Blood Moon: ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ కలర్‌లో చంద్రుడు కనిపించేది అప్పుడే
Blood Moon: ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం వచ్చేస్తోంది. ఆ రోజు చంద్రుడు రక్తం రంగులో కనిపిస్తాడు. అందుకే గ్రహణాన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. బ్లడ్ మూన్ ఎప్పుడు, ఎక్కడ వివరంగా తెలుసుకుందాం రండి.

ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మార్చి 14 ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం అనేక ప్రత్యేకతలు కలిగి ఉంది. పూర్తి చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. అందుకే దీనిని బ్లడ్ మూన్ లేదా రక్త చంద్రుడు అని పిలుస్తారు. ఆకాశంలో జరగనున్న ఈ వింతను చూడటానికి శాస్త్రవేత్తలతో సహా చాలా మంది ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. మార్చి 14న హోలీ పండుగ జరగనుంది. దేశమంతా రంగుల పండుగలో మునిగిపోతే అదే రోజు చంద్రుడు ఎర్రగా మారతాడు.
ఏమిటీ బ్లడ్ మూన్?
చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు ముదురు ఎరుపు రంగులో కనిపించడాన్ని బ్లడ్ మూన్ అంటారు. చంద్రగ్రహణం సమయంలో సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడుతుంది. అందుకే చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. భూమి వాతావరణంలో సూర్యకాంతి వక్రీభవనం చెండటం వల్ల చంద్రుడిలా రక్తం రంగులో కనిపిస్తుంది. అయితే వాతావరణంలోని దుమ్ము, ధూళి, ఇతర వాయువుల కారణంగా వేర్వేరు దేశాల్లో ఎరుపు రంగులో కాస్త తేడాలు ఉండవచ్చు.
2025లో బ్లడ్ మూన్ ఏ సమయంలో కనిపిస్తుంది?
ఈ సంవత్సరం మార్చి 14న బ్లడ్ మూన్ 65 నిమిషాల పాటు కనిపిస్తాడు. భారతదేశ కాలమానం ప్రకారం మార్చి 14న ఉదయం 09:29 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 3:29 గంటలకు ముగుస్తుంది. మార్చి 14న ఉదయం 11:29 గంటల నుంచి మధ్యాహ్నం 1:01 గంటల వరకు 'బ్లడ్ మూన్ ' కనిపిస్తాడు. ఈ సమయంలో చంద్రుడు 65 నిమిషాల పాటు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ప్రపంచ వ్యాప్తంగా సమయ మండలాల ప్రకారం మార్చి 13 రాత్రి లేదా మార్చి 14 తెల్లవారుజామున చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించి ఎర్రగా మారుతాడని నాసా తెలిపింది.
2025లో బ్లడ్ మూన్ ఎక్కడ కనిపిస్తుంది?
ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ప్రజలకు ఈ చంద్రగహణం బాగా కనిపిస్తుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ అర్థగోళంలోని కొన్ని ప్రాంతాల్లో స్పష్టమైన ఆకాశంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆకాశం క్లియర్ గా ఉండాలి. మబ్బులు పట్టి ఉంటే అంత క్లారిటీగా చంద్రగ్రహణం కనిపించదు.
ఏఏ దేశాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది
2022 నవంబర్ తర్వాత వస్తున్న మొదటి బ్లడ్ మూన్ ఇదే. అయినప్పటికీ ప్రపంచ జనాభాలో 13 శాతం మంది మాత్రమే ఈ గ్రహణాన్ని చూడగలరు. ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలు, ఉత్తర, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ ఆర్కిటిక్ మహాసముద్రం, తూర్పు ఆసియా నగరాల్లో ఇది కనిపిస్తుంది.
2025లో రక్త చంద్రుడు భారతదేశంలో కనిపిస్తాడా?
భారతదేశంలో చంద్రగ్రహణం పగటి వేళలో జరుగుతుంది. కాబట్టి బ్లడ్ మూన్ ని భారతదేశంలో చూడటం కుదరదు. అయినప్పటికీ అనేక యూట్యూబ్ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ ఈ ఆకాశ వింతను ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. దాని ద్వారా మీరు ఈ అందమైన బ్లడ్ మూన్‌ను చూడవచ్చు.
ఇది కూడా చదవండి సెప్టెంబర్ 1 ఓ గ్రహాంతర వాసి భూమికి వస్తాడు: టైమ్ ట్రావెలర్ ప్రకటన

