న్యూఢిల్లీ: ఆర్థిక మాంద్యం దెబ్బ భారత్కు గట్టిగానే తగులబోతున్నదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి.. ఆర్థిక వేత్తలు కూడా ఇదే తరహా భయాలను వ్యక్తంచేస్తున్నారు. మోదీ ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఏకంగా ఆర్థిక మాంద్యం దెబ్బ గట్టిగానే తగులనున్నదని, భారత ఆర్థిక వ్యవస్థ అత్యవసర చికిత్స విభాగం (ఐసీయూ)లో ఉన్నదని వ్యాఖ్యానించారు.

నరేంద్ర మోదీ సర్కార్ తొలిసారి అధికారం చేపట్టినప్పుడు ఆర్థిక సలహాదారుడిగా వ్యవహరించిన సుబ్రమణియన్ గతేడాది ఆగస్టులో పదవికి రాజీనామా చేశారు. ఇంగ్లీష్ మీడియాకు రాసిన వ్యాసంలో ఆయన భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఇండియా హెడ్ జోష్ ఫెల్మేన్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తంచేశారు.

also read   ముకేశ్ అంబానీ...కేవలం ఐదేళ్లలో ఎంత సంపాదించాడో తెలుసా...

భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు బ్యాలెన్స్ షీట్ల నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్నదని, వీటిలో బ్యాంకులు, మౌలికం, ఎన్బీఎఫ్సీలు, రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి గట్టి సవాళ్లను ఎదుర్కొంటున్నదని అరవింద్ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. ఇదేమి సాధారణ మందగమనం కాదు..అతిపెద్ద సంక్షోభం ఎదుర్కొక తప్పదని హర్వర్డ్ యునివర్సిటీకి రాసిన వ్యాసంలో ఆయన హెచ్చరించారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు రెండు రకాల బ్యాలెన్స్ షీట్ సమస్యలు ఎదుర్కొంటున్నదని అరవింద్ సుబ్రమణ్యం తెలిపారు. వీటిలో స్టీల్, విద్యుత్, మౌలిక రంగానికి ఇచ్చిన రుణాలు వసూలు కాక బ్యాంకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.పెద్ద నోట్ల రద్దు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలతో ఈ సమస్య మరింత జఠిలమైందని సుబ్రమణ్యం తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి భారత్ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 4.5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. వరుసగా ఆరు త్రైమాసికాలుగా తగ్గుతూ వచ్చింది.

also read  టాటా సన్స్‌కు షాక్: చైర్మన్‌గా మళ్ళీ మిస్త్రీకే సారథ్యం

ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఉద్దీపన ప్యాకేజీలు లాంటివి అవసరం లేదని, ఇదే సమయంలో వ్యక్తిగత పన్ను తగ్గించడం కానీ లేదా జీఎస్టీ రేట్లను పెంచడం చేయడం వల్ల ఒరిగేదేమి లేదని అరవింద్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. కానీ ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించడం ఒక్కటే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. 

జీడీపీ, వినిమయం, ఉద్యోగ కల్పన, ఆర్థిక, మొండి బకాయిలతో సతమతం అవుతున్న బ్యాంకులను గట్టెక్కించాల్సిన అవసరం ఉందని అరవింద్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. 2017-18లో ఎన్బీఎఫ్సీలు రియల్ ఎస్టేట్ రంగానికి ఇచ్చిన రూ.5 లక్షల కోట్లు మొండి బకాయిల జాబితాలోకి వెళ్లాయి. ఆ తర్వాతి క్రమంలో ఐఎల్ఆండ్ఎఫ్ఎస్ సంక్షోభం మొత్తం బ్యాంకింగ్ రంగాన్ని అతలాకుతలం చేసింది.