Asianet News TeluguAsianet News Telugu

మలేషియా ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ చేతికి ‘ఫోర్టిస్’

ఎట్టకేలకు అప్పుల ఊబిలో చిక్కుకున్న ‘ఫొర్టిస్ హెల్త్‌కేర్’ను ఐహెచ్‌హెచ్ చేజిక్కించుకున్నది. ఇందుకోసం ప్రిఫరెన్షియల్ ఎలాట్మెంట్ ద్వారా నూతనంగా 235.3 మిలియన్ల వాటాలను జారీ చేస్తారు.

Fortis Healthcare Accepts Rs 40 Billion Offer from Malaysia's IHH at Rs 170 Per Share

న్యూఢిల్లీ: దేశీయంగా రెండో అతిపెద్ద హాస్పిటల్‌ చెయిన్‌ ’ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌’ టేకోవర్‌ కోసం నెలల తరబడి సాగిన నిరీక్షణకు ఇక తెరపడినట్లే. ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేసే కంపెనీ కోసం అని ఎదురుచూసిన మదుపర్లకు ఎట్టకేలకు స్పష్టత లభించింది. మలేషియాకు చెందిన ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ ఆఫర్‌కు బోర్డు అంగీకరించినట్లు ఫోర్టిస్‌ తెలిపింది.

మలేషియాకి చెందిన ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ ప్రతిపాదనను ఆమోదించినట్లు ఫోర్టిస్‌ బోర్డు తెలిపింది. టేకోవర్‌ ప్రతిపాదన ప్రకారం ప్రిఫరెన్షియల్‌ షేర్ల కొనుగోలు ద్వారా రూ. 4,000 కోట్లు సమకూర్చాలి. షేరు ఒక్కింటికి రూ. 170 చొప్పున ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు ద్వారా ఫోర్టిస్‌లో ఐహెచ్‌హెచ్‌కి 31 శాతం వాటాలు దక్కుతాయి.

అదే ధరకు మరో 26 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాలి. ఇందుకోసం మరో రూ. 3,300 కోట్లు వెచ్చించాలి. గురువారం ఫోర్టిస్‌ షేర్ ముగింపు ధరతో పోలిస్తే ఆఫర్‌ ధర 20 శాతం అధికం. ఒక్కో షేర్‌కు రూ. 170 లెక్కన ఫోర్టిస్‌ ఈక్విటీ వాల్యుయేషన్‌ మొత్తం రూ. 8,800 కోట్లని అంచనా.  

ఫోర్టిస్‌ కొనుగోలుకు పోటీపడిన టీపీసీ–మణిపాల్‌ కన్సార్షియం రూ. 2,100 కోట్లు సమకూర్చేలా, మణిపాల్‌ హాస్పిటల్స్‌ను ఫోర్టిస్‌లో విలీనం చేసేలా ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఏడాది వ్యవధిలో ఫోర్టిస్‌ ఆమోదించిన ఆఫర్లలో ఐహెచ్‌హెచ్‌ ప్రతిపాదన మూడోది. ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ బెర్హాద్‌కి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది దేశాల్లో 49 ఆస్పత్రులు ఉన్నాయి. ఫోర్టిస్‌కి 45 హెల్త్‌కేర్‌ సెంటర్లు, 368 డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఉన్నాయి.  

‘వాటాదార్లు, కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అనుమతులు లభించిన వారంలోపు ఈ లావాదేవీలు పూర్తి చేస్తాం. వాటాదార్ల అనుమతులు రావడానికి 60-75 రోజుల సమయం పట్టవచ్చు’ అని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రతిపాదిత ఆఫర్‌ చాలా సులభతర లావాదేవీకి వీలుకల్పిస్తుందని, చాలా తక్కువ అనుమతులు అవసరమని.. అందుకు తక్కువ సమయం సరిపోతుందని ఫోర్టిస్‌ వివరించింది..

‘ఫోర్టిస్‌ను కొనుగోలు చేయడం వల్ల భారత ఉపఖండంలో మా ఉనికి మరింత బలోపేతం అవుతుంది. ప్రస్తుతం మాకున్న అత్యుత్తమ ప్రత్యేక సేవల విభాగానికి ఇది జత చేరుతుంది. కొన్నేళ్లుగా భారత్‌లో ఐహెచ్‌హెచ్‌ వేగంగా విస్తరిస్తోంది. ఈ కొనుగోలుతో సహజంగానే మేం మరింత విస్తృతమవుతాం. ఫోర్టిస్‌ కోసం మా వద్ద 100 రోజుల ఉద్దీపన ప్రణాళిక ఉంది’ అని ఐహెచ్‌హెచ్‌ ఎండీ, సీఈఓ టాన్‌ సీ లెంగ్‌ పేర్కొన్నారు. 

ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించే అవకాశం ఉందని ఐహెచ్‌హెచ్‌ ఎండీ, సీఈఓ టాన్‌ సీ లెంగ్‌ వివరించారు. దీర్ఘకాలంలో తమ అంతర్జాతీయ బ్రాండ్‌ ’గ్లెన్‌ఈగిల్స్‌’ చెయిన్‌ కింద ఫోర్టిస్‌ను చేర్చే అవకాశం ఉందని లెంగ్‌ వివరించారు. అవసరమైతే మరిన్ని నిధులను కూడా ఇన్వెస్ట్‌ చేసేందుకు సిద్ధమని ఆయన చెప్పారు.

‘ప్రస్తుతం ఫోర్టిస్‌కి రూ. 5,800–6,000 కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నాం. ముందుగా రూ. 4,000 కోట్లు సమకూరుస్తున్నాం. అవసరమైతే మిగతా వాటాదారులతో సంప్రదించి మరిన్ని నిధులను కూడా సమకూర్చే అవకాశం ఉంది‘ అని ఐహెచ్‌హెచ్‌ ఎండీ, సీఈఓ టాన్‌ సీ లెంగ్‌ తెలిపారు.  

రుణ వివాదంలో వ్యవస్థాపకులు మల్వీందర్‌ సింగ్, శివీందర్‌ సింగ్‌ కంపెనీ నుంచి తప్పుకోవాల్సి రావడంతో ఫోర్టిస్‌కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. వ్యవస్థాపకులిద్దరూ నిధులు కూడా మళ్లించారన్న ఆరోపణలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫోర్టిస్‌ టేకోవర్‌పై దిగ్గజ సంస్థలు కన్నేశాయి. ముందుగా మణిపాల్‌ హెల్త్‌ ఎంటర్‌ప్రైజెస్, అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ టీపీజీ సంయుక్తంగా ఇచ్చిన ఆఫర్‌ను ఫోర్టిస్‌ బోర్డు ఆమోదించింది.

అంతక్రితం ఏం జరిగిందంటే.. 


ఫోర్టిస్‌ బోర్డు తొలుత భారత్‌కే చెందిన మణిపాల్‌ హెల్త్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్‌లకు చెందిన విలీన ఆఫర్‌ను అంగీకరించింది. ముంజాల్‌-బర్మన్‌ రూ.1,800 కోట్ల ఆఫర్‌ను ఫోర్టిస్‌ అంగీకరించినా.. వాటాదార్లు నిరాకరించడంతో పాటు పోటీ తీవ్రతరం కావడంతో బిడ్డింగ్‌ ప్రక్రియను మే 29న మళ్లీ ప్రారంభించారు. మొత్తం ముగ్గురు బిడ్డర్ల(ఐహెచ్‌హెచ్‌, టీపీజీ-మణిపాల్‌ కన్సార్షియం, హీరో-బర్మన్‌ కన్సార్షియం)కు ఆహ్వానం దక్కగా.. రేడియంట్‌-కేకేఆర్‌ కన్సార్షియం నుంచి ఆసక్తి వ్యక్తమైంది. చివరకు ఐహెచ్‌హెచ్‌కు ఫోర్టిస్‌ ఓటేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios