న్యూఢిల్లీ: తమ వినియోగదారులపై 20 శాతం వరకు చార్జీల భారాన్ని టెలికం సంస్థలు మోపనున్నట్లు సమాచారం. సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్‌) అంశంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో దేశీయ టెలికం కంపెనీలపై పెను భారం పడింది. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా రూ. వేల కోట్లల్లో టెలికం శాఖకు స్పెక్ట్రం వినియోగ ఫీజు, లైసెన్స్‌ ఫీజుగా చెల్లించాల్సి వస్తున్నది. 

also read: వినియోగదారులకు షాక్.. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు

ఈ క్రమంలోనే డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి తమ సేవల ధరలను పెంచుతున్నట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో కూడా చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. నిజానికి సుప్రీంకోర్టు తీర్పుతో జియోపై పడిన భారం చాలా తక్కువైనా టెలికం రంగ ప్రయోజనాల దృష్ట్యా పెంపు అనివార్యమని సంస్థ తెలిపింది. 

అయితే చార్జీలు ఎంత మేర పెరుగుతాయన్న సమాచారాన్ని మాత్రం మూడు టెలికం సంస్థలూ ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఉన్న వివిధ ప్లాన్లపై అదనంగా 20 శాతం వరకు ఎక్కువగా కస్టమర్లు చెల్లించాల్సి రావచ్చని ఓ జాతీయ దినపత్రిక కథనంతో  తెలుస్తున్నది. ఆయా సంస్థలు పేర్కొన్న వివరాల ప్రకారం అన్ని రీచార్జ్‌ ప్లాన్లపై పెంపు 20 శాతం వరకు ఉంటుందని సదరు పత్రిక సమాచారం. ప్లాన్‌ ధరనుబట్టి పెంపు ఉంటుందని చెబుతున్నారు.

తక్కువ రీచార్జ్‌ ప్లాన్లపై పెద్దగా పెంపు ఉండకపోవచ్చని తెలుస్తుండగా, ఎక్కువ విలువ కలిగిన ప్లాన్లపై పెంపు అధికంగా ఉండవచ్చని సమాచారం. దీంతో అన్ని ప్లాన్ల ధరలు ఒకేలా 20 శాతం మేర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ప్రస్తుత బిల్లులతో పోల్చితే పెంపు రూ.100కు దిగువనే ఉండొచ్చని మెజారిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

also read:  ఎస్‌బి‌ఐలో ఎకౌంట్ తీస్తున్నారా...అయితే మీకోసమే ఇది...


అయితే ఆయా ప్లాన్లలో వినియోగదారులు మరింత డేటాను కూడా పొందే వీలుందని సదరు వర్గాలు అంటున్నాయి. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా ప్రస్తుత ప్లాన్ల ధరలు కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.10 వేలదాకా ఉన్నాయి. వీటిలో నెలసరి, దీర్ఘకాలిక వార్షిక ప్లాన్లు ఉన్నాయి.

వివిధ రకాల ప్లాన్లతోపాటు ప్రత్యేక డేటా ఓచర్లకూ ధరల పెంపు వర్తించనున్నది. అలాగే అకౌంట్‌ బ్యాలెన్స్‌ ప్యాకేజీలపైనా పెంపు పడనున్నది. ఇది ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు భారంగా మారే వీలున్నది. జియో ఇప్పటికే ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జీల (ఐయూసీ) పేరుతో ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసలు చొప్పున తమ కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.10 నుంచి టాప్‌-అప్‌లనూ సంస్థ అందుబాటులోకి తెచ్చింది.