యెస్ బ్యాంక్ దివాళా...? ఖాతాదారుల ఆందోళన....
ప్రైవేట్ రంగ బ్యాంకు ‘యస్’ బ్యాంకుపై వచ్చేనెల మూడో తేదీ వరకు మారటోరియం విధించింది. అంత కాదు నగదు విత్ డ్రాయల్స్ నెలలోపు రూ.50 వేలకే పరిమితం చేసింది. ఎస్బీఐ మాజీ సీఎఫ్ఓ ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. మరోవైపు ఈ బ్యాంకును ఎస్బీఐ సారథ్యంలోని ప్రభుత్వ బ్యాంకుల కూటమి టేకోవర్ చేయనున్నాయన్న వార్తలొచ్చాయి.
ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యెస్ బ్యాంక్‌ను ఆదుకునేందుకు ఆర్బీఐ విశ్వప్రయత్నాలే చేస్తున్నది. ప్రైవేట్ రంగ బ్యాంకు ‘యస్’ బ్యాంకుపై ఏప్రిల్ మూడో తేదీ వరకు మారటోరియం బండ పడింది. గురువారం రాత్రి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఖాతాదారులు నెలకు రూ.50 వేలు మాత్రమే ఒక్కో ఖాతా నుంచి నగదు విత్ డ్రాయల్‌కు అనుమతినిచ్చింది. సెంట్రల్ బ్యాంక్.. నగదు ఉపసంహరణలపైనా పరిమితులు పెట్టింది. ఖాతాదారులు నెలకు రూ.50 వేలకు మించి తీసుకోవాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి.
also read ప్రజాల అకాంక్షలు...హామీలే ప్రధానం: 8న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
మరోవైపు బ్యాంకు బోర్డును రద్దు చేసి.. అడ్మినిస్ట్రేటర్‌గా ఎస్బీఐ మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్‌ను నియమించింది. బ్యాంకుకు విశ్వసనీయమైన పునర్జీవ ప్రణాళిక అంటూ ఏదీ లేక పోవడంతో ప్రజా ప్రయోజనాలు, బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఒక నిర్ణయానికి వచ్చింది.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949లోని 45 సెక్షన్ కింద యస్ బ్యాంకుపై మారటోరియం విధించాలని కేంద్రానికి సూచించాలని నిర్ణయానికి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. యస్ బ్యాంకు బోర్డుకు సరిపడా సమయం కేటాయించినా విశ్వసించదగ్గ పునర్జీవ ప్రణాళికతో ముందుకు రాలేకపోయిందని ఆర్బీఐ వెల్లడించింది.
అయితే, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రైవేట్ రంగ బ్యాంకు యెస్ బ్యాంక్‌కు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, మరికొన్ని ఆర్థిక సంస్థలు ఊపిరిలూదనున్నాయి. యెస్ బ్యాంక్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకర్ల కూటమికి అనుమతి లభించినట్లు తెలుస్తున్నది.
ముంబైలో జరిగిన ఎస్బీఐ బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలియవస్తుండగా, ఏ నిర్ణయం తీసుకున్నారన్నదానిపై మాత్రం సమాచారం లేదు. మరోవైపు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీని కూడా యస్ బ్యాంకులో వాటా కొనుగోలుకు మోదీ సర్కార్ ముందుకు నెడుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే యెస్ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 8 శాతం వాటా ఉన్నది. ఈ క్రమంలో ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ కలిసి 49 శాతం వాటాను పొందే వీలు ఉన్నది. ఈ వార్తల నేపథ్యలో గురువారం యస్ బ్యాంకు షేర్లు కళకళలాడాయి.
ఈ క్రమంలోనే ఎస్బీఐతోపాటు ప్రైవేట్ రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా, యాక్సిస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లతో కూడిన కూటమి యెస్ బ్యాంక్‌కు చేయూతనివ్వనున్నట్లు గురువారం సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
ఒకప్పుడు మదుపరులకు అత్యంత ఇష్టదాయకమైన సంస్థగా ఉన్న యెస్ బ్యాంక్‌లో యాజమాన్య మార్పులు జరిగిన దగ్గర నుంచి కష్టాలు మొదలయ్యాయి. గతేడాది మార్చిలో కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ రవ్‌నీత్ గిల్ రాగా, గత ఆరు నెలలుగా రూ.15 వేల కోట్ల నిధులను సమీకరించేందుకు నానా సమస్యల్ని ఎదుర్కొంటున్నది.
గతేడాది జనవరి 31 నాటికి బ్యాంకును వీడాలని అప్పటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణా కపూర్‌ను 2018 ఆగస్టున ఆర్బీఐ ఆదేశించింది. బ్యాంకింగ్‌లో పరిపాలన, రుణాలపై ఆందోళనలు బ్యాంకును చుట్టుముట్టాయి. రవ్ నీత్ గిల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టినా పరిస్థితిలో మార్పు రాలేదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు బిలియన్ల డాలర్ల నిధులను సమీకరించాలని బ్యాంకు భావించింది. కానీ కెనడా ఇన్వెస్టర్ ఎన్పీజీసీ గ్రూప్/ఎర్విన్ సింగ్ బ్రెయిక్ బ్యాంకులో 1.2 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని బ్యాంకు బోర్డు తిరస్కరించింది. సంక్షోభం నేపథ్యంలో గతేడాది డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికం ఫలితాలను యస్ బ్యాంకు వాయిదా వేసింది.
కొన్ని వారాల క్రితమే సమస్యల్లో ఉన్న బ్యాంకును గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఉందని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. దీన్ని టేకోవర్ చేయడానికి కొటక్ మహీంద్రా బ్యాంకు సరైందని కూడా ఆయన అంతకుముందు చెప్పారు.
also read జీతం పొందే ఉద్యోగులకు చేదు వార్త... ఇపిఎఫ్ వడ్డీరేటు తగ్గిస్తూ నిర్ణయం..
ఒకవేళ ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు నిజమైతే ఒక ప్రైవేట్ రంగ బ్యాంకుకు ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు బెయిలౌట్ ఇవ్వడం 14 ఏళ్ల తర్వాత ఇదే మొదటి సారవుతుంది. 2004లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకును ఓబీసీ, 2005లో యునైటెడ్ వస్ట్రన్ బ్యాంకును ఐడీబీఐ బ్యాంకు టోకేవర్ చేశాయి.
ఎస్ బ్యాంకులో నియంత్రణ వాటా కొనుగోలు చేయడానికి ఎస్బీఐ చర్యలు తీసుకోవాలంటే ఎస్బీఐ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేవాల్లో ఈ సవరణలకు ఆమోదం తెలిపేందుకు అవకాశం ఇస్తాయని తెలుస్తోంది. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ ప్రస్తుతం యస్ బ్యాంకు డైరెక్టర్ గా ఉండటం గమనార్హం.
ఏదైనా పరిణామాలు చోటుచేసుకుంటే సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇస్తామని ఎస్బీఐ తెలిపింది. ఆర్బీఐ, ప్రభుత్వం, ఎస్బీఐల నుంచి తమకు ఎటువంటి సమాచారం ప్రస్తుతానికి అందలేదని ఎస్ బ్యాంకు తెలిపింది.