంద్ర హెచ్‌ డొలాకియా మాత్రమే రేట్ల పెంపు నిర్ణయాలు వ్యతిరేకించారు. మిగిలిన ఐదుగురు సభ్యులు- ఉర్జిత్‌ పటేల్‌, చేతన్‌ ఘటే, పామి దువా, మైఖేల్‌ దేవవ్రత పాత్రా, విరాల్‌ వి ఆచార్యలు కీలక రేట్ల పెంపునకు ఓటు వేశారు.

ద్రవ్యోల్బణం నియంత్రణపైనే ఆర్బీఐ ఫోకస్


ద్రవ్యోల్బణం పెరగొచ్చనే ఆందోళనతోనే కీలక రేట్లను ఆర్‌బీఐ పెంచినట్లుగా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణ నియంత్రణపైనే ఆర్‌బీఐ ఎల్లప్పుడూ దృష్టి సారిస్తుందనే సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నంత కాలం కీలక రేట్ల పెంపు జోలికి ఆర్‌బీఐ వెళ్లదు. చమురు ధరలు తిరిగి పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గత సమీక్షలో కీలక రేట్ల పెంపునకు మొగ్గు చూపింది. ఇప్పుడు ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంపును పరిగణనలోకి తీసుకొని మరోమారు రేట్ల పెంపునకు మొగ్గుచూపింది.

7.4 శాతం వద్దే వృద్ధి


కార్పొరేట్ కంపెనీల ప్రోత్సాహక త్రైమాసిక ఫలితాలు, గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోవడం పెరగడం లాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) వృద్ధి అంచనాలను 7.4 శాతం వద్దే ఆర్‌బీఐ ఉంచింది.  సానుకూల వర్షపాతం, కనీస మద్దతు ధర పెంపుతో రైతుల ఆదాయం పెరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరిగేందుకు ఇది దోహదం చేస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. అంతేకాకుండా ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల ఆదాయాల్లో వృద్ధికి కూడా తోడ్పడతుందని తెలిపింది. వీటన్నింటి నేపథ్యంలో 2018-19 తొలి అర్థభాగంలో 7.5- 7.6%, రెండో అర్ధభాగంలో 7.3- 7.4% మధ్య వృద్ధి నమోదుకావొచ్చని అంచనా వేసింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక వృద్ధి 7.5 శాతం ఉండొచ్చని విశ్లేషించింది.

పైపైకే ద్రవ్యోల్బణం చూపులు


కనీస మద్దతు ధర పెంపు ప్రభావంతో ఆహార పదార్థాలు ప్రియం అవుతాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగానికి ద్రవ్యోల్బణ అంచనాలను ఆర్బీఐ పెంచింది. అక్టోబర్- మార్చిలో ద్రవ్యోల్బణం 4.8 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. ఇక జులై- సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 4.6 శాతంగా నమోదుకావచ్చని పేర్కొంది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికంలో ఇది 5 శాతానికి చేరొచ్చునని ఆర్బీఐ అభిప్రాయ పడింది. 

ప్రస్తుత త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.4% అంచనా


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఇంటిభత్యం పరిగణనలోకి తీసుకోకపోతే ద్రవ్యోల్బణ అంచనాలను రెండో త్రైమాసికానికి 4.4%, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థానికి 4.7- 4.8 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది. ఇంటి భత్యాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రధమార్థానికి 4.8-4.9%, ద్వితీయార్థానికి 4.7 శాతంగా ఉండొచ్చని అంచనా కట్టింది. అయితే కనీస మద్దతు ధర, ఇంటి భత్యాల పెంపు ప్రభావం ఎలా ఉన్నా, సానుకూల వర్షపాతం, చమురు ధరలు నియంత్రిత స్థాయికి దిగిరావడం, వివిధ వస్తువులపై జీఎస్‌టీ రేట్లు తగ్గడం లాంటివి ద్రవ్యోల్బణం మరింత పెరగకుండా దన్నుగా నిలుస్తాయని ఆర్‌బీఐ విశ్లేషించింది.

నాలుగు శాతాన్ని మించి ద్రవ్యోల్బణం: ఉర్జిత్ పటేల్


గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం 4 శాతానికి మించి నమోదవుతోంది. నిర్దేశిత లక్ష్యం లోపు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంపై ఆర్బీఐ దృష్టి కొనసాగిస్తుందని చెప్పడానికే జూన్‌, ఆగస్టు సమీక్షల్లో కీలక రేట్లను పెంచాం అని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. ముడి చమురు ధరలు పెరిగి, అంతర్జాతీయంగా అసమతుల్య వృద్ధి వంటి విషయాలనూ పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే ఓ వైపు ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూనే, వృద్ధికి ఊతమిచ్చే ఉద్దేశంతో తటస్థ వైఖరిని కొనసాగించాం. దేశీయ, అంతర్జాతీయ పరిణామాలతో ద్రవ్యోల్బణ ముప్పు పొంచి ఉంది. అటు వాణిజ్య యుద్ధ భయాలు కరెన్సీ యుద్ధాలుగా మారుతున్నాయని ఉర్జిత్ పటేల్ చెప్పారు.