Asianet News TeluguAsianet News Telugu

టాటా సన్స్‌కు షాక్: చైర్మన్‌గా మళ్ళీ మిస్త్రీకే సారథ్యం

చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగిస్తూ టాటా సన్స్ తీసుకున్న నిర్ణయం చెల్లదని ఎన్సీఎల్ఏటీ తీర్పు చెప్పింది. నెల రోజుల్లో చైర్మన్‌గా మిస్త్రీని పునర్నియమించాలని టాటా సన్స్ యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు టాటా సన్స్ సంస్థను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి  ప్రైవేట్ కంపెనీగా మార్చటం చెల్లుబాటు కాదని, ప్రస్తుత చైర్మన్ చంద్రశేఖరన్ నియామకం అక్రమమేని తేల్చి చెప్పింది. అయితే అప్పీల్ చేసుకునేందుకు టాటా సన్స్ సంస్థకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. 
 

NCLAT orders reinstatement of Cyrus Mistry as Chairman of Tata Sons
Author
Hyderabad, First Published Dec 19, 2019, 10:30 AM IST

న్యూఢిల్లీ: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో భారీ విజయం లభించింది. మిస్త్రీ వ్యవహారంలో టాటా గ్రూప్‌నకు దీంతో భారీ ఎదురుదెబ్బ తగిలింది. 

మిస్త్రీకి, టాటా సన్స్ మధ్య రెండేళ్ల పోరాటం ఇలా
ఉప్పు నుంచి సాఫ్ట్ వేర్ రంగం వరకు విస్తరించిన 11,000 కోట్ల డాలర్ల టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ ‘టాటా సన్స్` ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అర్ధాంతరంగా తొలగించటం చెల్లదని ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో టాటా సన్స్ మాజీ చైర్మన్, ప్రస్తుత చైర్మన్ ఎమిరెటస్ రతన్ టాటా.. సైరస్ మిస్త్రీ మధ్య నువ్వా? నేనా? అన్నట్టు రెండేళ్లపాటు సాగిన న్యాయ పోరాటానికి తెరపడింది.

న్యాయపోరుటో నెగ్గిన సైరస్ మిస్త్రీ
ఈ పోరాటంలో చివరకు మిస్త్రీనే నెగ్గారు. నెల రోజుల్లో సైరస్ మిస్త్రీని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిలో పునర్నియమించాలని కంపెనీ బోర్డును ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. కాగా మిస్త్రీని అర్ధాంతరంగా తొలగించిన తర్వాత చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరర్ నియామకం కూడా అక్రమమని ట్రిబ్యునల్ ప్రకటించింది.

also read శామ్సంగ్ చైర్మన్ కి జైలు శిక్ష... కారణం..?

ప్రైవేట్ సంస్థగా టాటా సన్స్ మార్పు కుదరదు
మరోవైపు పబ్లిక్ కంపెనీగా ఉన్న టాటా సన్స్ సంస్థను ప్రైవేట్ కంపెనీగా మారుస్తూ బోర్డు తీసుకున్న నిర్ణయం కూడా తప్పని ఎన్సీఎల్ఏటీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్ఏటీ ధర్మాసనం బుధవారంనాడు ఈ మేరకు తీర్పును వెలువరించింది.
 
2012లో టాటా సన్స్ చైర్మన్ గా మిస్త్రీ బాధ్యతల స్వీకరణ
టాటా సన్స్ సంస్థలో 18 శాతం వాటా కలిగిన సైరస్ మిస్త్రీ, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవటానికి వీల్లేదని ధర్మాసనం ఆదేశించింది. షాపూర్జీ పల్లోంజీ కుటుంబ వారసుడు సైరస్ మిస్త్రీ.. 2012 డిసెంబర్ నెలలో రతన్ టాటా వారసుడిగా టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 

తాత్కాలిక చైర్మన్ గా రతన్ టాటా నియామకం
మిస్త్రీ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో సజావుగా సాగిన కంపెనీ వ్యవహారాలు అనంతరం గాడి తప్పాయని టాటా సన్స్ బోర్డు ఆయన్ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటాను నియమించింది.
 
ఎన్సీఎల్ఏటీలో ఇటా మిస్త్రీ సంస్థల పిటిషన్లు
టాటా సన్స్ బోర్డు నిర్ణయాలు మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ మిస్త్రీ కుటుంబానికి చెందిన రెండు పెట్టుబడి సంస్థలు ముంబైలోని జాతీయ కంపెనీల లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంచ్ను ఆశ్రయించాయి. కంపెనీ నిర్వహణ కూడా సరిగా లేదని, మిస్త్రీ తొలగింపు చెల్లదని పేర్కొన్నాయి. 

మిస్త్రీ కుటుంబ సభ్యులకు ఇలా చుక్కెదురు
మిస్త్రీ కుటుంబ సంస్థలు దాఖలు చేసిన ఈ పిటిషన్లను ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తోసిపుచ్చింది. తర్వాత ఎన్సీఎల్టీ ఢిల్లీ బెంచ్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. దాంతో మిస్త్రీ ఢిల్లీలోని ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు. ఈ ఏడాది జూలైలో విచారణ పూర్తయిన ఈ కేసు తీర్పును ఎన్సీఎల్ఏటీ బుధవారం ప్రకటించింది.

