Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్‌ తర్వాత ఖర్చులకు రాంరాం.. షాపింగ్‌లకు దూరందూరం..

లాక్‌డౌన్‌ తర్వాత ప్రతీ ఐదుగురిలో నలుగురిది ఇదే మాట. భారతీయ రిటైలర్ల సంఘం (ఆర్‌ఏఐ) తాజాగా నిర్వహించిన కన్జ్యూమర్‌ సర్వేలో మెజారిటీ వినియోగదారులు షాపింగ్‌లకు తిరుగబోమని స్పష్టం చేశారు. కేవలం 33 శాతం మందే లాక్‌డౌన్‌ తర్వాత షాపింగ్‌కు ఆసక్తిని చూపిస్తున్నట్లు తేలింది.

Majority of consumers plan to cut shopping expenditure post-lockdown: Report
Author
Hyderabad, First Published Jun 10, 2020, 10:59 AM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దాని నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలంతా వ్యయ నియంత్రణ చర్యల్లోకి దిగిపోయారు. దేశంలోని ప్రతి ఐదుగురు వినియోగదారుల్లో నలుగురు ఇకపై తమ షాపింగ్‌ ఖర్చులను తగ్గించుకుంటామని చెప్తున్నారు. 

లాక్‌డౌన్‌ తర్వాత ప్రతీ ఐదుగురిలో నలుగురిది ఇదే మాట. భారతీయ రిటైలర్ల సంఘం (ఆర్‌ఏఐ) తాజాగా నిర్వహించిన కన్జ్యూమర్‌ సర్వేలో మెజారిటీ వినియోగదారులు షాపింగ్‌లకు తిరుగబోమని స్పష్టం చేశారు. కేవలం 33 శాతం మందే లాక్‌డౌన్‌ తర్వాత షాపింగ్‌కు ఆసక్తిని చూపిస్తున్నట్లు తేలింది.

దేశవ్యాప్తంగా జరిగిన ఈ సర్వేలో 4,239 మంది పాల్గొనగా, ఇందులో 78 శాతం మంది షాపింగ్‌ వ్యయాన్ని తగ్గించుకోనున్నట్లు చెప్పారు. 37 శాతం మంది స్వల్పంగా తగ్గించుకుంటామని, 16 శాతం మంది ఎప్పట్లాగే చేస్తామనగా, ఆరు శాతం మంది మాత్రం ఇంకా ఎక్కువగా చేస్తామని తెలిపారు. దీంతో రిటైల్‌ రంగంలో వృద్ధి అంతంతమాత్రమేనని ఆర్‌ఏఐ వివరించింది.

ఈ ఏడాది మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రాగా.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. అయినప్పటికీ పెరుగుతున్న కేసులు వ్యాపారావకాశాలను దెబ్బతీస్తున్నాయి. 

also read 10 నెలల్లో 5 వేల ఉద్యోగాలు..: అలీబాబా క్లౌడ్

అయితే, 60 శాతం మంది మహిళలు ఆన్ లైన్ కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పురుషుల్లో 64 శాతం మంది సంప్రదాయంగా దుకాణాల్లోకి వెళ్లి కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

ద్వితీయ, త్రుతీయ శ్రేని నగరాల్లో సంప్రదాయ కొనుగోళ్లకు మాత్రమే ఇష్ట పడుతున్నారు. ప్రథమ శ్రేణి నగరాల్లో మాత్రం ఇటు దుకాణాలు, అటు ఆన్ లైన్ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న వారు సమాన సంఖ్యలోనే ఉన్నారు. 

ప్రస్తుతం అత్యధికంగా బట్టలు, ఆహార వస్తువుల కొనుగోళ్లు 52 శాతం ఉంటున్నాయి. ఇక మొబైల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోళ్లు 31 శాతం, సౌందర్యం ప్లస్ ఆరోగ్య పరిరక్షణ కోసం 25 శాతం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు 24 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. 

45 ఏళ్లకు పైబడిన వారిలో నేరుగా 67 శాతం మంది దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేయడానికి ఇష్ట పడుతున్నారు. మూడు నెలల్లో స్టోర్లను సందర్శించాలని భావిస్తున్న వారు 62 శాతం మంది భావిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత షాపింగ్ వెళ్లాలా? వద్దా? అన్న విషయమై సందిగ్ధంలో ఉన్న వారు 67 శాతం మంది ఉన్నారు. 

ప్రతిరోజూ దుకాణాలను శానిటైజ్ చేయాలని 75 శాతం మంది కోరుతుండగా, 67 శాతం మంది ప్రతి సందర్శకుడి శరీర ఉష్ణోగ్రతను పరీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సిబ్బందితో కలయిక పరిమితంగా ఉండాలని కోరుకుంటున్న వారు 57 శాతం మంది అయితే, ప్యాకేజ్డ్ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్న వారు 48 శాతం మంది ఉన్నారు. 43 శాతం మంది హోం డెలివరీ చేయాలని కోరుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios