వాష్టింగ్టన్: కరోనా మహమ్మారి సంక్షోభం కాలంలో అమెరికా అతలాకుతలం అవుతోంది. ఆర్థికవ్యవస్థ మరింత మందగమనంలోకి కూరుకుపోతోందని స్వయంగా ఫెడ్ రిజర్వు ఆందోళన వ్యక్తం చేసింది. 

అయితే ఈ కాలంలో కూడా అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు భారీ సంపదను ఆర్జించారు. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భారీ లాభాలను సాధించారు. అమెరికాలో పలు సంస్థల తీవ్ర నష్టాలు, వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో వీరి సంపద 45 శాతం ఎదగడం గమనార్హం. 

2 నెలల కరోనా వైరస్  కాలంలో టెక్నాలజీ స్టాక్స్ లాభాల్లో దూసుకు పోవడంతో వీరు మరింత  ధనవంతులయ్యారు. బెజోస్ సంపద 30 శాతం పెరిగి 147.6 బిలియన్ డాలర్లకు చేరుకోగా, జుకర్‌బర్గ్ సంపద 45 శాతం పెరిగి 80 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ప్రధానంగా లాక్ డౌన్ కారణంగా  ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో క్లౌడ్ బిజినెస్, వీడియో కాన్ఫరెన్స్ , గేమింగ్ వ్యాపారం పుంజుకోవడం, కొత్త ప్రోగ్రామ్ ప్రకటనలతో అమెజాన్, ఫేస్‌బుక్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. తాజా పరిశోధనల ప్రకారం ఈ కాలంలో అమెరికాలోని  600 మంది బిలియనీర్లు టెక్ స్టాక్స్‌లో ర్యాలీతో మరింత సంపన్నులయ్యారు

also read:కరోనా కట్టడిపైనే ఇండియన్ ఎకానమీ ఫ్యూచర్.. తేల్చేసిన ‘నిర్మల’మ్మ.

గత మార్చి 18 నుంచి ఈ నెల 18 వరకు అంటే సరిగ్గా రెండు నెలల్లో ఈ బిలియనీర్ల మొత్తం నికర సంపద విలువ 434 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 32.97 లక్షల కోట్లు) పెరిగింది. మరోవైపు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్, బెర్క్‌షైర్ హాత్వే అధినేత వారెన్ బఫెట్ స్వల్ప లాభాలకు పరిమితమయ్యారు. వీరు వరుసగా 8.2 శాతం, 0.8 శాతం లాభాలను నమోదు చేయగలిగారు.

టాక్స్ ఫెయిర్‌నెస్,  ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ ప్రోగ్రామ్ ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థలు ఈ విశ్లేషణ చేశాయి. అమెరికాలో లాక్ డౌన్ వంటి ఆంక్షలు అమలు చేయడం వల్ల బిజినెస్‌లు, వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థల మూసివేతతో 36.8 మిలియన్ల మంది నిరుద్యోగులయ్యారని ఆ నివేదిక పేర్కొంది.