Prakash Shah: ప్రకాష్ షా పేరు ప్రస్తుతం చాలా ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే? కోట్లల్లో జీతం.. విలాసవంతమైన జీవితం.. భారతదేశ దిగ్గజ పారిశ్రామికవేత్తతో సాన్నిహిత్యం.. ఇవన్నీ వదులుకొని జైన దీక్ష స్వీకరించారు ప్రకాష్ షా. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.  

Prakash Shah: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు, ఆ సంస్థలో సీనియర్ అధికారి.. ప్రకాష్ షా ఇటీవల జైన దీక్ష స్వీకరించారు. వ్యాపార ప్రపంచంలో ముఖేష్ అంబానీకి కుడి భుజంగా పేరుగాంచిన ప్రకాష్ షా.. తన 63వ ఏటా ఈ నిర్ణయం తీసుకున్నారు. జైన దీక్ష తీసుకుని మిగిలిన జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. 

ప్రకాష్ షా ఎవరు?

ప్రకాష్ షా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఏడాది జీతం సుమారు రూ.75 కోట్లట. ఇంతటి భారీ జీతాన్ని, కోట్ల సంపదను విడిచిపెట్టి ఆయన సన్యాసి జీవితాన్ని ఎందుకు స్వీకరించారో ఇక్కడ చూద్దాం.

ప్రకాష్ షా గత మహావీర జయంతి సందర్భంగా.. తన భార్య నైనా షాతో కలిసి జైన దీక్ష స్వీకరించారు. వాస్తవానికి ప్రకాష్ షా చాలా సంవత్సరాల క్రితమే జైన దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. కానీ కోవిడ్-19 కారణంగా దీక్ష వాయిదా పడిందట. 

'దీక్ష' అంటే ఒక వ్యక్తి కఠినమైన జీవితాన్ని గడపడానికి ప్రతిజ్ఞ చేసే ఒక ఆచారం. దీక్ష తీసుకున్న తర్వాత ఎలాంటి తప్పులు చేయకూడదు. మోక్షం పొందడానికి మంచి పనులు చేయాలని జైనులు నమ్ముతారు.

ప్రకాష్ షా నేపథ్యం..  

ప్రకాష్ షా ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అనంతరం ఐఐటీ బాంబే నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.. ఆయన భార్య కూడా కామర్స్ గ్రాడ్యుయేట్. వారికి ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారుల్లో ఒకరు చాలా సంవత్సరాల క్రితమే దీక్ష తీసుకున్నారు. మరొక కుమారుడికి వివాహం అయింది. వారికి ఒక బిడ్డ కూడా.

రిలియన్స్ ఇండస్ట్రీస్ లో ప్రకాష్ షా సుదీర్ఘకాలం పనిచేశారు. జామ్‌నగర్ పెట్‌కోక్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్, పెట్‌కోక్ మార్కెటింగ్ వంటి ముఖ్యమైన ప్రాజెక్టులకు షా నాయకత్వం వహించారు.   

ప్రకాష్ షా ప్రస్తుతం జైన సన్యాసిగా జీవిస్తున్నారు. ఆయన చెప్పులు లేకుండా నడుస్తారు. సాధారణ తెల్లని దుస్తులను ధరిస్తారు. భిక్షాటనపై ఆధారపడి జీవిస్తారు. అతని దీక్షా కార్యక్రమం మొత్తం ముంబైలోని బోరివలి ప్రాంతంలో జరిగింది. ఏడు సంవత్సరాల క్రితం.. ఆయన కుమారుడు దీక్ష తీసుకున్నప్పుడు అతనికి 'భువన్ జీత్ మహారాజ్' అనే పేరు పెట్టారు.  

ఈ దీక్ష తర్వాత ప్రకాష్ షా ఆయన భార్య పేర్లు మార్చుకున్నారు. ప్రకాశ్ షా దంపతుల కొత్త పేరు ప్రశాంత్ భూషణ్ విజయజీ మహరాజ్ సాహెబ్, భవ్యనిధి సాద్విజీమహరాజ్ సాహెబ్. జైన మతంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు సన్యాసం స్వీకరించడం సాధారణమే. అయితే సన్యాసం స్వీకరిస్తే సుఖాలను, హోదాలను వదిలిపెట్టాలి. సంపద కాంక్ష ఉండకూడదు.

ప్రకాష్ షా కు "చిన్నప్పటి నుంచి దీక్ష తీసుకోవాలనే కోరిక ఉండేదట. దాని నుంచి వచ్చే ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతత.. దేనితోనూ పోల్చలేమని ఆయన పేర్కొన్నారు. 

ముగింపు

సాధారణంగా చాలామంది పదవీ విరమణ తర్వాత విశ్రాంతి, విలాసం, విదేశాల గురించి కలలు కంటుంటారు. ప్రకాష్ షా, అతని భార్య మాత్రం కోట్ల విలువైన ఆస్తిని వదులుకొని సన్యాసం తీసుకున్నారు. సాధు జీవితాన్ని గడపాలి అనుకున్నారు. నిజమైన సంతృప్తి.. భౌతిక సుఖాల్లోనే కాదు.. ఆధ్యాత్మికతలోనూ లభిస్తుందని చెప్పడానికి వీరి కథ ఒక ఉదాహరణ.