ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నేర్చుకున్న వారి భవిష్యత్తు బంగారమే. ఎందుకంటే 2026 నాటికి భారతదేశంలో ఒక మిలియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు అవసరం ఉంటుందని అంచనా. మరి మీరు రూ.లక్షల ప్యాకేజీతో AI ఉద్యోగానికి సిద్ధమా?

ఎంత క్లిష్టమైన సమాచారాన్నైనా సెకన్లలో ఇచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం టెక్నాలజీలోనే కాకుండా అనేక రంగాల్లో దూసుకుపోతోంది. అందుకే త్వరలో ఈ రంగంలో రూ.లక్షల ప్యాకేజీలతో సుమారు 10 లక్షల ఉద్యోగాలు రానున్నాయని సమాచారం. 

కేంద్ర మంత్రిత్వ శాఖ ఏం చెప్పిందంటే..

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 'ఇండియాస్ AI రివల్యూషన్: ఎ రోడ్‌ మ్యాప్ టు విక్షిత్ భారత్' పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2026 నాటికి భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) నిపుణులకు డిమాండ్ భారీగా పెరగనుంది. ఇది ఎంతలా అంటే.. కనీసం ఒక మిలియన్ ఉద్యోగాలు AI ఎక్స్‌పర్ట్ కేటగిరీపై ఏర్పడతాయని కేంద్ర మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. 

భారతదేశం టార్గెట్ ఏంటంటే..

వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఇండియా 2047 నాటికి 23-35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఇప్పటి నుంచే విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే సిలబస్ మార్పు, కొత్త పాఠ్యాంశాల చేర్పు, అవసరం లేని చరిత్రల తొలగింపు వంటి అనేక చర్యలు తీసుకుంది. 

విద్యావిధానంలోనూ అనేక మార్పులు

త్వరలోనే AI, ఆటోమేషన్, ఇంటర్ డిసిప్లినరీ ఇన్నోవేషన్ వంటి రంగాలలో ఉన్నత విద్యను ప్రవేశపెట్టి ఎక్కువ మంది ఆ కోర్సులు నేర్చుకొనేలా ఏర్పాట్లు చేయనుంది. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ విద్యలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 

ఆల్-ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ప్రకారం 2024-25 విద్యా సంవత్సరానికి బి.టెక్ సీట్ల సంఖ్య 14.9 లక్షలకు పెరిగింది. కంప్యూటర్ సైన్స్, AI/ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్‌చెయిన్ వంటి అనుబంధ స్ట్రీమ్‌లలో సీట్ల సంఖ్య 50 శాతం పెరిగింది. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రత్యేకంగా యూనివర్సిటీ

ఇటీవల సింబియోసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ) సింబియోసిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ (SAII)ని ప్రారంభించింది. వీబాక్స్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 ప్రకారం భారతదేశ AI పరిశ్రమ 2025 నాటికి 28.8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అదేవిధంగా ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సంస్థలు ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. మహీంద్రా యూనివర్సిటీ వంటి సంస్థలు AI ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాయి.

దీన్ని బట్టి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. మీరు గాని వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే మంచి ప్యాకేజీతో అద్భుతమైన ఉద్యోగాన్ని మీరు సంపాదించొచ్చు.