Asianet News TeluguAsianet News Telugu

సెబీ ఆదేశాలు నిలిపివేత.. కార్వీ క్లయింట్ల షేర్ల బదిలీపై ‘శాట్’

ఆర్థిక సేవల సంస్థ కార్వీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సంస్థ క్లయింట్లకు షేర్ల బదిలీని అప్పిలేట్ ట్రిబ్యునల్ శాట్‌ నిలిపివేసింది. బుధవారం తుది ఆదేశాలు జారీ చేయనున్నది.దాంతో 83వేల మంది (దాదాపు 90%) ఖాతాదారులకు కార్వీ తాకట్టు పెట్టుకున్న షేర్లను ఎన్‌ఎస్‌డీఎల్‌ తిరిగి బదిలీ చేసింది. 

SAT halts further transfer of client securities after lenders challenge SEBI decision
Author
Hyderabad, First Published Dec 4, 2019, 11:48 AM IST

న్యూఢిల్లీ: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సంస్థ తాకట్టు పెట్టిన ఖాతాదారుల షేర్లను మరిన్ని బదిలీ చేయకుండా సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) సస్పెన్షన్‌ విధించింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ కేసులో తుది ఆదేశాలు జారీ చేయనున్నది.

కార్వీ ఆధీనంలో ఉన్న ఖాతాదారుల షేర్లను తిరిగి వారి అకౌంట్లలోకి బదిలీ చేయాలని డిపాజిటరీ సంస్థ ఎన్‌ఎస్డీఎల్‌ను గత నెలలో సెబీ ఆదేశించింది. దాంతో 83వేల మంది (దాదాపు 90%) ఖాతాదారులకు కార్వీ తాకట్టు పెట్టుకున్న షేర్లను ఎన్‌ఎస్‌డీఎల్‌ తిరిగి బదిలీ చేసింది. 

సెబీ నిర్ణయాన్ని సోమవారం బజాజ్‌ ఫైనాన్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో సవాలు చేసింది. కార్వీకి రుణాలిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ ఇంకా ఇతర ఆర్థిక సంస్థలు కూడా మంగళవారం బజాజ్‌ ఫైనాన్స్‌తో జత కలిశాయి.

also read సుందర్​ పిచాయ్‌కు ప్రమోషన్.. ఆల్ఫాబెట్ బాధ్యతలు ఇక సుందర్‌కే
 
కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ మొత్తం 95 వేల మంది ఖాతాదారుల రూ.2,300 కోట్ల విలువైన షేర్లను వారి అనుమతి లేకుండానే తనఖా పెట్టి రూ.600 కోట్ల రుణం పొందింది. కంపెనీ తమకు తాకట్టు పెట్టిన షేర్లపై తమకే హక్కు ఉంటుందన్నది రుణదాతల వాదన. తమకు తాకట్టు పెట్టిన షేర్లను కార్వీ క్లయింట్లకు తిరిగిచ్చేయాలని సెబీ ఆదేశించడాన్ని తప్పుబట్టాయి.

క్లయింట్లకు తిరిగిచ్చేసిన సెక్యూరిటీలను మళ్లీ వాపసు తీసుకొని ఈ కేసు తేలేవరకు ఎస్ర్కో అకౌంట్‌లో జమ చేయాలని బ్యాంకుల తరఫున న్యాయవాది కోరారు. రుణదాతల వాదనలను విన్న శాట్‌ బెంచ్‌.. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (బీఎస్ఈ)కి చెందిన డీపీ ఖాతా నుంచి మరిన్ని షేర్లను బదిలీ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ విషయంలో బజాజ్‌ ఫైనాన్స్‌తోపాటు ఇతరుల వాదనలు వినాలని, తదనుగుణంగా ఈ నెల 10లోగా తుది నిర్ణయం తెలియజేయాలని సెబీని శాట్‌ కోరింది. ఇదిలా ఉంటే కార్వీనే కాదు, పలు ప్రముఖ బ్రోకరేజీ కంపెనీలు సైతం ట్రేడింగ్‌ కార్య కలాపాల నిర్వహణకు రుణాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దేశంలోని టాప్‌-15 బ్రోకర్లకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రూ.9,000 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేశాయి.

also read హెచ్‌డీఎఫ్‌సీతో వాల్‌మార్ట్‌ జత: ‘బెస్ట్‌ ప్రైస్‌' కస్టమర్లకు క్రెడిట్‌ కార్డు
 
స్టాక్‌ ఎక్స్ఛేంజీ, మార్కెట్‌ నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈతోపాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ(ఎంసీఎక్స్‌) సోమవారం కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ట్రేడింగ్‌ లైసెన్సును రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఈక్విటీ, క్యాష్‌, కరెన్సీ, కమోడిటీస్‌.. ఇలా అన్ని సెగ్మెంట్లలోనూ కంపెనీ ట్రేడింగ్‌ లైసెన్సు సస్పెండ్‌ చేశాయి. స్టాక్‌ ఎక్స్ఛేంజీల నిర్ణయంపై కంపెనీ అదే రోజు సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌)ను ఆశ్రయించింది. అయితే, ట్రేడింగ్‌ లైసెన్సు రద్దు ఎత్తివేత కోసం ఎన్‌ఎస్ఈ క్రమశిక్షణ కమిటీని సంప్రదించాలని మంగళవారం కార్వీని శాట్‌ కోరింది.

ఎన్‌ఎస్ఈ క్రమశిక్షణ కమిటీ కార్వీ వాదనలు విన్న అనంతరం ఈ నెల 6న తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నది. ట్రేడింగ్‌ లైసెన్సు రద్దుతో కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. కొత్త క్లయింట్లను చేర్చుకోవడమే కాదు ఆర్డర్లను సైతం ఎగ్జిక్యూట్‌ చేయకుండా ఇప్పటికే కంపెనీపై సెబీ నిషేధం విధించింది. అంతేకాదు, క్లయింట్లు కంపెనీకి కల్పించిన పవర్‌ ఆఫ్‌ అటార్నీ(పీఓఏ)ని సైతం ఉపయోగించుకోరాదని ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios