Asianet News TeluguAsianet News Telugu

కుప్పకూలిన పర్యాటక రంగం...దేశంలో వారికి వీసాల రద్దు...

కరోనా వైరస్ కలవర పెడుతోంది. దేశీయ పర్యాటక రంగం కుప్పకూలింది. ఏవియేషన్, ట్రావెల్‌పై భారీగా దెబ్బ పడింది. వచ్చేనెల 15 వరకు దేశంలోకి విదేశీయులకు వీసాల రద్దుతో సమస్యలు తలెత్తాయి. దేశీయ పర్యాటక రంగానికి రూ. 8,500 కోట్ల నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
 

Impact of coronavirus on Indian tourism specially  the government suspending all visas
Author
Hyderabad, First Published Mar 13, 2020, 10:26 AM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దెబ్బతో దేశీయ పర్యాటక రంగం కుదేలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెలరోజులు వీసాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ట్రావెల్, టూరిజం, ఏవియేషన్‌ రంగాలు దాదాపు రూ. 8,500 కోట్ల మేరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. 

వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే భారత్​లో సుమారు 490కి పైగా విదేశీ విమానాలు రద్దయ్యాయి. మరో 90కి పైగా దేశీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. కరోనా మహమ్మారిని నియంత్రణకు భారత్​ ఇప్పటికే దౌత్య, ఉద్యోగ సంబంధిత వీసాలు మినహా అన్నీ ఏప్రిల్​ 15 వరకు నిలిపివేసింది.

కంపెనీలు నియామకాలు నిలిపివేయడం, అంతగా అవసరం ఉండని సిబ్బందిని తొలగించడం వంటి చర్యలు తీసుకోనుండటంతో ఆయా రంగాల్లో భారీగా ఉద్యోగాల కోతలు కూడా ఉండొచ్చని ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టూర్‌ ఆపరేటర్స్‌ (ఏఐటీవో), అసోచామ్ వంటి సంస్థలు పేర్కొన్నాయి.

also read స్టాక్స్ మార్కెట్ అల్లకల్లోలం...రూ.11 లక్షల కోట్లు హాంఫట్

ఈ నేపథ్యంలో వీసాలపై నెల రోజుల నిషేధాన్ని పది రోజుల తర్వాతైనా పునఃసమీక్షించాలని, కొన్ని నగరాల నుంచైనా భారత్‌కి ప్రయాణాలను అనుమతించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. కరోనా బయటపడినా ఇప్పటిదాకా ఎంతో కొంత పర్యాటకం కొనసాగుతుండటంతో సిబ్బందిని, ఖర్చులను కాస్తయినా నిర్వహించుకోగలుగుతున్నామని.. వీసాల రద్దుతో గట్టి దెబ్బే తగలనుందని అసోచాం టూరిజం, హాస్పిటాలిటీ కౌన్సిల్‌ చైర్మన్‌ సుభాష్‌ గోయల్‌ చెప్పారు.  

అత్యవసరంగా వెళ్లాల్సిన పనులు మినహా సాధారణ ప్రయాణాలను ప్రజలు వాయిదా వేసుకుంటున్న నేపథ్యంలో దేశీ విమానయానం ఈ మధ్యకాలంలో 15% వరకు తగ్గిపోయిందని అంచనా. ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల నుంచి రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. 

టికెట్లు బుక్‌ చేసుకున్న కస్టమర్లు కూడా చివరి నిమిషంలో రద్దు చేసుకుంటున్నారని ఎయిర్‌లైన్స్‌ చెబుతున్నాయి. ఆక్యుపెన్సీ రేటు తగ్గిపోతున్న కారణంగా విమాన సేవలు నడిపేందుకయ్యే కనీస ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని, ఫలితంగా ఎయిర్‌లైన్స్‌ ఆదాయాలు పడిపోతున్నాయని జేఎం ఫైనాన్షియల్స్‌ ఒక నివేదికలో పేర్కొంది. 

ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే.. కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి బ్రిటన్‌కు చెందిన విమానయాన సంస్థ ఫ్లైబీ మాదిరిగానే ఇక్కడి సంస్థలు కూడా కుప్పకూలొచ్చని తెలిపింది. బెంగళూరు ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య 50 శాతం తగ్గిపోయింది. 

కరోనావైరస్‌ భయాలతో పలు దేశాలు ట్రావెల్‌పరమైన ఆంక్షలు విధించడం, పలు ఫ్లయిట్లు రద్దు కావడం తదితర అంశాలు దీనికి కారణం. ఇటు దేశీయంగా ప్రయాణించే వారి సంఖ్య కూడా 2–4 శాతం తగ్గిందని, కరోనా కేసులు పెరిగిన పక్షంలో ఇది ఇంకా పెరగవచ్చని బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు (బీఐఏఎల్‌) ఒక ప్రకటనలో తెలిపింది.

also read ఇండియన్ మెడిసిన్స్ కు అక్కడ ఫుల్ డిమాండ్...వాటిని కొనేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి...

దేశీయ విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్యాసింజర్ల సంఖ్య గతంలో రోజుకు 70వేల స్థాయిలో ఉంది. ప్రస్తుతం 62,000కు తగ్గిపోయినట్లు పౌర విమానయాన మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ తెలిపారు. ఇది 40,000కు కూడా పడిపోవచ్చన్నారు.

ఆఖరి నిమిషంలో టికెట్ల రద్దుతో నిర్వహణ ఖర్చులు రాబట్టుకునేందుకు ఎయిర్‌లైన్స్‌ ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు..  చెన్నై నుంచి బెంగళూరుకు వోల్వో బస్సు టికెట్‌ ధర రూ.1,100 ఉండగా.. ఇదే ధరకు పలు కంపెనీల విమాన టికెట్‌ లభిస్తోంది. ఇంకా చాలా రూట్లలో ఇదే తరహాలో విమాన టికెట్ల రేట్లు పడిపోయాయి.   

కరోనా నేపథ్యంలో రోజువారీ బుకింగ్​లు 15-20 శాతం మేర తగ్గిపోయాయని భారత అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వెల్లడించింది. ఈ ఫలితాలు త్రైమాసిక ఆదాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని సంస్థ తెలిపింది.ప్రస్తుతం విమాన రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతుందని అయితే ఇదంతా తాత్కాలికమేనని స్పైస్​ జెట్​ ఛైర్మన్​, ఎండీ అజయ్​ సింగ్​ అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios