- Home
- Business
- BLS Polymers IPO: మొదటి రోజే ఇన్వెస్టర్లకు నోట్ల వర్షం.. ఈ ఐపీఓ 65% లాభాలతో ధమాకా ఎంట్రీ
BLS Polymers IPO: మొదటి రోజే ఇన్వెస్టర్లకు నోట్ల వర్షం.. ఈ ఐపీఓ 65% లాభాలతో ధమాకా ఎంట్రీ
BLS Polymers IPO: బీఎల్ఎస్ పాలిమర్స్ షేర్లు ఎన్ఎస్ఈలో 65.33% ప్రీమియంతో రూ. 248 వద్ద ధమాకా లిస్టింగ్ ఇచ్చాయి. ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలు తెచ్చిపెట్టిన ఈ షేరును కొనాలా, అమ్మాలా? మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారు?

BLS పాలిమర్స్ ఐపీఓ గ్రాండ్ ఎంట్రీ: 65 శాతానికి పైగా ప్రీమియంతో దలాల్ స్ట్రీట్‌లో బ్లాక్‌బస్టర్ లిస్టింగ్
నవంబర్ 3న భారతీయ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన బీఎల్ఎస్ పాలిమర్స్ (BLS Polymers) కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో భారీ లాభాలను అందించాయి. ఇష్యూ ధర రూ. 150తో పోలిస్తే ఏకంగా 65 శాతానికి పైగా ప్రీమియంతో గ్రాండ్ లిస్టింగ్ నమోదు చేశాయి. దీంతో మొదటి రోజే ఇన్వెస్టర్ల జేబులు నోట్లతో నిండిపోయాయి.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) లో ఈ షేరు 65.33 శాతం లాభంతో రూ. 248 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లో 62.73 శాతం ప్రీమియంతో రూ. 244.10 వద్ద ఎంట్రీ ఇచ్చింది. లిస్టింగ్ అయిన వెంటనే కూడా కొనుగోళ్ల జోరు కొనసాగడంతో షేరు ధర ఏకంగా 90.16 శాతం ఎగబాకి బిఎస్ఈలో రూ. 285.25 వద్ద ఇంట్రాడే హై తాకింది. ఉదయం 11:05 గంటల సమయంలో 14.3 శాతం లాభంతో రూ. 279 వద్ద ట్రేడయింది. ఈ బలమైన ఎంట్రీతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,514.20 కోట్లకు చేరింది.
ఒక్క లాట్‌పై రూ. 9,800 లాభం
ఈ ఐపీఓ ద్వారా ఇన్వెస్టర్లకు లాట్ల రూపంలో షేర్లు కేటాయించారు. ఎన్ఎస్ఈలో లిస్టింగ్ రోజున ఒక్కో లాట్‌పై ఇన్వెస్టర్లకు రూ. 9,800 లాభం రాగా, బిఎస్ఈలో ఒక్కో లాట్‌పై రూ. 9,410 చొప్పున లిస్టింగ్ గెయిన్ లభించింది. లిస్టింగ్ కంటే ముందు గ్రే మార్కెట్లో 46 శాతం ప్రీమియం లభిస్తుందని అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ అంతకంటే మెరుగైన రీతిలో 65 శాతానికి పైగా లాభాలతో మార్కెట్లో అడుగుపెట్టింది.
241 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌తో సంచలనం
ఈ ఐపీఓకు ప్రారంభం నుంచే పెట్టుబడిదారుల నుండి భారీ స్పందన లభించింది. అక్టోబర్ 27న ప్రారంభమై అక్టోబర్ 29న ముగిసిన ఈ ఇష్యూ మొత్తం 241.22 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. 1.19 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా, ఏకంగా 287.05 కోట్ల షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. నాల్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో అత్యధికంగా 559.20 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల కేటగిరీలో 200.25 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో 128.36 రెట్లు సబ్స్క్రిప్షన్ నమోదైంది.
కంపెనీ ఏం చేస్తుంది? నిధులు దేనికి వాడతారు?
న్యూఢిల్లీకి చెందిన బీఎల్ఎస్ పాలిమర్స్ రకరకాల పారిశ్రామిక అవసరాల కోసం స్పెషలైజ్డ్ పాలిమర్ కాంపౌండ్స్‌ను తయారు చేస్తుంది. విద్యుత్, టెలికాం, రైల్వే రంగాలు ఉపయోగించే వైర్లు, కేబుల్స్ ఇన్సులేషన్ కోసం ఈ ఉత్పత్తులు ఉపయోగపడతాయి. అలాగే భూగర్భ చమురు, గ్యాస్, నీటి పైప్లైన్లు పాడవకుండా చూసేందుకు కోటింగ్‌గా కూడా వీటికి డిమాండ్ ఉంది.
గోవాలోని తన తయారీ కేంద్రాన్ని విస్తరించడానికి రూ. 77.56 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం రూ. 89.5 కోట్లు ఉపయోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తారు.
నిపుణులు ఏమంటున్నారు? కొనాలా? అమ్మాలా?
లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లు ఏమి చేయాలనే దానిపై విశ్లేషకులు తమ అభిప్రాయాలను గమనిస్తే.. ఇన్ఫ్రా రంగంలో పెరుగుతున్న పెట్టుబడుల వల్ల ఈ కంపెనీకి మంచి అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు షేర్లను హోల్డ్ చేయవచ్చు లేదా కొద్దిగా లాభాలను బుక్ చేసుకోవచ్చని చెబుతున్నారు.
షేర్లు లభించిన ఇన్వెస్టర్లు కొన్ని షేర్లను విక్రయించి పాక్షిక లాభాలు బుక్ చేసుకోవడం మంచిదని మరికొందరు చెబుతున్నారు. మిగిలిన వాటిని మీడియం నుంచి లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చు. కొత్త ఇన్వెస్టర్లు షేరు ధర స్థిరపడే వరకు ఆగాలి. లిస్టింగ్ రోజున కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని, కంపెనీ విస్తరణ పనులను ట్రాక్ చేస్తూ మరిన్ని షేర్లు తీసుకోవడం మంచిదని కూడా చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం మార్కెట్ వార్తల సమాచారం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి.





