కార్వీ లైసెన్స్ పునరుద్ధణకు ఎన్ఎస్ఈ తిరస్కరణ...?
తమ ట్రేడింగ్ లైసెన్స్ సస్పెన్షన్ నిర్ణయాన్ని ఎత్తేయాలని కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) తిరస్కరించింది.కంపెనీ లైసెన్స్ రద్దు చేస్తూ ఈ నెల రెండో తేదీన ఎక్స్ఛేంజ్ తీసుకున్న నిర్ణయాన్నే కమిటీ బలపరిచినట్లు సమాచారం.
ముంబై: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు మరోషాక్ తగిలింది. ట్రేడింగ్ లైసెన్స్ రద్దు నిర్ణయాన్ని ఎత్తివేయాలన్న సంస్థ అభ్యర్థనను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ) క్రమశిక్షణ కమిటీ తిరస్కరించింది. కార్వీ అప్పీల్‌ను ఈనెల 6వ తేదీన క్రమశిక్షణ కమిటీ తోసిపుచ్చిందని, కంపెనీ లైసెన్స్ రద్దు చేస్తూ ఈ నెల రెండో తేదీన ఎక్స్ఛేంజ్ తీసుకున్న నిర్ణయాన్నే కమిటీ బలపరిచినట్లు సమాచారం.
వాస్తవంగా కార్వీ ట్రేడింగ్ లైసెన్స్ రద్దును సవాలు చేస్తూ గత మంగళవారం సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)ను ఆశ్రయించింది. ఈ విషయమై ఎన్‌ఎస్ఈ క్రమశిక్షణ కమిటీని సంప్రదించాలని కంపెనీకి శాట్ సూచించింది.కార్వీ స్టాక్ బ్రోకింగ్ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు ఖాతాదారులకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన షేర్లను దుర్వినియోగం చేసింది. దాంతో ఈ కంపెనీ ట్రేడింగ్ లైసెన్స్‌ను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) రద్దు చేసింది.
also read బీకేర్‌ఫుల్: పవర్ ఆఫ్ అటార్నీపై ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ అడ్వైజరీ
ఎన్‌ఎస్ఈతోపాటు బీఎస్ఈ, ఎంసీఎక్స్ సైతం కార్వీకి చెందిన అన్ని విభాగాల (ఈక్విటీ, క్యాష్, కమోడిటీ, కరెన్సీ) ట్రేడింగ్ లైసెన్సును సస్పెండ్ చేశాయి. దాంతో కార్వీ కార్యకాలాపాలు గత సోమవారం నుంచే నిలిచిపోయాయి. కార్వీ తరహాలో ఖాతాదారుల షేర్లను దుర్వినియోగపరిచిన, బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టిన బ్రోకరేజీ సంస్థలు ఇంకెన్ని ఉన్నాయో గుర్తించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలను సెబీ కోరింది.
రానున్న కాలంలో చేపట్టబోయే వార్షిక తనిఖీల్లో ఈ విషయంపై ప్రధానంగా దృష్టి సారించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఈసారి ఎక్స్ఛేంజ్‌లు బ్రోకరేజీ పద్దులపై చాలా క్షుణ్ణంగా, విస్తృత తనిఖీలు చేపట్టనున్నట్లు సెబీ తెలిసింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్, డీహెచ్‌ఎఫ్ఎల్‌లో జరిగిన అక్రమాల కేసుల్లో పలు నియంత్రణ సంస్థలు చేపట్టిన చర్యలపై చట్టపరంగా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ గౌడ అన్నారు.
ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నియంత్రణ సంస్థలతో కలిసి కృషిచేయాల్సిన అవసరం ఉందని రాజ్యసభ ఎంపీ రాజీవ్ గౌడ అన్నారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ తన 95వేల మంది ఖాతాదారుల షేర్లను వారి అనుమతి లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి సొంత అవసరాలకు రుణాలు తీసుకుంది.
also read ఒరాకిల్ డైరెక్టర్‌గా ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా
రుణ సంక్షోభంలో చిక్కుకున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్.. పలు డొల్ల కంపెనీలకు రుణాల పేరుతో రూ.31,000 నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నది. బ్రోకరేజీ సంస్థ బీఎంఏ వెల్త్ క్రియేటర్స్ (బీఆర్‌హెచ్ వెల్త్ క్రియేటర్స్‌గా పేరు మార్చుకుంది)పై కఠిన చర్యలు చేపట్టాలని సంస్థ ఇన్వెస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. సంస్థపై చర్యలు చేపట్టాలని కోరుతూ కోల్‌కతాలోని సెబీ కార్యాలయం ముందు ప్రదర్శనలు జరపనున్నట్లు వారు తెలిపారు.
ఖాతాదారులకు చెందిన రూ.100 కోట్ల విలువైన షేర్లను దారి మళ్లించినట్లు బీఎంఏ వెల్త్ ప్రమోటర్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్‌ఎస్‌ఈ అక్టోబరులోనే ఈ బ్రోకర్ లైసెన్సును సస్పెండ్ చేసింది.