NCLAT orders reinstatement of Cyrus Mistry as Chairman of Tata Sons
 
ఎన్సీఎల్ఏటీ తీర్పును స్వాగతించిన సైరస్ మిస్త్రీ
ఎన్సీఎల్ఏటీ తీర్పును సైరస్ మిస్త్రీ స్వాగతించారు. ‘ఇది నా వ్యక్తిగత విజయం కాదు. మైనారిటీ వాటాదారుల హక్కులు, మంచి నిర్వహణకు సంబంధించిన విలువల విజయం. గతాన్ని మరిచి టాటా గ్రూప్ సుస్థిర వృద్ధి, అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం’ అన్నారు. 

అకారణంగా తొలిగించారన్న సైరస్ మిస్త్రీ
సరైన కారణంగానీ, హెచ్చరికగానీ లేకుండానే అప్పటి టాటా సన్స్ బోర్డు తనను తొలగించిందని సైరస్ మిస్త్రీ అన్నారు. ఎన్సీఎల్ఏటీ తాజా తీర్పుతో ఆ విషయం నిజమైందన్నారు. కంపెనీ సుస్థిర వృద్ధి, అభివృద్ధితో పాటు దీర్ఘకాలంలో వాటాదారుల పెట్టుబడుల విలువ పెంపు లక్ష్యంతోనే తాను పని చేసినట్టు మిస్త్రీ చెప్పారు.
 
సముచిత చర్యలు తీసుకుంటాం : టాటా
టాటా సన్స్ మాత్రం ఎన్సీఎల్ఏటీ తీర్పుపై ఆచితూచి స్పందించింది. ఈ తీర్పుపై అవసరమైన న్యాయ చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయితే తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పీల్కు వెళతారా? లేదా? అనే విషయం మాత్రం స్పష్టం చేయలేదు. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన వాటాదారుల సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఎన్సీఎల్ఏటీ ఎలా కాదందో స్పష్టం కాలేదని పేర్కొంది.
 
ఇది సైరస్ మిస్త్రీ ప్రస్థానం
2006 సెప్టెంబరు ఒకటో తేదీన టాటా సన్స్ బోర్డులో సభ్యుడిగా చేరారు. 2012లో టాటా సన్స్ చైర్మన్గా నియమితులు అయ్యారు. అనూహ్యంగా 2016 అక్టోబరు 24న చైర్మన్ పదవి నుంచి తొలగింపునకు గురయ్యారు. తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటా నియమితులయ్యారు. అదే నెల 25న  టాటా ట్రస్టులు పరోక్షంగా పెత్తనం చేస్తున్నాయని ఆరోపిస్తూ టాటా సన్స్ బోర్డుకు మిస్త్రీ లేఖ రాశారు. 

also read హైదరాబాద్‌లో కొత్త స్కూటర్ రెంట్ సర్విస్...1.కి.మీ రూపాయి...

ఇలా టాటా గ్రూప్ సంస్థల డైరెక్టర్ పదవులకు మిస్త్రీ రాజీనామా
2016 డిసెంబరు 19వ తేదీన టాటా గ్రూపులోని అన్ని కంపెనీల డైరెక్టర్ల పదవులకు మిస్త్రీ రాజీనామా చేశారు. డిసెంబర్ 20వ తేదీన టాటా సన్స్ కంపెనీ నిర్వహణ సరిగా లేదని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు 2017 జనవరి 12వ తేదీన టాటా సన్స్ చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ను నియమించింది. అయితే మిస్త్రీ తొలగింపును ఆయన కుటుంబ సంస్థలు సవాల్ చేశాయి. 2017 ఫిబ్రవరి 6వ తేదీన  టాటా సన్స్ డైరెక్టర్ పదవి నుంచి మిస్త్రీ తొలగించేశారు.

మిస్త్రీ కుటుంబ న్యాయ పోరాటం ఇలా
2017 ఏప్రిల్ 17వ తేదీన మిస్త్రీ కుటుంబ సంస్థల విజ్ఞప్తిని ఎన్సీఎల్ఏటీ ముంబై బెంచ్ తోసిపుచ్చింది. అదే నెల 27న ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తమ విజ్ఞప్తిని కొట్టి వేయడంపై ఎన్సీఎల్ఏటీలో మిస్త్రీ కుటుంబం అప్పీల్ దాఖలు చేసింది. సెప్టెంబరు 21న ప్రైవేట్ కంపెనీగా మారేందుకు తీర్మానాన్ని టాటా సన్స్ బోర్డు ఆమోదించింది. గతేడాది జూలై తొమ్మిదో తేదీన మిస్త్రీ పిటిషన్లను ఎన్సీఎల్ఏటీ ఢిల్లీ బెంచ్ కొట్టేసింది. 

టాటా సన్స్ లోకి మిస్త్రీ రాకపోవచ్చు?
2019 డిసెంబరు 18వ తేదీన మిస్త్రీ తొలగిస్తూ టాటా సన్స్ తీసుకున్న నిర్ణయం చెల్లదని ఎన్సీఎల్ఏటీ తీర్పు చెప్పింది. అయితే, ఎన్సీఎల్ఏటీ అనుకూలంగా తీర్పు ఇచ్చినా సైరస్ మిస్త్రీ మళ్లీ టాటా గ్రూపులోకి  రాకపోవచ్చని భావిస్తున్నారు. ఎన్సీఎల్ఏటీ తీర్పు తర్వాత మిస్త్రీ చేసిన ప్రకటన కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. చట్టపరంగానే కాకుండా నైతికంగానూ రతన్ టాటాపై విజయం సాధించినందున ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టాలని మిస్త్రీ భావిస్తున్నట్టు సమాచారం.
 

Follow Us:
Download App:
  • android
  • ios