హైదరాబాద్: ప్రముఖ ఫార్మా ఉత్పత్తుల సంస్థ డాక్టర్ రెడ్డీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అదరహో అనిపించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి చెల్లించిన తర్వాత రూ.1,092.50 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో వచ్చిన రూ.503.80 కోట్లతో పోలిస్తే రెండు రెట్లు కంటే అధిక వృద్ధి నమోదు చేసుకున్నది. 

ప్రస్తుతం ఉత్పాదకతపైనే కేంద్రీకరించామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ తెలిపింది. వ్యయ నియంత్రణలో భాగంగా పలు సంస్థలు ఉద్యోగాలను తొలగింపు దిశగా యోచిస్తున్న సంగతి తెలిసిందే. తమకు వ్రుద్ధికి అపార అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఉత్పాదకతకే ప్రాధాన్యం ఇస్తామని, అటువంటప్పుడు ఉద్యోగుల తొలగింపు అనే ప్రశ్నే ఉదయించదని రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సీఎఫ్ఓ సౌమెన్ చక్రవర్తి తెలిపారు. 

సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 26% పెరిగి రూ.4,801 కోట్లు ఉన్నది. మూడు బ్రాండ్లను విక్రయించడం ద్వారా ఒకేసారి భారీ స్థాయిలో ఆదాయం సమకూరడం, ట్యాక్స్ అడ్వాంటెజ్ లాభాల్లో రెండింతల వృద్ధికి దోహదం చేశాయని కంపెనీ ప్రెసిడెంట్, సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి తెలిపారు. కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో గ్లోబల్ జనరిక్ ఔషధాలను విక్రయించడం ద్వారా రూ.3,280 కోట్లు సమకూరాయి. గతేడాదితో పోలిస్తే ఏడు శాతం అధికం ఇది.

also read ఆడికార్లపై అదిరిపోయే బంపర్ ఆఫర్‌....

యూరప్, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, భారత్‌లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు దోహదం చేశాయి. అన్ని రంగాల్లో పనితీరు మెరుగైందని, నగదు రూపంలో మరింత బలోపేతం అయ్యామని కంపెనీ కో-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ తెలిపారు.

ఫలితాల వివరాలివి: ఉత్తర అమెరికా నుంచి సంస్థకు రూ. 1,430 కోట్ల ఆదాయం సమకూరింది. ధరలు ఒత్తిడికి గురికావడం, అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో మొదటి త్రైమాసికంతో పోలిస్తే 13 శాతం తగ్గాయి.

ఫార్మాస్యూటికల్స్ సర్వీసులు అండ్ యాక్టివ్ ఇంగ్రియంట్స్ విభాగాల నుంచి ఆదాయం 18 శాతం పెరిగి రూ.710 కోట్లకు చేరుకుంది. అమెరికాలో మూడు బ్రాండ్లను విక్రయించడంతో లైసెన్స్ ఫీజు కింద రూ.720 కోట్లు సమకూరడంతో లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. వీటిలో సైమ్‌టచ్, టోసిమ్రాతమ్, జెంబ్రాస్ ఉన్నాయి.

ఆదాయం పన్ను కింద రెడ్డీస్ ల్యాబ్స్ రూ.326 కోట్లు ప్రయోజనం పొందింది. కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలో ఇంతటిస్థాయి లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి. ర్యాంటిడైన్‌ను స్వచ్ఛందంగా విరమించుకోవడం, లాజిస్టిక్‌కు సంబంధించి పలు సమస్యలు తలెత్తడంతో సరఫరా వ్యవస్థలో కొంత ఇబ్బందులు తలెత్తాయి.

also read జాక్ డోర్సీకి షాక్: ట్విట్టర్​ నుంచి ఎలాన్​ మస్క్​ ఔట్

యాంటీ ఆల్సర్ ఔషధం ‘ర్యాంటిడిన్’లో కొన్ని మలినాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నదని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) అభ్యంతరం తెలపడంతో అమెరికా విపణి నుంచి ఈ ఔషధాన్ని స్వచ్ఛందంగా విరమించుకున్నట్లు సంస్థ సీఈఓ ఎరెజ్ ఇజ్రాయిలీ తెలిపారు. 

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎక్కడా దీనిని విక్రయించడం లేదన్నారు. దీనికి తమ వద్ద ప్రత్యామ్నాయ ఔషధాలు అందుబాటులో ఉన్నందున ఆదాయంపై ప్రభావం పడుతుందని భావించడం లేదని సంస్థ సీఈఓ ఎరెజ్ ఇజ్రాయిలీ  చెప్పారు. 

యూరప్ నుంచి రూ.280 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే 44 శాతం అధికం. మార్కెట్లో నూతన ఔషధాలను విడుదల చేయడం, అమ్మకాలు పెరుగడంతో కంపెనీకి 750 కోట్లు సమకూరాయి. సెప్టెంబర్ 30 నాటికి అమెరికా మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి 99 జనరిక్ మందులను దరఖాస్తు చేసుకున్నది.

గత త్రైమాసికంలో పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి రూ.370 కోట్ల నిధులను వెచ్చించింది. మొత్తం ఆదాయంలో దీని వాటా 7.6 శాతమే. గత ఆరు నెలల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి 214 కోట్ల నిధులను వెచ్చించింది.