BMW గ్రూప్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా, సీఈఓగా హర్దీప్ సింగ్ బ్రార్ నియమితులయ్యారు. ఈ బాధ్యతలు ఆయన 2025 సెప్టెంబర్ 1 నుంచి చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ హర్దీప్ సింగ్ ఎవరు.? ఆయన నేపథ్యం ఏంటో తెలుసుకుందాం.
విక్రమ్ పవాహ్‌కి కొత్త బాధ్యతలు
ప్రస్తుత CEO విక్రమ్ పవాహ్ తన పదవికి రాజీనామా చేసి, ఇప్పుడు BMW గ్రూప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ CEOగా బాధ్యతలు చేపట్టనున్నారు. విక్రమ్ పవాహ్ 2017 నుంచి BMW గ్రూప్‌తో కలిసి పనిచేస్తూ భారత్, ఆస్ట్రేలియాలోనూ సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.
హర్దీప్ సింగ్ బ్రార్ అనుభవం
హర్దీప్ సింగ్ బ్రార్‌కు 30 సంవత్సరాలకుపైగా భారత ఆటోమొబైల్ రంగంలో అనుభవం ఉంది. గతంలో కియా ఇండియాలో సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అలాగే మారుతీ సుజుకి, వోక్స్‌వ్యాగన్, జనరల్ మోటార్స్, నిస్సాన్, గ్రేట్ వాల్ మోటార్ కంపెనీ లాంటి ప్రముఖ కంపెనీల్లో కీలకపాత్రలు నిర్వహించారు.
ఈయన పంజాబ్‌లోని థాపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌లో కూడా పాల్గొన్నాడు.
BMW ఇండియాలో ప్రస్తుత కార్యకలాపాలు
BMW ఇండియా దేశంలో ప్రీమియం కార్ల మార్కెట్పై దృష్టి పెట్టింది. గోర్గాన్‌లో ప్రధాన కార్యాలయం, చెన్నైలో తయారీ యూనిట్, పుణేలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, గోర్గాన్‌లో ట్రైనింగ్ సెంటర్ ఉన్నాయి. BMW గ్రూప్ ప్లాంట్ చెన్నైలో 10 మోడళ్ల కార్లు లోకల్‌గా తయారు చేస్తున్నాయి. మినీ కార్లు 2012 నుంచి భారత్‌లో ప్రీమియం స్మాల్ కార్లుగా స్థిరపడ్డాయి.
కాగా BMW Motorrad (బైక్స్ విభాగం) 2017లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. BMW, MINI, BMW Motorrad బ్రాండ్లతో కలిపి BMW గ్రూప్ ఇండియా దేశవ్యాప్తంగా 80కి పైగా టచ్‌పాయింట్లు కలిగి ఉంది. వీటి ద్వారా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంపై సంస్థ దృష్టిసారిస్తోంది.
