నీరవ్ మోదీ కొల్లగొట్టింది 13 వేల కోట్లు కాదు....ఏంతంటే?
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ని మోసగించిన నీరవ్ మోదీ స్కాం డబులైంది. ఆయన లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్ పేరిట కొల్లగొట్టింది రూ. 13 వేల కోట్లు కాదు రూ.25 వేల కోట్లు అని ఫోరెన్సిక్ దర్యాప్తు సంస్థ బీడీఓ వెల్లడించింది.
న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) స్కామ్ బయటికి వచ్చినప్పుడు దేశమంతా నివ్వెరపోయింది. బ్యాంకు సొమ్ము రూ.13,500 కోట్లను నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ కొల్లగొట్టారని తెలియడంతో బ్యాంకింగ్‌రంగం షాకింగ్‌కు గురైంది.
డొల్ల కంపెనీల ద్వారా మోదీ, అతని మనుషులు బ్యాంకు సొమ్మును దోచేస్తున్నా ఎవరూ కనిపెట్టలేకపోయారు. అయితే ఈ కథ ఇక్కడితో ముగియలేదు. తవ్వినకొద్దీ మరిన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ ఘటన జరిగాక పీఎన్బీ యాజమాన్యం ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించింది. ఈ కమిటీ పలు సంచలన విషయాలను వెల్లడించింది.
also read విశాఖలో ఇండియన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కేంద్రాన్ని ఏర్పాటుచేసిన ఉబెర్
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.28 వేల కోట్ల విలువైన 1,561 లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్స్ (ఎల్‌ఓయూ)ను పీఎన్బీకి నీరవ్ మోదీ గ్రూప్ ఇచ్చినట్టు బెల్జియన్ ఆడిటింగ్ కంపెనీ బీడీఓ బయటపెట్టింది. వీటిలో రూ.25 వేల కోట్ల విలువైన 1,381 ఎల్‌ఓయూలను మోసపూరితంగా ఇచ్చారని స్పష్టం చేసింది.
23 మంది ఎగుమతిదారులకు ఎల్‌ఓయూలను ఇవ్వగా, వీరిలో 21 మందిని మోదీ ‘కంట్రోల్’ చేశాడని తేలింది. 193 ఎల్‌ఓయూల ద్వారా అందిన రూ.6 వేల కోట్లను బ్యాంకుకు చెల్లించచకుండా దుర్వినియోగం చేశారని బీడీఓ వేలెత్తిచూపింది. పీఎన్బీ కుంభకోణం గురించి బీడీఓ ఇది వరకే ఐదు మధ్యంతర నివేదికలు ఇచ్చింది. తాజాగా అందజేసింది చివరి నివేదిక.
329 పేజీలు ఉన్న ఈ ఫోరెన్సిక్ రిపోర్టు కాపీని ఒక విజిల్ బ్లోయర్ ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే)కు అందింది. ఇందులో భాగమైన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక వివరాలను బయటపెట్టింది. బీడీఓ డ్రాఫ్ట్ రిపోర్ట్‌ను పీఎన్‌బీ ఇది వరకే సీబీఐ, ఈడీ సహా పలు సంస్థలకు అందజేసింది.
విచారణలో భాగంగా బీడీఓ టీమ్ నీరవ్ మోదీ, అతడి కుటుంబ సభ్యుల ఆస్తులను వివరాలను పరిశీలించింది. భారతదేశంలో వీరికి 20 వరకు ఆస్తులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దానినీ బ్యాంకు లోన్లు పొందడానికి తనఖా పెట్టలేదు. ఒక్క నీరవ్ మోదీ పేరిట మనదేశంలో ఉన్న 15 ఆస్తుల విలువ రూ.1,300 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. నీరవ్ మోదీ ఆస్తులను బ్యాంకులు, దర్యాప్తు సంస్థల ఆఫీసర్లు జప్తు చేశారు.
also read సెబీ ఆదేశాలు నిలిపివేత.. కార్వీ క్లయింట్ల షేర్ల బదిలీపై ‘శాట్’
ఇతనికి విదేశాల్లో 13 స్థిరాస్తులూ ఉన్నట్టు గుర్తించారు. అంతేగాక ఐదు లగ్జరీకార్లు, బోటును చరాస్తులుగా గుర్తించారు. మోడీ రూ.20 కోట్ల విలువైన 106 పెయింటింగులనూ కొన్నాడు. వీటిని ఎంఎఫ్ హుస్సేన్, జామినీ రాయ్, జోగెన్ చౌదరి, రాజా రవివర్మ వంటి ఫేమస్ ఆర్టిస్టులు గీశారు.
పీఎన్‌బీ స్కామ్ బయటపడ్డాక చోక్సీ, మోదీ పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా బార్బుడాలో, నీరవ్ మోదీ బ్రిటన్‌లో ఉంటున్నారు. ఈ ఏడాది మార్చిలో నీరవ్ లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. తదనంతరం అక్కడి పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. నీరవ్ మోదీని ఇండియాకు అప్పగించే విషయమై ప్రస్తుతం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. తదుపరి విచారణ వచ్చే ఏడాది మే నెలకు వాయిదా పడింది.
నీరవ్ మోదీ సమీప బంధువు చోక్సీని అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆంటిగ్వా ప్రభుత్వం ప్రకటించింది. ఇతడు తమను రూ.44.1 కోట్లకు మోసం చేశాడని మరో ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (పీఎస్‌బీ) కూడా ఇటీవల వెల్లడించింది. మెహుల్ చోక్సీని ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ప్రకటించింది. బాకీ వసూలుకు చట్టపరమైన చర్యలు మొదలుపెట్టినట్టు ప్రకటించింది. దీంతో కలుపుకుంటే చోక్సీ మూడు ప్రభుత్వ బ్యాంకులకు టోపిపెట్టాడు.