సారాంశం

హైదరాబాద్ ప్రపంచ స్థాయి కంపెనీలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది బుధవారం ఒకేరోజు రెండు దిగ్గజ అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాదులో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ప్రముఖ ఆటోమోబిలిటీ దిగ్గజ సంస్థ Stellantis, హుస్టన్ వేదికగా పనిచేసే మరో సాఫ్ట్వేర్ సంస్థ Rite Software ఈరోజు తమ కార్యకలాపాలను హైదరాబాదులో ప్రారంభించాయి.

హైదరాబాద్ ఒక బలమైన ఆటోమోటివ్ ఎకోసిస్టమ్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. ప్రముఖ గ్లోబల్ ఆటోమేకర్ మొబిలిటీ ప్రొవైడర్ స్టెల్లాంటిస్ బుధవారం  హైదరాబాదులో తన డిజిటల్ హబ్‌ను ప్రారంభించింది. Jeep, Maserati, Citroen, Peugeot, Fiatతో సహా అనేక దిగ్గజ బ్రాండ్‌ల మాతృ సంస్థ అయిన Stellantis  30 కంటే ఎక్కువ దేశాల్లో పారిశ్రామిక కార్యకలాపాలతో పాటు 2020 నుండి విప్రోతో కలిసి  దేశీయంగా కూడా విస్తరిస్తోంది. ఇప్పుడు హైదరాబాదులో తన  కొత్త కార్యాలయంలో  సొంతంగా కార్యకలాపాలను  ప్రారంభించింది.

డిజిటల్ హబ్‌ను ప్రారంభించిన ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ పర్యావరణ వ్యవస్థను హైలైట్ చేస్తూ భారతదేశంలో మాత్రమే కాదు.  ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ అత్యంత  సమర్థవంతమైన మొబిలిటీ  ఎకో సిస్టం అని అన్నారు. తెలంగాణ ఐటి రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందని, 2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని మొత్తం ఐటి ఉద్యోగాలలో 44 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని  ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్  అన్నారు. సస్టైనబుల్ మొబిలిటీ అనేది రాబోయే భవిష్యత్తులో అగ్రస్థానంలో ఉంటుందని, ఈ సాంకేతికతను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని, అన్నారు.

“ హైదరాబాద్ నగరం ప్రతిభతో నిండి ఉందని. ఈ నగరం ప్రతిభను ఆకర్షిస్తుంది. ఈ నగరం మీకు విస్తరణకు చాలా ఎక్కువ అవకాశాలను ఇవ్వగలదు, ”అని  ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి శంకుస్థాపన చేసినందుకు స్టెల్లాంటిస్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చే నెలలో మొబిలిటీ వ్యాలీకి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

ప్రాజెక్ట్‌కు యాంకరింగ్ చేయడంలో  ముఖ్యమైన పాత్ర పోషించిన స్టెల్లాంటిస్ సాఫ్ట్‌వేర్ బిజినెస్ అండ్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ మమతా చామర్తిని ప్రశంసిస్తూ, హైదరాబాద్‌లో స్టెల్లాంటిస్ వేగంగా విస్తరించాలని  మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు, ప్రస్తుతం 770 మంది ఉద్యోగులతో రాబోయే మూడు రోజుల్లో 1,850 మంది నిపుణులకు చేరుకోవచ్చని అంచనా వేశారు.  ఈ సందర్భంగా స్టెల్లాంటిస్ చీఫ్ సాఫ్ట్‌వేర్ ఆఫీసర్ వైవ్స్ బోన్నెఫాంట్ కూడా మాట్లాడారు.

RITE సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభం

అనంతరం రైట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్  ప్రారంభించారు. తెలంగాణలో రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థ సిద్ధమైంది, వచ్చే మూడేళ్లలో ఐటీ నిపుణులకు 1,000 ఉద్యోగాలు కల్పించనుంది. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఆ సంస్థతో మంత్రి భేటీకి సంబంధించిన పరిణామమే ఈ కేంద్రం ఏర్పాటుకు దారి తీసింది. 

గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షిస్తూ హైదరాబాద్‌ భారతదేశానికి వనరుల రాజధానిగా మారిందని, గత తొమ్మిదేళ్లలో హైదరాబాద్  ఫాస్టెస్ట్ గ్రోత్  సాధిస్తోందని, 2014లో రూ.56,000 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు ఇప్పుడు రూ.2.41 లక్షల కోట్లకు చేరుకున్నాయని అన్నారు. .

"దేశంలోని ఏ నగరం హైదరాబాద్ వృద్ధి రేటుతో సరిపోల్చలేమని అన్నారు. అంతేకాదు ఐటీ రాజధానిగా పిలిచే, బెంగళూరు కూడా  హైదరాబాదులో పోటీ పడలేదని అని ఆయన అన్నారు, పూర్వ ఆంధ్రప్రదేశ్‌లో 3.23 లక్షల మంది ఐటి రంగంలో పనిచేస్తున్నారని, వారి సంఖ్య ఇప్పుడు 9 లక్షలు దాటుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో రైట్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు. సిఇఒ కృష్ణ బెండపూడి, సిఎఫ్‌ఓ ఇందు బెండపూడి, యుకె అండ్ యూరప్ ప్రెసిడెంట్ డాన్ కార్టర్ తదితరులు పాల్గొన్నారు.