ఆటోమేషన్‌లో సత్తా చాటిన హైదరాబాదీ స్టార్టప్

కార్పొరేట్ రంగానికి అద్భుతమైన సేవలందించేందుకు ముందుకు వచ్చిన సంస్థ ఇంటెల్లిబోట్.  ఆటోమేషన్ సొల్యూషన్స్‌లోనే ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నది హైదరాబాద్ స్టార్టప్ సంస్థ ఇంటెల్లిబోట్. 

Intellibot superb in Automation

హైదరాబాద్: అరక్షణంలో అరచేతిలోకి ప్రపంచం వచ్చేస్తున్న రోజులివి. అందుకే ఆటోమేషన్‌కు అంతగా డిమాండ్ ఉంది. అటువంటి ఆటోమేషన్ సొల్యూషన్స్‌లోనే ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నది హైదరాబాద్ స్టార్టప్ సంస్థ ఇంటెల్లిబోట్. ఆధునిక వ్యాపారాలకు అసలైన చిరునామా. తమ సరికొత్త ఆవిష్కరణలు, పరిష్కారాలతో ఆటోమేషన్ రంగంలో ఇంటెల్లిబోట్ అదర గొట్టేస్తున్నది.

2015లో ఇంటెల్లిబోట్‌ను శ్రీకాంత్ వేములపల్లి, కుషంగ్ మూర్తి, అలెక్ బార్లీ కలిసి స్థాపించారు. ఇంటెల్లిబోట్ వెనుకున్న టెక్నికల్ మేధస్సు శ్రీకాంతే. ఈయన అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీలో ఆర్కిటెక్చర్ ఆటోమేషన్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్‌పీఏ) గ్లోబల్ హెడ్‌గా పనిచేశారు.

కుషంగ్ మూర్తి సైతం హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్ టెక్నాలజీలో ఐటీ అండ్ అప్లికేషన్ సెక్యూరిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇక అలెక్ బార్లీ.. స్టార్టప్‌ల నిర్మాణంలో దూసుకుపోతున్న ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామిక వేత్త. కొత్త ఆలోచనలకు ఆర్థిక చేయూతనిస్తూ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నారు. ఈ ముగ్గురు ఇంటెల్లిబోట్ సహ వ్యవస్థాపకులేగాక, చిన్ననాటి స్నేహితులు కూడా కావడం విశేషం.

అంతర్జాతీయ సంస్థలకు ఆటోమేషన్ సొల్యూషన్స్‌ను చూపడంలో ఇంటెల్లిబోట్ అనతి కాలంలోనే గొప్ప పేరును సంపాదించింది. హెచ్‌ఎస్‌బీసీలో పని చేస్తున్నప్పుడు శ్రీకాంత్ మదిలో పుట్టిందే ఈ ఇంటెల్లిబోట్. హెచ్‌ఎస్‌బీసీలో ఆటోమేషన్ బిజినెస్ ప్రక్రియ క్రమబద్దీకరణలో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్.. సంస్థకు రూ. వందల కోట్లల్లో ఆదా చేసి అనేకానేక అవార్డులనూ గెలుచుకున్నారు.

అదరగొట్టిన రెడ్డీస్... లాభం రెట్టింపు

ఈ క్రమంలోనే ఆటోమేషన్ రంగంలో ఉన్న అవకాశాలను గ్రహించిన శ్రీకాంత్.. ఇంటెల్లిబోట్‌ను కుషంగ్, అలెక్‌లతో కలిసి ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్లలో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్‌లో ఇంటెల్లిబోట్ ఆవిష్కరణలు విశ్వ వ్యాప్తం అయ్యాయి. క్లీనింగ్ సర్వీసులు తదితర సేవల కోసం రోబోటిక్ యంత్రాలను పరిశ్రమకు ఇంటెల్లిబోట్ పరిచయం చేసింది. మరిన్ని కొత్త ఆవిష్కరణలకూ పదును పెడుతున్నది.

రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఇంటెల్లిబోట్.. కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిష్కారాలతో వ్యాపారాన్ని ఆధునికీకరిస్తున్నది. తర్వాతి తరం ఆటోమేషన్ అవసరాల కోసం మెషిన్ లెర్నింగ్, చాట్‌బోట్ వంటి సౌకర్యాలతో ఇంటెల్లిబోట్ స్టూడియో వీ2ను కూడా అందుబాటులోకి తెచ్చారు. 
కాగా, ఇంటెల్లిబోట్ సామర్థ్యాన్ని గుర్తించిన నాస్కామ్.. ఈ ఏడాది జనవరిలో తమ డీప్ టెక్ క్లబ్‌లో చోటు కల్పించింది. గ్లోబల్ రిసెర్చ్ సంస్థ ఫారెస్టర్ సైతం ఇంటెల్లిబోట్‌ను తమ ఆర్‌పీఏ సర్వీసెస్ కూడా గతేడాది చివరి త్రైమాసికం నివేదికలో కీర్తించింది. 
దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్ కూడా న్యూయార్క్‌లో నిర్వహించిన టీసీఎస్ ఇన్నోవేషన్ ఫోరంలో తమ కస్టమర్లకు ఇంటెల్లిబోట్‌ను పరిచయం చేసింది. ఎవరెస్ట్ గ్రూప్ పీక్ మ్యాట్రిక్స్ సైతం దీని కృషిని కొనియాడింది.

ఆడికార్లపై అదిరిపోయే బంపర్ ఆఫర్‌....

ఔత్సాహికులను అన్నివిధాలా ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌ను స్టార్టప్‌లకు కేంద్రంగా నిలిపింది. స్టార్టప్‌ల కోసం దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్.. టీ-హబ్‌నూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఇక పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. టెక్నాలజీకి ఇచ్చిన ప్రాధాన్యత స్టార్టప్‌లకు వరంగా మారింది. 

కృత్రిమ మేధస్సు ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం.. తెలంగాణలో ఉండటంతో స్టార్టప్‌లు హైదరాబాద్‌కు బారులు తీరాయి. ఫలితంగా స్టార్టప్ ఇండియాకు కేంద్రంగా భాగ్యనగరం తయారైంది. పలు ప్రోత్సాహకాలతో స్టార్టప్‌ల వెన్ను తడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటికి కావాల్సిన అన్ని అనుమతులనూ సులభంగా, వేగంగా అందజేస్తున్నది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios