మరో రికార్డు చేరువలో రిలయన్స్: 10లక్షల కోట్లకు రూ.1300 కోట్ల దూరం
ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ అంబానీ ప్రపంచంలోకెల్లా ఆరవ అతిపెద్ద ఆయిల్ కంపెనీగా అవతరించింది. మరోవైపు దేశీయంగా రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10 లక్షల కోట్లకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
ముంబై: దేశంలోనే అత్యంత సంపన్న సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డువైపు దూసుకెళ్తున్నది. రూ. 9.5లక్షల కోట్ల మార్కెట్ విలువ అధిగమించిన తొలి సంస్థగా చరిత్ర సృష్టించిన రిలయన్స్.. తాజాగా రూ. 10 లక్షల కోట్ల మైలురాయికి మరింత చేరువైంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు రాణించడంతో కొత్త రికార్డుకు కేవలం రూ. 20 వేల కోట్ల దూరంలో నిలిచింది.
బుధవారం సెషన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర బీఎస్‌ఈలో 2.47% పెరిగి రూ. 1,547.05 వద్ద స్థిరపడింది. అంతర్గత ట్రేడింగ్‌లో షేర్ విలువ 4.10శాతం దాకా ఎగబాకి రూ. 1,571.85 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ రిలయన్స్ షేర్ ధర 2.56శాతం లాభంతో రూ. 1,548.50 వద్ద స్థిరపడింది.
also read పెళ్లికి రుణమిస్తాం.. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు: బజాజ్ ఫిన్ సర్వ్
ఇక మార్కెట్ విలువ విషయానికొస్తే.. అంతర్గత ట్రేడింగ్‌లో కంపెనీ విలువ రూ. 9,96,415 కోట్ల వరకు పెరిగింది. చివరకు రూ. 9,80,699.59 వద్ద స్థిరపడింది. మరో రూ. 19,300 కోట్లు పెరిగితే రిలయన్స్ మార్కెట్ విలువ రూ. 10లక్షల కోట్లను అధిగమిస్తుంది. రానున్న వారాల్లో తాము కూడా మొబైల్ కాల్స్, డేటా ఛార్జీలు పెంచనున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. దీంతో స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో కంపెనీ షేర్ విలువ పెరుగుతోంది.
మార్కెట్ విలువ పరంగా రూ. 7,91,002.70కోట్లతో టీసీఎస్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(రూ. 6,98,227.03 కోట్లు), హిందుస్థాన్ యునిలివర్(రూ. 4,38,796.58కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ(రూ. 3,79,950.64కోట్లు) ఉన్నాయి.
మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయానికి సంబంధించిన ప్రతిపాదన విషయమై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలతో షేర్ మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా సాగాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి ఇండెక్స్‌లో వెయిటేజీ అధికంగా షేర్ల జోరుతో స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో ముగిసింది.
also read టోల్ గేట్ వద్ద వాహనాలకు ఫాస్ట్ టాగ్ లు తప్పనిసరి....లేకపోతే ?
డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు పతనమై 71.86కు చేరినప్పటికీ, మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 40,816 పాయింట్లను తాకిన సెన్సెక్స్ చివరకు 182 పాయింట్ల లాభంతో 40,652 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపునకు రెండు పాయింట్లు తక్కువ. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్‌కు ఒక పాయింట్ తక్కువగా 11,999 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 99 పాయింట్లు లాభపడిన నిఫ్టీ, చివరకు 59 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది.
లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు ప్రదర్శించింది. అంతర్గత ట్రేడింగ్‌లో 346 పాయింట్ల లాభంతో ఆల్‌టైమ్ హై, 40,816 పాయింట్లను తాకింది. సెన్సెక్స్ ఆల్‌టైమ్ హైకు చేరడం, నిఫ్టీ ఇంట్రాడేలో 12,000 పాయింట్ల ఎగువకు ఎగబాకడంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో మధ్యాహ్న లాభాలు తగ్గాయి. ఇంధన, ఫార్మా, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభపడగా,రియల్టీ, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లు నష్టపోయాయి.