బెంగళూరు: దేశీయంగా క్యాబ్ సేవలందిస్తున్న ప్రముఖ సంస్థ ఓలాకు చెందిన ఓటా ఎలక్ట్రిక్‌లో టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఆఫ్ ఎమిరస్ రతన్‌ టాటా  పెట్టుబడులు పెట్టారు. ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌లో కూడా రతన్‌ అంతకుముందు పెట్టుబడులు పెట్టారు. 

రతన్ టాటా ఎంత పెట్టుబడులు పెట్టిందీ ఓలా యాజమాన్యం బహిర్గతం చేయలేదు. సంస్థలో విద్యుత్‌ వాహనాల విభాగానికి సంబంధించి ఇప్పటికే టైగర్‌ గ్లోబల్‌, మాట్రిక్స్ ఇండియా వంటి సంస్థలు వాటాదార్లుగా కొనసాగుతున్నాయి. వీటన్నిటి వల్ల ఇప్పటికే ఓలా విద్యుత్‌ ఎలక్ట్రిక్‌కు రూ.400 కోట్ల మేర పెట్టుబడులు అందాయి. ప్రత్యేకించి నాగ్ పూర్ కేంద్రంగా ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ పైలట్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నది. 

ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ 2021కల్లా దేశంలో 10 లక్షల విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టాలనే సంస్థ లక్ష్యానికి ఈ పెట్టుబడులు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. 

‘ఓలాలో రతన్ టాటా పెట్టబడులు పెట్టడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఆయన మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. మాకు దిశానిర్దేశం చేసేందుకే ఆయన వస్తున్నారు. ప్రపంచంలోని అన్ని తరగతుల వారూ భరించగలిగేలా రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా లక్ష్యం. 2021 కల్లా 10 లక్షల విద్యుత్‌ వాహనాలను తీసుకొస్తాం. ఓలా ఎలక్ట్రిక్ బోర్డులోకి, ఒక ఇన్వెస్టర్‪గా, ఒక మెంటర్‌గా రతన్ టాటాను ఆహ్వానించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’అని అన్నారు.

భవిష్ అగర్వాల్‌ చేసిన వ్యాఖ్యలపై రతన్ టాటా స్పందిస్తూ.. ‘ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన విధానాలు ఎంతో బాగుంటాయి. ఆయన దృష్టి ఎప్పుడూ లక్ష్యం వైపే ఉంటుంది. ఆయనతో కలిసి చేస్తున్న ఈ ప్రయాణంలో మరెన్నో మైలురాయిలను దాటుకుంటూ వెళ్లగలం. ప్రతిరోజూ ఎలక్ట్రిక్ వెహికల్ నాటకీయంగా ఎకోసిస్టమ్ కల్పిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్.. విద్యుత్ వాహనాల వినియోగంలో గ్రోత్ తోపాటు అభివ్రుద్ధి సాధిస్తుందని నమ్ముతున్నాను’అని అన్నారు. 

ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం పలు పైలట్ ప్రాజెక్టులు రన్ చేస్తోంది. ప్రత్యేకించి చార్జింగ్ స్టేషన్ల నిర్మాణం, బ్యాటరీ స్వాపింగ్ స్లేషన్ల ఏర్పాటుతోపాటు ద్వి, త్రి, ఫోర్ వీలర్స్ విభాగంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంపొందించడంపై ద్రుష్టి సారించింది.