Asianet News TeluguAsianet News Telugu

మరింత దిగజారుతున్న భారత వృద్ధిరేటు.. వచ్చే ఏడాదిపైనే ఆశలు..

కరోనా వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోయిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 4.5 శాతం జీడీపీ నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అయితే వచ్చే ఏడాది తిరిగి పుంజుకునే అవకాశం ఉన్నదని పేర్కొంది.
 

IMF reverses its optimism for India, sees 4.5% GDP contraction in FY21
Author
Hyderabad, First Published Jun 25, 2020, 12:11 PM IST

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ఆర్థిక వ్యవస్థ నష్టపోనున్నది. ప్రస్తుత సంవత్సరంలో భారత్‌ వృద్ధిరేటు మైనస్‌ 4.5 శాతానికి పడిపోనున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తాజాగా అంచనాను విడుదల చేసింది. ఇది చారిత్రక స్థాయి తగ్గుదల అని అభివర్ణించింది. 

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలపాలు పూర్తిగా నిలిచి పోయాయని ఐఎంఎఫ్ వెల్లడించింది.  కీలక రంగాలు సహా పలు పరిశ్రమలు పని చేయకపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలై వ్రుద్ధిరేటు కుంచించుకుపోయింది.

వచ్చే ఏడాది మాత్రం తిరిగి కోలుకొని 6 శాతం వృద్ధిని సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తంచేసింది. అలాగే ప్రపంచ దేశాల వృద్ధిరేటు కూడా -4.9 శాతానికి పడిపోవచ్చని అభిప్రాయపడింది. 

1961 తర్వాత ఇదే అత్యంత కనిష్ఠ స్థాయి వృద్ధని పేర్కొంది. కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, అన్ని దేశాల్లో వృద్ధిరేటు చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోనున్నదని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థిక వేత్త గీతా గోపినాథ్‌ తెలిపారు. 

ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ వైరస్‌ ఈ ఏడాది తొలి ఆరు నెలలు ప్రతికూల ప్రభావం చూపుతుందని, రెండో అర్థభాగంనాటికి పరిస్థితులు కాస్త చక్కబడే అవకాశం ఉన్నదని అన్నారు. వైరస్‌ను కట్టడి చేయడంలో లాక్‌డౌన్‌ కీలక పాత్ర పోషించినా, ఇదే సమయంలో మహామాంద్యం ముప్పిట్లోకి నెట్టిందని గోపినాథన్‌ తెలిపారు. 

ప్రస్తుత సంవత్సరంలో భారత్‌తోపాటు ప్రపంచ దేశాల వృద్ధి పాతాళానికి పడిపోనున్నట్లు అంచనావేస్తున్న ఐఎంఎఫ్‌.. వచ్చే ఏడాది మాత్రం తిరిగి కోలుకోనున్నదని పేర్కొంది. 2020లో మైనస్‌ 4.9 శాతానికి పడిపోతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతానికి ఎగబాకవచ్చని తెలిపింది.

also read అతను కోర్టుకెక్కడం అందర్నీ ఆశ్చర్యపర్చింది...

ఏప్రిల్‌ నెలలో అంచనా విడుదల చేసినప్పుడు ప్రపంచ దేశాల వృద్ధి 3 శాతానికి పరిమితం కానున్నదని తెలిపింది. చైనా వృద్ధిరేటు కూడా 1.0 శాతానికి తగ్గవచ్చని పేర్కొంది. కొవిడ్‌-19కు ఇంకా ఔషధాన్ని కనుగొనకపోవడంతో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు అనిశ్చితిలోకి జారుకోనున్నాయని గోపినాథన్‌ హెచ్చరించారు. 

ఇదిలా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో భారత జీడీపీ వృద్ధి రేటు -5.3 శాతానికి క్షీణించవచ్చని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ తాజా నివేదిక అంచనా వేసింది. దేశ చరిత్రలో ఇదే అత్యంత కనిష్ఠ స్థాయి వృద్ధి కానుందని, ఆరో సారి వృద్ధి రేటు మైన్‌సలోకి జారుకోనుందని ఆ నివేదిక పేర్కొంది. 

లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ దాదాపు స్తంభించిపోయిందని.. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికీ కొన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోలేకపోవచ్చని ఇండియా రేటింగ్స్‌ అభిప్రాయపడింది. ఈ ప్రభావంతో ఆర్థిక సంవత్సరంలోని ప్రతి త్రైమాసికంలోనూ వృద్ధి రేటు మైన్‌సలోనే నమోదు కానుందని సంస్థ అంచనా.

వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో మాత్రం వృద్ధి మళ్లీ పుంజుకొని 5-6 శాతానికి ఎగబాక వచ్చంటోంది. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో వాణిజ్య కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకోనుండటం వృద్ధి పునరుద్ధరణకు దోహదపడనున్నాయని ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది.

మన దేశంలో 1950-51 ఆర్థిక సంవత్సరం నుంచి జీడీపీ గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఐదు (1957-58, 1965-66, 1966-67, 1972-73, 1979-80) ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేటు మైన్‌సలో నమోదైంది. 1979-80లోనైతే -5.2 శాతానికి పతనమైంది. ప్రస్తుతానికి చారిత్రక కనిష్ఠమిదేనని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు 9.4 శాతం మేర తగ్గవచ్చు. 2019-20లోనైతే ఎగుమతుల క్షీణత -4.9 శాతంగా నమోదైంది. 2020-21లో దిగుమతులు 17.4 శాతం తగ్గవచ్చని ఇండియా రేటింగ్స్‌ అంచనా. తత్ఫలితంగా ఈసారి వాణిజ్య లోటు నాలుగేళ్ల కనిష్ఠ స్థాయి 9,770 కోట్ల డాలర్లకు (జీడీపీలో 3.9 శాతం) తగ్గనుంది. 

భారత కార్పొరేట్‌ కంపెనీలకు రేటింగ్‌ గండం పొంచి ఉందని మరో గ్లోబల్‌ రేటింగ్స్‌ ఎస్‌ అండ్‌ పీ హెచ్చరించింది. కంపెనీల ఆర్థిక పనితీరు పునరుద్ధరణ 18 నెలలకు మించితే వాటి రేటింగ్‌ను మరింత తగ్గించే అవకాశం ఉందని తాజా నోట్‌లో పేర్కొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios