ప్రజల అకాంక్షలు...హామీలే ప్రధానం: 8న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
ఆర్థిక మాంద్యం, కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల ఎనిమిదో తేదీన రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు తొలి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం బడ్జెట్ నిడివి రూ.1.62 లక్షల కోట్ల లోపే ఉంటుందని తెలుస్తోంది.
హైదరాబాద్: ప్రజా ఆకాంక్షలు, ప్రభుత్వ హామీలు, ప్రాధాన్య రంగాలకు తెలంగాణ సర్కార్ పెద్ద పీట వేయనున్నది. అయినా వాస్తవ గణాంకాలే ప్రాతిపదికగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 8వ తేదీన ప్రవేశ పెట్టనున్నది. అనవసర ప్రాధాన్యం గల పథకాలకు కత్తెర వేసి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వనున్నది.
ప్రణాళికా వ్యయానికి కూడా కళ్లెం వేసి, ఆచితూచి తెలంగాణ ప్రభుత్వం కేటాయింపులు జరుపనున్నది. పల్లె, పట్టణ ప్రగతి పథకాలకు రూ.7,000 కోట్లు, రుణ మాఫీ కోసం రూ.10 వేల కోట్ల ప్యాకేజీని వార్షిక బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలకు నిధుల విడుదలలో ప్రాధాన్యం లభించనున్నది. రమారమీ రూ.1.62 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రవేశ పెట్టనున్నారు.
also read పూణే టీచర్‌ను అభినందించిన ఆనంద్ మహీంద్రా....
రాష్ట్ర స్థూల ఉత్పత్తి పురోగమనం నేపథ్యంలో మొత్తం ఆదాయంలో 3.5 శాతం ప్రకారం అంటే రూ.22 వేల కోట్ల మేరకు ఎఫ్ఆర్బీఎం చట్టం కింద మార్కెట్ రుణాలను తెచ్చుకోవడానికి బడ్జెట్‌లో ప్రతిపాదనలను రూపొందించనున్నారు.
కేంద్ర సాయం, గ్రాంట్లతోపాటు ఆర్థిక వనరులపై అంచనాలు పెట్టుకుని ఆర్థిక మాంద్యం, తగ్గిన రాష్ట్ర రాబడులను కూడా పరిగణనలోకి తీసుకుని ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక శాఖ పక్కాగా అంచనాలు రూపొందించినట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వ రాబడి సుమారు రూ.80 వేల కోట్ల లోపే. దీంతోపాటు అప్పులు, వడ్డీలు అసలు చెల్లింపులను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ పద్దు సిద్ధమైంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను రూ.1.46 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాదిలో రాష్ట్రానికి జీఎస్టీ, పన్నేతర ఆదాయం అంచనాల కంటే భారీగా తగ్గిపోయాయి. ఈ ఏడాది ఆదాయం రూ.1,37,226 కోట్లు వస్తుందని అంచనా వేస్తే.. గత జనవరి నాటికి అది రూ.1,05,922 కోట్లకు పరిమితమైంది. ఈ నెలాఖరు నాటికి అది రూ.1,33,491 కోట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి.
ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, ఆసరా ఫించన్లు, అప్పులపై వడ్డీలు, వాయిదా చెల్లింపులకు తప్పనిసరిగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. వడ్డీలు, వేతనాలు, ఆసరా ఫించన్లు, పింఛన్లకే రూ.50 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది.
also read జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడిపై మనీ లాండరింగ్ కేసు...
ఈసారి ఫించన్లకు రూ.12 వేల కోట్లు, రైతు రుణ మాఫీకి రూ.10 వేల కోట్లు, పల్లె కం పట్టణ ప్రగతికి రూ.7000 కోట్లు, సాగునీటికి రూ.12 వేల కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
2014లో తెలంగాణ ఆవిర్భావం నుంచి ఏటా 12 శాతం పెంపుతో బడ్జెట్ ప్రవేశ పెడుతూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. మాంద్యం పేరిట ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూ.1.46 లక్షల కోట్లకు పరిమితం చేసింది. 2018-19లోనూ రూ. 1.74 లక్షల కోట్ల అంచనాలను రూ.1.61 లక్షల కోట్లకు సవరించారు.
సొంత వనరుల రాబడితోపాటు మూల ధన వ్యయాలు కూడా ఏయేటికాయేడు పెరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2004-05 నుంచి 2013-14 మధ్య ఉమ్మడి రాష్ట్ర క్యాపిటల్ వ్యయం రూ.1,29,683 కోట్లు.
తెలంగాణ ప్రాంత వాటా 41.68 శాతంతో రూ.54.052 కోట్లకు పరిమితమైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014-15 నుంచి 2018-19 వరకు బడ్జెట్, బడ్జెటేతర వ్యయాలు రూ.1.64,519 కోట్లుగా నమోదయ్యాయి.