ఐడీబీఐ బ్యాంక్ స్వాధీనానికి ఎల్ఐసీ సై

LIC board nod for acquisition of up to 51 pc stake in IDBI Bank
Highlights

ఇటు ఎల్ఐసీ, అటు ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగ, అధికారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను కైవసం చేసుకునేందుకు ఎల్ఐసీ బోర్డు ఆమోదం తెలిపింది. ఎల్ఐసీకి ప్రిఫరెన్షియల్ వాటాలను విక్రయించడం ద్వారా ఐడీబీఐ బ్యాంకు నిధుల సేకరణపై ఈ వారాంతంలో నిర్ణయం తీసుకోనున్నది.

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకులో 51శాతానికి వాటాను పెంచుకోవడానికి ఎల్‌ఐసీ బోర్డు ఆమోదం తెలిపిందని ఆర్థికవ్యవహారాల కార్యదర్శి ఎస్సీ గార్గ్ చెప్పారు. మూలధన సమీకరణ కోసం ఐడీబీఐ బ్యాంకు ఎల్‌ఐసీకి ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేస్తుందన్నారు. ‘బ్యాంకుకు మూలధనం అవసరం ఉంది. దాన్ని కోసం ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేసే పద్ధతిని పాటిస్తున్నది. లేదంటే ప్రభుత్వం తన వాటాను ఎల్‌ఐసీకి విక్రయించవచ్చు. కానీ దానివల్ల బ్యాంకుకు మూలధనం సమకూరదు. అందుకే ఈ పద్ధతిని ఎంచుకున్నాం’ అని ఆయన వివరించారు.

ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకులో వాటా పెంచుకునేందుకు ఎల్ఐసీకి ఐఆర్‌డీఏ అనుమతించిన సంగతి తెలిసిందే. త్వరలో సెబి అనుమతిని కూడా ఎల్ఐసీ పొందనుంది. పబ్లిక్ హోల్డింగ్ చాలా పరిమితంగా కేవలం 5 శాతం మాత్రమే ఉన్నందున ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించే అవకాశాలు లేవని గార్గ్ వెల్లడించారు. ఒకవేళ అవసరమైతేనే ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుందనీ, అయితే ఓపెన్ ఆఫర్ ధర ఆకర్షణీయంగా ఉండే అవకాశం లేదని వివరించారు. 

ఎల్‌ఐసీకి ఇప్పటికే బ్యాంకులో 7.98 శాతం మేర వాటా ఉంది. మెజారిటీ వాటా కోసం అవసరమైన మిగిలిన వాటాను కొనుగోలు చేయనుందని ఆయన తెలిపారు. ఎల్‌ఐసీకి వాటాను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేర్లను జారీ చేయడం వల్ల ఐడీబీఐ బ్యాంకుకు ఎంత మూలధనం సమకూరుతుందన్న అంశంపై ఆయన వివరాలు ఇవ్వలేదు. అప్పుల ఊబిలో చిక్కుకున్న ఐడీబీఐ బ్యాంకుకు రూ.10,000 - 13,000 కోట్ల పెట్టుబడి మద్దతు అవసరం.


ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వ వాటా 80.96 శాతం కలిగి ఉన్నది. కానీ తన వాటా వదులుకునేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. అందుకే ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా ఎల్ఐసీ నుంచి నిధులను ఐడీబీఐ సేకరించనున్నది. అయితే బ్యాలెన్స్ షీట్ సమస్యను ఎదుర్కొంటున్నా ఐడీబీఐలో మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తూ బ్యాంకింగ్ రంగంలో అడుగిడుతున్న ఎల్ఐసీకి.. తాజా ఒప్పందం తన వ్యాపారాన్ని సమన్వితం చేసుకునేందుకు వెసులుబాటు కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు.


ఎల్ఐసీ తన పాలసీల విక్రయానికి రెండు వేల శాఖలు అదనంగా కలిసి వస్తాయి. అలాగే ఎల్ఐసీలో భారీగా ఉన్న నిధులను బ్యాంకు అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఎల్ఐసీలో పాలసీలు తీసుకున్న 22 కోట్ల మంది పాలసీదారులు ఐడీబీఐలో ఖాతాలు పొందేందుకు చాన్స్ ఉన్నది. మార్చి నెలాఖరుతో ముగిసిన త్రైమాసికం నాటికి ఐడీబీఐ బ్యాంకుకు స్థూల మొండి బకాయిలు రూ.55,600 కోట్లకు చేరుకున్నాయి. అందువల్లే ఐడీబీఐ బ్యాంకు తన కార్యకలాపాలను నిర్వర్తించేందుకు పెట్టుబడి మద్దతు అవసరమైందని ఆర్థిక వేత్తలు అంటున్నారు.

ఇదిలా ఉండగా ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయడం ద్వారా ఎల్‌ఐసీకి 51 శాతం వాటాను ఇచ్చేందుకు ఈ వారంలోనే ఐడీబీఐ బోర్డు సమావేశం కానున్నది. బోర్డు అనుమతి పొందిన తర్వాత ఎల్‌ఐసీ, ఐడీబీఐ సంయుక్తంగా ఒప్పందం ఆమోదానికి స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ (సెబీ), భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) అనుమతి కోరనున్నాయి. ప్రస్తుతం ఎల్‌ఐసీ 7.98 శాతం వాటా ఉన్నది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక బీమా సంస్థ ఆర్థిక సంస్థల్లో 15 శాతానికి మించి వాటాలు కొనుగోలు చేయరాదు. కానీ ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాల కొనుగోలుకు ఐఆర్డీఏ ప్రత్యేకంగా అనుమతినిచ్చింది. మిగిలిన వాటా కోసం ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయడం ద్వారా ఐడీబీఐకి రూ.10,000 నుంచి రూ.13,000 కోట్ల మూలధనం సమీకరణ జరగనుందని అంచనా. ఇప్పటికే ఈ డీల్‌పై ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంక్‌ల ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

loader