2025-26 ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా? ఆదాయపు పన్ను శాఖ సంబంధిత ఫారాలు విడుదల చేసింది. కానీ ఫైల్ చేయడానికి ఒక ఇబ్బంది ఉంది. అదేంటో వివరంగా తెలుసుకుందాం రండి.
2025–26 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఏడు ITR ఫారాలను (ITR-1 నుండి ITR-7 వరకు) ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది. వీటిలో ITR-V, కొత్తగా విడుదల చేసిన ITR-U ఫారం కూడా ఉన్నాయి. ఈ ఫారాలు ఇప్పుడు అధికారిక పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. అయితే ఫైలింగ్ కి అవసరమైన ఇ-ఫైలింగ్ యుటిలిటీస్ ఇంకా యాక్టివేట్ కాలేదు.
ఇ-ఫైలింగ్ యుటిలిటీస్ అంటే ఏమిటి?
ఎవరైనా తమ ఆదాయాన్ని గవర్నమెంట్ కి తెలియజేయడానికి ఉపయోగించే సాధనాలను ఇ-ఫైలింగ్ యుటిలిటీస్ అంటారు. ఇవి సాధారణంగా మూడు రూపాల్లో ఉంటాయి.
- ఆన్‌లైన్ యుటిలిటీ. దీన్ని సాధారణంగా జీతం పొందే వ్యక్తులు ఉపయోగిస్తారు.
- ఎక్సెల్ యుటిలిటీ
- జావా లేదా JSON ఫార్మాట్‌లలో ఆఫ్‌లైన్ యుటిలిటీ. దీన్ని వృత్తి నిపుణులు ఉపయోగిస్తారు.
ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఇవి యాక్టివేట్ అయ్యే వరకు ట్యాక్స్ ఫైలింగ్ చేయడం సాధ్యం కాదు.
ఈ సంవత్సరం కొత్తగా ఏముంది?
ఈ సంవత్సరం కొత్తగా ITR-U ఫారం ప్రవేశపెట్టారు. ఇది మే 19న ప్రారంభించారు. ఇది పన్ను చెల్లింపుదారులను 48 నెలల వరకు ఆదాయపు పన్ను రాబడిని దాఖలు చేయడానికి లేదా సవరించడానికి అనుమతిస్తుంది. ఈ ఫారం గతంలో ట్యాక్స్ పే చేయని వారికి, చేసిన దాంట్లో తప్పులు చేసిన వారికి కరెక్ట్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఎలా సిద్ధం కావాలి?
ప్రస్తుతానికి ట్యాక్స్ ఫైలింగ్ ఇంకా ప్రారంభం కానప్పటికీ మీరు ముందుగానే అన్నింటినీ సిద్ధం చేసుకోవచ్చు. అవేంటే..
1. మీ ఆదాయ వనరులు, వృత్తి, నివాస స్థితి ఆధారంగా సరైన ITR ఫారాన్ని గుర్తించి ప్రింట్ తీసి పెట్టుకోండి.
- ఫారం 16, జీతం స్లిప్‌లు
- TDS సర్టిఫికెట్లు (ఫారం 16A)
- ఫారం 26AS, AIS, TIS
- బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ వడ్డీ సర్టిఫికెట్లు
- 80C, 80D మొదలైన వాటి కింద మినహాయింపుల కోసం పెట్టుబడి రుజువులు
- PAN, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు. ఇలాంటి అవసరమైన పత్రాలను సేకరించి సిద్ధం చేసుకోండి.
2. మీ వార్షిక సమాచార ప్రకటన (AIS), పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం(TIS)లను మీ ఫైనాన్షియల్ రికార్డులతో పోల్చి చూసుకోండి.
ఇతర ఆదాయాలు ఉన్న వారు ఏం చేయాలంటే..
మూలధన లాభాలు, ఇతర ఆదాయ వనరులు, క్రిప్టో పెట్టుబడులు లాంటివి ఉన్నవారు వీటిని సిద్ధంగా ఉంచుకోవాలి.
- బ్రోకర్లు లేదా మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి మూలధన లాభాల నివేదికలను డౌన్‌లోడ్ చేసుకోండి.
- TDS సర్టిఫికెట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను సమీక్షించండి.
- వర్చువల్ డిజిటల్ ఆస్తుల(VDA)పై కచ్చితంగా నివేదించడానికి క్రిప్టో లావాదేవీల రికార్డులను ఉంచుకోండి.