కరోనా కట్టడిపైనే ఇండియన్ ఎకానమీ ఫ్యూచర్.. తేల్చేసిన ‘నిర్మల’మ్మ
కరోనా మహమ్మారి నుంచి మనం ఎలా బయటపడతామనే దానిపైనే రానున్న కాలంలో దేశ ఆర్థిక స్థితిని ఉత్తేజపరిచే ఏ విధాన చర్యలతో లభించే సత్ఫలితాలు ఆధార పడ్డాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి మనం ఎలా బయటపడతామనే దానిపైనే రానున్న కాలంలో దేశ ఆర్థిక స్థితిని ఉత్తేజపరిచే ఏ విధాన చర్యలతో లభించే సత్ఫలితాలు ఆధార పడ్డాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశ ఆర్థికస్థితిని గాడిలో పెట్టేందుకు ఇప్పటికే కేంద్రం రూ.20.97 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.
అందులోనే మే 17 వరకు ద్రవ్య లభ్యత కోసం ఆర్బీఐ విడుదల చేసిన రూ.8.01 లక్షల కోట్లు ఉన్నాయని ఆమె శనివారం పేర్కొన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో వాస్తవిక అంచనాతో కూడిన ఆర్థికవృద్ధిని అంచనా వేయడం కష్టమని ఆమె వాఖ్యానించారు.
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చేపట్టాల్సిన ఉద్దీపన చర్యలపై తాము తలుపులు ఇంకా మూయలేదని, పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదలై ఇప్పటికి రెండు నెలల మాత్రమే గడిచాయని, రానున్న మరో పదినెలల్లో తప్పకుండా పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రం అన్ని కోణాల్లో పరిశీలించి ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదంతో ప్రవేశపెట్టిన ఆర్థిక ప్యాకేజి ద్వారా దేశంతో అంకుర వ్యాపారస్థులు, కుటీర పరిశ్రమల సంఖ్య పెరుగుతుందన్నారు. తద్వారా ప్రజల్లో చేతుల్లో నగదు లభ్యత ఎక్కువై డిమాండ్ పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన గాడిలో పడుతుందన్నారు. కొవిడ్-19 ప్రభావం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో జీడీపీ(స్థూల జాతీయోత్పత్తి) రేటు తగ్గినా, మెల్లగా దాని పెరుగుదల ఆశాజనకంగా ఉండొచ్చని ఆర్బీఐ చెప్పిన సంగతి తెలిసిందే.
రెపోరేట్, రివర్స్ రెపోరేట్ తగ్గించడంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ జీడీపీ ప్రతికూలంగా నమోదవుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించిన సంగతి విదితమే. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వంటి నిపుణులు ఇంకా మరింత మెరుగైన ఉద్దీపన ప్యాకేజీ కావాలని, వలస కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలని కోరుతున్నారు.