Asianet News TeluguAsianet News Telugu

ఇండో- అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌: ఇవీ గందరగోళానికి కారణాలు..

ఉత్పత్తులపై భారత్‌ అత్యధిక సుంకాల్ని విధిస్తోందని, ప్రత్యేకించి వ్యవసాయ ఉత్పత్తులపై మరీ ఎక్కువగా ఉంటున్నాయని అమెరికా వాదన. ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్‌ సర్కారు భారీగా వడ్డించిన సుంకాలను ఉపసంహరించాలన్నది భారత్ వాదన. 

No India-US trade pact, but other 'significant deals' likely during Trump visit
Author
New Delhi, First Published Feb 23, 2020, 12:56 PM IST

న్యూయార్క్: భారత్‌ విధిస్తున్న అధిక పన్నులే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల మెరుగుదలకు ప్రధాన అడ్డంకిగా నిలుస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరుచుగా చేసే ఆరోపణ. భారత్‌ కొత్తగా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలు తమకు ఆందోళనకరంగా ఉన్నాయని, అందువల్ల ట్రంప్‌ పర్యటనలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాల్లేవని అమెరికా వైట్‌హౌస్‌ ప్రతినిధి తాజాగా చెప్పారు. 

ఈ వ్యాఖ్యలు ఉభయదేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో విభేదాలు, ఉద్రిక్తతల్ని స్పష్టంగా చాటుతున్నాయి. వాణిజ్య సుంకాలపై పరస్పరం అవగాహనకు రాకపోవడం దీనికి ప్రధాన కారణం.

ఉత్పత్తులపై భారత్‌ అత్యధిక సుంకాల్ని విధిస్తోందని, ప్రత్యేకించి వ్యవసాయ ఉత్పత్తులపై మరీ ఎక్కువగా ఉంటున్నాయని అమెరికా వాదన. ముందు నిబంధనలు అమలు చేయాల్సిన అమెరికా ప్రపంచ వాణిజ్యసంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనల్ని భారత్‌ ఉల్లంఘిస్తున్నదని ప్రత్యారోపణకు దిగుతున్నది.

ఉపాధి కల్పనలో ‘పూర్తి స్థానికత’ విధానం అవలంబిస్తున్న అమెరికా.. విదేశాలు ప్రత్యేకించి భారతదేశంలో ఆర్థిక డేటా ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల వీసా, మాస్టర్‌కార్డ్‌లాంటి కంపెనీలు నష్టపోతున్నాయరి వాదిస్తోంది. తమ ఎగుమతులకు అడ్డంకిగా ఉన్న విధానాల్ని భారత్‌ ఎత్తేయాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. 

ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్‌ సర్కారు భారీగా వడ్డించిన సుంకాలను ఉపసంహరించాలన్నది భారత్ వాదన. జనరలైజ్డ్‌ సిస్టం ఆఫ్‌ ప్రిఫరెన్స్‌(జీఎస్‌పీ) కింద ప్రయోజనాల్ని ఉపసంహరించడం వల్ల మేం నష్టపోతున్నాం అని భారత్ వాపోతున్నది. 

గుండె స్టెంట్లు, కృత్రిమ మోకాలి చిప్పలపై ధరల నియంత్రణ విధించకూడదని అమెరికా కోరుతున్నది. ఇంకా ప్రత్యేకించి హార్లీ డేవిడ్‌సన్‌ బైకులపై విధించిన భారీ సుంకాల్ని తగ్గించాలన్నది అగ్రరాజ్య షరతుల్లో ప్రధానమైంది.

అమెరికా పాడి, వ్యవసాయ ఉత్పత్తులకు బేషరతుగా భారతదేశంలో మార్కెట్‌ సదుపాయం కల్పించాలని, ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గించాలని కోరుతోంది. అమెరికా ఫలాలకు మార్కెట్‌ సదుపాయం కల్పించాలని, డబ్ల్యూటీఓలో ఫిర్యాదుల్ని పరస్పరం ఉపసంహరించుకోవాలని అభ్యర్థిస్తోంది. అమెరికా ఇన్‌ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడంతోపాటు ప్రతికార సుంకాల జోలికి వెళ్లొద్దని అమెరికా ప్రధాన డిమాండ్లలో కొన్ని మాత్రమే. 

భారత్ కూడా తక్కువేం తినలేదు. ఇనుము, ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాల్ని తగ్గించి, భారత మామిడిపండ్లు, ద్రాక్షకు మరింతగా మార్కెట్‌ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. అలాగే, భారత పండ్ల ఎగుమతిదారులకు సులభంగా అనుమతులు ఇవ్వాలంటున్నది.

తద్వారా జీఎస్‌పీ కింద ఎగుమతి ప్రయోజనాలను పునరుద్ధరించాలని కోరుతోంది. వ్యవసాయం, వాహనాలు, వాహన విడిభాగాలు, ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల్ని అమెరికాలో మరింతగా విక్రయించడానికి అనుమతించాలని భారత్ ప్రతిగా వాదిస్తున్నది. 

సంపన్న దేశాల్లో తక్కువ ఖర్చుతో తయారైన వస్తువుల్ని పేద దేశాల్లో విక్రయిస్తున్నప్పుడు స్థానిక మార్కెట్‌ దెబ్బతినకుండా.. అక్కడి ధరకు గానీ, అంతకన్నా ఎక్కువకు విక్రయించాలి. ఆ మేరకు పేద దేశాలు సంబంధిత ఉత్పత్తులపై సుంకాలు విధించొచ్చు. జనరలైజ్డ్‌ సిస్టం ఆఫ్‌ ప్రిఫరెన్స్‌(జీఎస్‌పీ) పేరిట ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఈ నిబంధనను చేర్చింది. 

పేద దేశాల జాబితా నుంచి భారత్‌ను గత ఏడాది అమెరికా ఏకపక్షంగా తొలగించినందువల్ల ఈ నిబంధన కింద పొందే ప్రయోజనాల్ని భారత్‌ కోల్పోతోంది. పైపెచ్చు భారత్ ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై విధించిన అధిక పన్నుల్ని ట్రంప్‌ సర్కార్ ఉపసంహరించట్లేదు. 

దీనికి నిరసనగా దాదాపు 28 అమెరికా ఉత్పత్తులపై మనదేశం కూడా గత ఏడాది జూన్‌లో సుంకాల్ని విధించింది. ఇందులో బాదం, యాపిల్స్‌ లాంటివి ఉన్నాయి. భారత్‌తో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించుకుంటున్నామని ట్రంప్‌ ప్రకటించిన కొద్దిరోజుల్లోనే మనదేశం ఈ చర్యకు దిగింది. 

నాటి నుంచి ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఉప్పు, నిప్పుగా ఉన్నాయి. వివాదాల్ని పరిష్కరించుకోడానికి భారత వాణిజ్యమంత్రి పీయూష్‌గోయల్‌, అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైథిజెర్‌ మధ్య కొన్ని వారాలుగా ఫోన్‌లో సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి.

భారత్‌- అమెరికా మధ్య 2018-19లో వాణిజ్య లోటు 1609 కోట్ల డాలర్లు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే (2209 కోట్ల డాలర్లు) ఏడు శాతం తగ్గింది. ఈ లోటు పూడ్చాలని, భారత్‌ ఎంత ఎగుమతి చేస్తే.. అంత దిగుమతి చేసుకోవాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది.

అధునాతన బైక్‌లకు సింగిల్‌ డిజిట్‌ (1-9 శాతం) సుంకాలు విధిస్తామని భారత్ తెలిపింది. వైద్య పరికరాల ధరల నిర్ణయంలో ట్రేడ్‌ మార్జిన్లకు అనుమతిస్తాం అని పేర్కొంది. 

Also read:మార్చి 6న విపణిలోకి టిగువాన్.. అదే రోజు బుకింగ్స్ షురూ

అమెరికా నుంచి రూ.18,200 కోట్ల విలువైన 24 హెలికాప్టర్లు (ఎంహెచ్‌-60 రోమియో), ఆరు ఏహెచ్‌-64ఈ అపాచే హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి భారతదేశం సిద్ధమైనట్లు సమాచారం. దీనికి ప్రతిగా జీఎస్‌పీ కింద ప్రయోజనాల్ని అమెరికా పునరుద్ధరిస్తుందని భారత్‌ ఆశిస్తోంది. ఈ కార్యక్రమం కింద 2017లో అమెరికాకు దాదాపు 570 కోట్ల డాలర్ల సుంకాల్లేని ఎగుమతుల్ని భారత్‌ చేసింది.

భారత మొత్తం ఎగుమతుల్లో 16% అమెరికాకు వెళ్తాయి. అమెరికాకు ఎగుమతుల్లో ఐరోపా యూనియన్ (17.8%) తర్వాత మనది రెండో దేశం. అమెరికా ఉత్పత్తుల దిగుమతిలో చైనా(14.6%), ఈయూ (10.2%) తర్వాత మనది మూడోదేశం (6.3%)వస్తువులు, సేవల వాణిజ్యం పరంగా చూస్తే అమెరికాకు భారత్‌ ఎనిమిదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios