Asianet News TeluguAsianet News Telugu

మరో వివాదం: ఎస్సార్ స్టీల్ ‘మిన్నెసోటా’పై చందాకొచ్చర్ ప్రేమ!

ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ కం సీఈఓగా పని చేసిన చందా కొచ్చర్ కేవలం వీడియో కాన్ విషయంలోనే కాదు ఎస్సార్‌ స్టీల్స్ సంస్థకు మంజూరు చేసిన రుణాలపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
 

Previously unseen Essar trails emerge, the bell tolls faster for   Chanda Kochhar
Author
New Delhi, First Published May 4, 2019, 10:42 AM IST

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్‌పై మరోసారి వివాదం తలెత్తింది. వీడియోకాన్‌ విషయంలోనే కాదు.. ఎస్సార్‌ స్టీల్‌ రుణాల మంజూరుపైనా అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. వందల మిలియన్‌ డాలర్ల మేరకు రుణాలను ఎస్సార్‌స్టీల్‌కు చెందిన మారిషస్‌ అనుబంధ కంపెనీ ఎస్సార్‌ స్టీల్‌మిన్నెసోటా ఎల్‌ఎల్‌సీకి నిబంధలకు విరుద్ధంగా పంపిణీ చేసినట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని బట్టి తెలుస్తోంది. ఈ విషయంలో ఆర్‌బీఐ ప్రశ్నించినా పక్కదోవ పట్టించినట్లు ఆ కథనం సమాచారం.

చందా కొచ్చర్‌ ఆధ్వర్యంలో జారీ చేసిన రుణాలపై తొలిసారిగా ఆర్బీఐ 2014 జూలైలో సందేహాలు వ్యక్తం చేసింది. కొన్ని దర్యాప్తు రికార్డుల ప్రకారం.. ఎస్సార్‌స్టీల్‌కు చెందిన మిన్నెసోటా ఎల్‌ఎల్‌సీ కంపెనీకి ఆ బ్యాంకు 365 మిలియన్ల డాలర్ల విలువైన రుణాలను జారీ చేసింది. 

ఎస్సార్ స్టీల్ అనుబంధ మిన్నెసోటా ఎల్ఎల్ సీకి మంజూరు చేసిన ఈ రుణం విషయంలో పలు అవకతవకలు జరిగినట్లు ఆర్బీఐ కనిపెట్టినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన కథనంలో తెలిపింది. ఎస్సార్‌ గ్రూప్‌నకు రుణాలిచ్చిన అతిపెద్ద బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా ఒకటి. 

2019-10 ప్రారంభం నుంచి 2018-19 చివరి దాకా ఈ బ్యాంకు ఎస్సార్‌కు 71 రుణాలు మంజూరు చేసినట్లు ఆ పత్రిక విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది. కాగా, ఈ రుణాలను జారీ చేసిన కమిటీలు పాల్గొన్న 35 సమావేశాలకు చందాకొచ్చర్‌ కూడా హాజరయ్యారు. 

ముఖ్యంగా ఎస్సార్‌స్టీల్‌ మిన్నెసోటా ప్రాజెక్టు వార్షిక సామర్థ్యాన్ని 4.1 మిలియన్‌ టన్నుల నుంచి 7 మిలియన్‌ టన్నులకు పెంచుకోవడం కోసం ఇచ్చిన రుణాల విషయంలో ఆర్బీఐ అనుమానాలు వ్యక్తం చేసింది.

ఈ ప్రాజెక్టుకు అవసరమైన రుణాల మంజూరుకు అనుమతులిచ్చిన  విషయమై ఆర్‌బీఐ పలు ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా రుణ ఒప్పందంలోని సౌలభ్యాలపై అనుమానం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు ఏర్పాటును పొడిగించుకోవడానికి అందులో ఐసీఐసీఐ బ్యాంకు అంగీకరించింది. 

ఆ కంపెనీ తీసుకున్న ఒక రుణానికి సహాయపడడానికి తాజాగా మరో రుణం ఇస్తూ పోయిందని.. ఎప్పటికప్పుడు రుణాలు ఇస్తూనే ఉందని ఆర్బీఐ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రుణాలను ‘ప్రమాణాలు లేని ఆస్తుల’ విభాగంలోకి చేర్చాలని కూడా ఆర్‌బీఐ అప్పట్లోనే చెప్పింది. 

ఆర్‌బీఐ ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంక్‌ ఒప్పుకోలేదు. ప్రాజెక్ట్‌ సామర్థ్యం పెరిగింది కాబట్టి రుణాలను ఇచ్చామని.. అదనంగా ఎటువంటి నిధులు ఇవ్వలేదని బ్యాంకు చెప్పుకొచ్చింది. అయితే అందుకు విరుద్ధంగా చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది. 

2014 జూన్‌లో విదేశీ కరెన్సీ రూపంలో ఎస్సార్‌ స్టీల్‌ మారిషస్‌ శాఖకు 365 మిలియన్‌ డాలర్ల రుణం ఇచ్చింది. రుణ కమిటీ సమావేశం మినిట్స్‌లోనూ ‘ఎస్సార్‌స్టీల్‌ మిన్నెసోటాకు నిధులు అందజేసినట్లు’ ఉందని ఆ దర్యాప్తు వెల్లడిస్తోంది.

ఆర్‌బీఐ అడిగినప్పటికీ.. ఎటువంటి అదనపు నిధులూ ఇవ్వలేదని చందాకొచ్చర్‌ ఆర్‌బీఐని తప్పుదోవ పట్టించారని దర్యాప్తులో తెలుస్తోంది. ఆ గ్రూపు పలు ఎగవేతలకు పాల్పడినా.. రేటింగ్‌ సంస్థలు ప్రతికూల రేటింగ్‌ ఇచ్చినా.. బయటి నుంచి పలు ఫిర్యాదులు వచ్చినా కూడా కొచ్చర్‌ ఆధ్వర్యంలోని ఐసీఐసీఐ బ్యాంకు రుణాలను కొనసాగించింది. 

ఏ బ్యాంకు కూడా ఆ గ్రూపునకు రుణాలు ఇవ్వడానికి ఆసక్తి చూపకున్నా ఐసీఐసీఐ మాత్రమే ఎందుకు ఆసక్తి చూపుతోందంటూ బయటి నుంచి ఫిర్యాదులు వచ్చినా.. వాటిపై కొచ్చర్‌ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి.

ఎస్సార్ గ్రూప్ పనితీరు, ప్రగతిపై పరిశీలించి రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా.. కొచ్చర్‌ ఆ పని చేయలేదని తెలుస్తోంది. ఈ సంఘటనలన్నీ 2011-2016లో జరిగినవని.. ఆ తర్వాతి నుంచే బ్యాంకు తన బ్యాలెన్స్‌ షీటులో నష్టభయాలను తగ్గించుకునేందుకు గట్టి చర్యలు చేపట్టామని ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధి సదరు పత్రికకు వివరణ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios