న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే భారీ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. మునుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తెర తీసింది. ఆర్థిక వ్యవస్థలో మందగమనం వల్ల తగ్గిన రాబడులను పెంచుకునే లక్ష్యంతో ఐదు ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను కేంద్ర ప్రభుత్వం విక్రయించనున్నది. 

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)తోపాటు షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ), కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌) వాటాలను విక్రయించాలని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని జరిగిన కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను 51 శాతానికన్నా దిగువకు తగ్గించుకోవాలని నిర్ణయించింది. 

also read  అగ్రశ్రేణి బిజినెస్ పర్సన్ సత్యనాదెళ్ల: బంగా, ఉల్లాల్‌లకూ ఫార్చ్యూన్‌లో చోటు

దేశంలోనే రెండో అతిపెద్ద చమురు రిఫైనరీ సంస్థ బీపీసీఎల్‌లో యాజమాన్య నిర్వహణ హక్కుల బదలాయింపుతోపాటు మొత్తం 53.29 శాతం వాటాలను వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

ఈ సంస్థల్లో నిర్వహణాధికార బదిలీ కూడా ఉంటుందని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. బీపీసీఎల్‌ పోర్ట్‌ఫోలియో నుంచి నుమలీగఢ్‌ రిఫైనరీని విడదీసిన తర్వాత బీపీసీఎల్‌లో ఉన్న 53.29 శాతం వాటాను ప్రభుత్వం అమ్మేయనుందని సీతారామన్‌ చెప్పారు. దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థగా బీపీసీఎల్‌ ఉన్న విషయం తెలిసిందే. 

ఇప్పటికే హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)లో మెజారిటీ వాటాను మరో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఓఎన్జీసీకి మోదీ సర్కారు అమ్మేసిన సంగతి విదితమే. కాగా, నుమలీగఢ్‌ రిఫైనరీ మరో ప్రభుత్వ రంగ సంస్థ చేతుల్లోకి వెళ్తుందన్నారు. 

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్న తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (టీహెచ్‌డీసీఐఎల్‌)లో వాటానూ ప్రభుత్వం అమ్మేస్తోంది. నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (నీప్కో)లోని వాటానూ విక్రయిస్తున్నట్లు సీతారామన్‌ స్పష్టం చేశారు. ఈ రెండు సంస్థల్లోని ప్రభుత్వ వాటాలను మరో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ కొనుగోలు చేయనున్నది. 

ఎస్‌సీఐలో ప్రభుత్వానికి 63.75 శాతం వాటా ఉండగా, అందులో 53.75 శాతం వాటాను అమ్మేసేందుకు ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) అనుమతిచ్చింది. కాంకర్‌లో 54.80 శాతం వాటా ఉండగా, 30.90 శాతం వాటాను విక్రయించనున్నారు.

దేశీయ చమురు మార్కెటింగ్‌ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) తదితర సంస్థల్లో ప్రభుత్వ వాటా 51 శాతం దిగువకు పడిపోనున్నది. అయినా నిర్వహణాధికారం కేంద్రం చేతుల్లోనే ఉండనున్నది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ వాటాలను కొంటాయని కేంద్రం తెలిపింది. ఐవోసీలో ప్రస్తుతం కేంద్రానికి 51.5 శాతం వాటా ఉన్నది. 

మిగతా వాటాలు ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసీ, ఓఎన్జీసీ, ఆయిల్‌ ఇండియా చేతుల్లో ఉన్నాయి. కాగా, ఐవోసీలో 26.4 శాతం వాటాను ప్రభుత్వం అమ్మేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిద్వారా రూ.33 వేల కోట్ల నిధులు ఖజానాకు చేరవచ్చని అంచనా. 

ఇదిలావుంటే 22 శాతానికి కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లునూ కేంద్ర క్యాబినెట్‌ ఈ సందర్భంగా ఆమోదించింది. అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (ఐఎఫ్‌ఎఫ్‌సీ)లో అన్ని ఆర్థిక సేవల నియంత్రణ కోసం యూనిఫైడ్‌ అథారిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీతారామన్‌ తెలిపారు. 

ఇండస్ట్రియల్‌ రిలేషన్‌ కోడ్‌ బిల్లును కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. గరిష్ఠ స్థాయికి చేరుకున్న ఉల్లి ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా ఉల్లి సరఫరాను మెరుగుపరుచడానికి 1.2 లక్షల టన్నుల ఉల్లి దిగుమతి చేసుకోవడానికి కేంద్ర క్యాబినెట్‌ అనుమతినిచ్చింది.

టెల్కోలకు రూ.42వేల కోట్ల ఊరట
టెలికం సంస్థల అభ్యర్థనలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. టెలికం సంస్థలకు ఊరటనిచ్చేలా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కింద టెలికం కంపెనీలు చెల్లించాల్సిన రూ.42,000 కోట్ల బకాయిలను రెండేళ్ల పాటు వాయిదా వేసేందుకు ఆమోదం తెలిపినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. టెలికం రంగంలో నెలకొన్న ఆర్థిక కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. 

also read మరో రికార్డు చేరువలో రిలయన్స్: 10లక్షల కోట్లకు రూ.1300 కోట్ల దూరం

వాయిదా వేసిన బకాయిల చెల్లింపులపై కంపెనీలు వడ్డీ చెల్లించక తప్పదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీంతో తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీలతో పాటు రిలయన్స్‌ జియో కూడా ప్రయోజనం పొందనుంది. 

2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు స్పెక్ట్రం బకాయిలపై మారటోరియం ఇచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విలేకరులతో చెప్పారు. దీంతో భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియోలకు రూ.42 వేల కోట్ల రిలీఫ్‌ ప్యాకేజీ లభించినట్లు అయింది. టెలికం రంగ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.