Asianet News TeluguAsianet News Telugu

అతను కోర్టుకెక్కడం అందర్నీ ఆశ్చర్యపర్చింది...

అపర కుబేరులుగా ఉన్న హిందూజా సోదరుల మధ్య ఇంటి పోరు మొదలైంది. ఆస్తి విభజన కోసం తగాదా ప్రారంభమైంది. అందరికీ న్యాయం, ధర్మం చెప్పాల్సిన పెద్దన్న శ్రీ చంద్ పరమానంద హిందూజా  కోర్టుకు ఎక్కడం వివాదాంగా మారింది. ఈ వివాదానికి కేంద్ర బిందువు 2014 నాటి లెటర్‌ కావడం గమనార్హం.
 

Hinduja brothers fight over letter dividing $11 billion fortune
Author
Hyderabad, First Published Jun 25, 2020, 11:09 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

లండన్‌: ఆస్తుల పంపకాల్లో సోదరుల మధ్య తగాదాలు సర్వసాధారణమే. కానీ, బయటి ప్రపంచానికి ఎంతో ఆత్మీయంగా కన్పించే హిందూజా సోదరులు కూడా కుటుంబ ఆస్తుల విషయంలో కోర్టుకెక్కడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. అందులోనూ హిందూజా కుటుంబానికి పెద్ద దిక్కుగా, తానే న్యాయ నిర్ణేతగా వ్యవహరించాల్సిన అగ్రజుడు శ్రీచంద్‌ పరమానంద్‌ (ఎస్‌పీ) హిందూజా ఈ కేసు వేయడం మరింత ఆశ్చర్య చకితులను చేస్తోంది.

తన సోదరులు గోపీచంద్‌  హిందూజా, ప్రకాశ్‌ హిందూజా, అశోక్‌ హిందూజాలకు వ్యతిరేకంగా శ్రీ చంద్ పరమానందన్ హిందూజా కేసు వేశారు. ఈ వివాదానికి 2014 జూలై నాటి లెటర్‌ కేంద్ర బిందువుగా మారింది. 

ఆ లేఖ చెల్లుబాటు, ప్రభావం చుట్టే ఈ కేసు ముడిపడి ఉంది. ఆస్తుల పంపకం విషయంలో ప్రతి సోదరుడు మరో సోదరుడిని తన ఎగ్జిక్యూటర్‌గా నియమించుకుంటాడనీ,  ఏ సోదరుడి పేరుమీదున్న ఆస్తి అయినా నలుగురికీ చెందుతుందని ఆ లేఖలో ఉంది.

అయితే ఆ పత్రం గతంలో సోదరులు కుదుర్చుకున్న అనధికారిక అగ్రిమెంట్‌ లేదా వీలునామా లేదా కుటుంబ నియమం లేదా పవర్‌ ఆఫ్‌ అటార్నీ అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. తాజాగా 84 ఏళ్ల ఎస్‌పీ హిందూజా.. ఈ లెటర్‌కు చట్టపరంగా ఎలాంటి విలువ, ప్రభావం లేదని, వీలునామాగానూ భావించలేమని ప్రకటించాలంటూ కోర్టును ఆశ్రయించారు.

వృద్ధాప్యంలో చిత్తవైకల్యానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఎస్‌పీ హిందూజా తరఫున ఆయన కూతురు వినూ ఈ కేసులో పాల్గొనేందుకు ఇంగ్లాండ్‌ హైకోర్టు మంగళవారం అనుమతించడంతో హిందూజాల మధ్య వివాదం బయటికి వచ్చింది. వినూకు శ్రీచంద్, భార్య, ఇతర సంతానం మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

హిందూజా గ్రూపులోని చాలా కంపెనీల్లో ఈ సోదరులకు వ్యక్తిగత వాటాలు లేవు. కంపెనీల్లోని ప్రమోటర్ల వాటాలన్నీ గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీల పేరిటే ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లోని హిందుజా బ్యాంక్‌ మాత్రం ఎస్‌పీ హిందూజా పేరుతో ఉంది.

భారత్‌లోని హిందూజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌లోనూ సోదరులకు వ్యక్తిగత హోదాలో వాటాలు ఉన్నాయి. గతంలో రాసుకున్న లేఖను ఉపయోగించుకొని గోపీచంద్‌, ప్రకాశ్‌, అశోక్‌ హిందూజా పెద్దన్న పేరు మీదున్న హిందూజా బ్యాంక్‌ నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. 

also read మరో 3 లేదా నాలుగేళ్లలో విడిపోనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్..?!

తమ మధ్య కొనసాగుతున్న ఆస్తి తగాదాతో గ్రూప్‌ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ముగ్గురు సోదరులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, కోర్టుకెక్కడం మాత్రం తమ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, కుటుంబ విలువలకు వ్యతిరేకమని వారు పేర్కొన్నారు.

‘ప్రతిదీ అందరికీ చెందుతుంది. ఏది కూడా ఏ ఒక్కరికో సంబంధించింది కాదు’’ అన్న కుటుంబ నియమం దశాబ్దాలనాటిదని హిందూజా సోదరులు పేర్కొన్నారు. అయితే, కోర్టులో ఎస్‌పీ హిందూజా నెగ్గితే, ఆయన పేరిట ఉన్న బ్యాంక్‌ ఆస్తులన్నీ వినూ పేరిట బదిలీ అవుతాయి. 

హిందూజా సోదరులు ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఫోర్బ్స్‌ రియల్‌ టైం బిలియనీర్స్‌ సూచీ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం వారి ఆస్తి 1,310 కోట్ల డాలర్లు. ఈ జాబితాలో వారు 125వ స్థానంలో ఉన్నారు. సుమారు 40 దేశాలకు విస్తరించిన హిందూజా గ్రూప్‌.. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఆటోమొబైల్‌, టీవీ, మీడియా, బీపీఓ, లూబ్రికెంట్స్‌ తదితర వ్యాపారాలను నిర్వహిస్తోంది. 

భారత పారిశ్రామిక రంగంలో హిందూజాలకు ప్రత్యేక స్థానం ఉంది. నలుగురు హిందూజా సోదరులు సమిష్ఠిగా వ్యాపార లావాదేవీలు జరుపుతారన్న పేరు గడించారు. వీరిలో పెద్దవాడైన శ్రీ చంద్ పరమానంద్ హిందూజా కుమార్తె వినూ కోర్టుకెక్కినట్లు తెలుస్తోంది. శ్రీ చంద్, గోపీచంద్, ప్రకాశ్, అశోక్ హిందుజు 2014 జూలైలో ఓ ఓప్పందం కదుర్చుకున్నారు. ఆస్తులు నలుగురి పేరుతో ఉండేలా అంగీకారానికి వచ్చారు.

ఇప్పుడు శ్రీ చంద్ సంతానం.. కుటుంబ గ్రూపు ఆస్తులను వేర్వేరు చేయలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ ఒప్పందంపై లండన్, స్విట్జర్లాండ్, జెర్సీ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. తాజగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని వినూ.. లండన్ లోని బిజినెస్ అండ్ ప్రాపర్టీ కోర్టులో పిటిషన్ వేశారు. 

దీన్ని వ్యతిరేకించిన హిందూజా సోదరులు తమ అన్న శ్రీ చంద్ ఆరోగ్య పరిస్థితిపై వినూ తగిన ఆధారాలు సమర్పించలేదని చేసిన వాదనను లండన్ న్యాయస్థానం అంగీకరించలేదు. శ్రీ చంద్ కు వినూను లిటిగేషన్ ఫ్రెండ్ గా అంగీకరిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 2018 జూలై నుంచి శ్రీ చంద్ దంపతుల బాగోగులను ఆమె చూస్తున్నారని వ్యాఖ్యానించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios