Asianet News TeluguAsianet News Telugu

ల్యాంకో కథ కంచికి: అమ్మకానికి లిక్విడేటర్

ఒకనాడు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన మౌలిక వసతుల సంస్థ లాంకో ఇన్‌ఫ్రా బ్యాంకుల వద్ద తీసుకున్న వేల కోట్ల రుణాలు చెల్లించలేక దివాళా తీసింది. దీంతో ఈ సంస్థ విక్రయానికి (లిక్విడేషన్‌)కు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ), హైదరాబాద్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. 

NCLT orders liquidation of Lanco Infratech, appoints Savan Godiawala as RP
Author
Hyderabad, First Published Aug 28, 2018, 10:57 AM IST

హైదరాబాద్: ఒకనాడు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన మౌలిక వసతుల సంస్థ లాంకో ఇన్‌ఫ్రా బ్యాంకుల వద్ద తీసుకున్న వేల కోట్ల రుణాలు చెల్లించలేక దివాళా తీసింది. దీంతో ఈ సంస్థ విక్రయానికి (లిక్విడేషన్‌)కు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ), హైదరాబాద్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ సమర్పించిన సవరించిన రిజల్యూషన్‌ ప్రణాళికను కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌ (సీఓసీ) తిరస్కరించటంతో లాంకో ఇన్‌ఫ్రా విక్రయానికి అనుమతిస్తూ సోమవారం ఎన్సీఎల్టీ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇంటెరిమ్‌ రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ (ఐఆర్పీ) సావన్‌ గొడియావాలాను అఫీషియల్‌ లిక్విడేటర్‌గా నియమిస్తూ ఎన్సీఎల్టీ హైదరాబాద్‌ బెంచ్‌ సభ్యుడు రాటకొండ మురళి ఆదేశాలు జారీ చేశారు. లిక్విడేషన్‌ ప్రక్రియను 75 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. లాంకో ఇన్‌ఫ్రాటెక్‌ రూ.44,000 కోట్ల బకాయిలు చెల్లించటంలో విఫలం కావటంతో ఐడిబిఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం.. ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టీ కోడ్‌ (ఐబీసీ) కింద దివాలా ప్రక్రియను ప్రారంభించాలని గత ఏడాది ఎన్సీఎల్టీని ఆశ్రయించింది.

అయితే ప్రస్తుతం కొనసాగుతున్న బోర్డు, ఇతర మేనేజ్‌మెంట్‌, భాగస్వాముల అధికారాలను రద్దు చేస్తూ వాటన్నింటినీ లిక్విడేటర్‌కు బదలాయించారు. మూసివేత ప్రక్రియపై బహిరంగ ప్రకటన జారీ చేయాలని లిక్విడేటర్‌కు ఆదేశించారు. మొత్తం అన్ని బ్యాంకులు, రుణదాతలకు కలిపి రూ.49,959 కోట్ల రావాల్సి ఉందని పేర్కొనగా, రూ.47,721 కోట్లు రుణ బకాయిలు ఉన్నట్లు ల్యాంకో ఇన్‌ఫ్రా అంగీకరించింది. 

ఐడీబీఐ దరఖాస్తుపై విచారించిన ట్రైబ్యునల్‌ కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్‌ ప్రాసెస్‌ (సీఐఆర్‌పీ)కి అనుమతిస్తూ 2017 ఆగస్టు 7న ఉత్తర్వులు జారీ చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియ నిపుణుడిగా శావన్‌ గొడియావాలను నియమించింది. ఈ ప్రక్రియ గడువు ముగిసిపోగా ఈ ఏడాది జనవరిలో మరో 90 రోజులు పొడిగించగా అది కూడా మే 4తో ముగిసింది. ల్యాంకో ఇన్‌ఫ్రా రుణపరిష్కార ప్రణాళికను సమర్పించడానికి ప్రకటన జారీ చేయగా 7 కంపెనీలు ఆసక్తి చూపాయి. 

వీటిలో క్యూబ్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌, మెట్రో అస్సెట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పెన్‌ ఎనర్జీ ఇంటర్నేషనల్‌ రెన్యూవబల్స్‌ లిమిటెడ్‌, రోహన్‌ సోలార్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సోలార్‌ల్యాండ్‌ (ఉక్సీ) ఎలక్ట్రిక్‌ పవర్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ సంస్థల దరఖాస్తులు చట్ట నిబంధనలను సంతృప్తిపరచలేదు. ఇన్‌జెన్‌ క్యాపిటల్‌ గ్రూపు (ఎల్‌ఎల్‌సీ), త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఈపీఎల్‌)లు రుణ పరిష్కార ప్రణాళికను సమర్పించినప్పటికీ కొన్ని లోపాలుండగా వెనక్కి పంపి వాటిని పరిష్కరించడానికి ఆర్‌పీ అవకాశం ఇచ్చారు. 

వీటిలో టీఈపీఎల్‌ మార్చి 20న సమర్పించిన ప్రణాళికతోపాటు ఏప్రిల్‌ 17న, 24న సవరణ దాఖలు చేయడంతో నిబంధనలకు అనుగుణంగా ప్రణాళిక ఉండటంతో దాన్ని ఆర్‌పీ రుణదాతల కమిటీ ముందుంచారు. ఈ ప్రణాళికను రుణదాతల కమిటీ ముందు ఏప్రిల్‌ 25న ఈఓటింగ్‌కు ఉంచగా 15.12 శాతం మాత్రమే ఆమోదించగా ఇదే విషయాన్ని మే ఒకటిన టీఈపీఎల్‌కు సమాచారం ఇచ్చారు. అదే రోజు టీఈపీఎల్‌ మళ్లీ సవరిస్తూ ప్రణాళిక సమర్పించగా 2న కమిటీ ముందుంచారు, అయితే గడువుకు రెండు రోజుల ముందు సమర్పించడంతో కమిటీ తిరస్కరించింది. 

టీఈపీఎల్‌ తిరిగి ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా మరో 16 రోజుల గడువు మంజూరు చేసింది. టీఈపీఎల్‌ సవరణ ప్రణాళికను కమిటీ ముందు ఈ ఓటింగ్‌కు ఉంచినా 15.53 శాతం రుణదాతలు మాత్రమే ఆమోదించారు. దివాలా పరిష్కార గడువు జులై 28తో ముగిసిపోగా రుణదాతల కమిటీ ఎలాంటి రుణ పరిష్కార ప్రణాళికకూ ఆమోదం తెలపలేదు. దీంతో లిక్విడేషన్‌కు అనుమతించాలంటూ ట్రైబ్యునల్‌ ముందు ఆర్‌పీ దరఖాస్తు దాఖలు చేస్తూ రుణదాతలు, ట్రైబ్యునల్‌ అనుమతిస్తే లిక్విడేటర్‌గా కొనసాగడానికి సమ్మతించారు.

టీఈపీఎల్‌ సమర్పించిన రుణప్రణాళికకు చట్టప్రకారం కనీసం 66 శాతం మంది రుణదాతల ఆమోదం ఉండాలని, అది లేకపోవడంతో లిక్విడేషన్‌కు అనుమతిస్తున్నట్లు ట్రైబ్యునల్‌ సభ్యులు తీర్పు వెలువరించారు. లిక్విడేటర్‌గా కొనసాగడానికి సమ్మతిస్తూ రాతపూర్వకంగా వారంలోగా సమర్పించాలని ఆదేశించారు. దివాలా స్మృతి సెక్షన్‌ 4 ప్రకారం లిక్విడేషన్‌ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. అన్ని వివరాలతో ప్రాథమిక నివేదికను 75 రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించారు.

కాగా, దివాలా పరిష్కార ప్రక్రియలో పాల్గొనే కంపెనీల అర్హతలకు సంబంధించిన చట్ట నిబంధనను సవరించిన నేపథ్యంలో ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవహారంపై కార్పొరేట్‌ దివాలా ప్రక్రియను తాజాగా చేపట్టాలని కోరుతూ పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన దరఖాస్తును ఎన్సీఎల్టీ హైదరాబాద్‌ బెంచ్‌ సభ్యులు రాటకొండ మురళి తిరస్కరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాంకో రుణ పరిష్కార ప్రణాళికను సమర్పించడానికి పవర్‌ మెక్‌ ఏ దశలోనూ ప్రయత్నించలేదని అలాంటపుడు ఏ చట్ట సవరణ వచ్చినా దానిపై ప్రభావం చూపదని ఆర్‌పీ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవిస్తూ దరఖాస్తును కొట్టివేశారు. 

అదేవిధంగా తాను ల్యాంకో నుంచి పొందిన రూ.6.48 కోట్ల కాంట్రాక్ట్‌ నిమిత్తం సమర్పించిన రూ.64.80 లక్షల బ్యాంకు గ్యారంటీని వాపసివ్వాలంటూ బీఎల్‌ఆర్‌ లాజిస్టిక్స్‌ (ఐ) లిమిటెడ్‌ దరఖాస్తును అనుమతించారు. బ్యాంకు హామీని వాపసివ్వాలని ఆర్‌పీని ఆదేశించారు. ల్యాంకో ఇన్‌ఫ్రాకు సంబంధించి దాఖలైన ఇతర దరఖాస్తులపై విచారణ సెప్టెంబరు 12వ తేదీకి వాయిదా వేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios