Cyber Attack: కేవలం 20 నిమిషాల్లో రూ. 60 వేల కోట్లు మాయం.. అతిపెద్ద డిజిటల్ చోరీ !
Cyber Attack: లాగిన్ అయ్యాక నిమిషాల్లోనే ఖాతాల నుంచి కోట్ల రూపాయలు మాయమయ్యాయి. క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ బైనాన్స్‌లో కేవలం 20 నిమిషాల్లో రూ.60 వేల కోట్ల డిజిటల్ చోరీ జరిగింది. ఈ అతిపెద్ద సైబర్ దాడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

డిజిటల్ ప్రపంచంలో పెను సంచలనం: 20 నిమిషాల్లో 60 వేల కోట్లు మాయం
ప్రస్తుత రోజుల్లో డిజిటల్ కరెన్సీ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే, ఈ మార్కెట్‌లో ఎప్పుడైతే కుదుపు వస్తుందో, ఒకే ఒక్క క్షణంలో వేల కోట్ల రూపాయలు నీటిలో హోమంలా మాయమైపోతుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ అయిన బైనాన్స్‌లో చోటుచేసుకుంది.
ఈ ప్లాట్‌ఫారమ్ భద్రతా వ్యవస్థపై గుర్తుతెలియని హ్యాకర్లు భారీ దాడికి పాల్పడ్డారు. ఈ సైబర్ దాడి ధాటికి ఏకంగా 6.3 బిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 60 వేల కోట్లు ఇట్టే ఆవిరైపోయాయి. అయితే, టెక్నాలజీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన ఈ ఘటనలో 95 శాతం వరకు రికవరీ చేశామని బైనాన్స్ సంస్థ చెబుతోంది. అసలు ఈ అతిపెద్ద డిజిటల్ చోరీ ఎలా జరిగింది? హ్యాకర్లు ఎక్కడ కన్నేశారు? అనే విషయాలు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సెక్యూరిటీ సిస్టమ్‌ను బైపాస్ చేసిన డిజిటల్ దొంగలు
ఈ భారీ చోరీ వెనుక అసలు టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. బైనాన్స్ వంటి క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లలో లక్షలాది మంది బిట్‌కాయిన్, ఈథర్ వంటి డిజిటల్ కరెన్సీలను కొనుగోలు చేస్తుంటారు, విక్రయిస్తుంటారు. కస్టమర్ల క్రిప్టో ఆస్తులన్నీ డిజిటల్ వాలెట్లలో భద్రపరుస్తారు. ఈ వాలెట్ల నుంచి మరొక అడ్రస్‌కు డబ్బు పంపేందుకు ఒక పటిష్టమైన సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. దీనినే సైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటారు.
ఎవరైనా కరెన్సీ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు, ఈ వ్యవస్థే ఆ లావాదేవీని అనుమతించాలా వద్దా అని నిర్ణయిస్తుంది. బ్లాక్‌చెయిన్ అనలిటిక్స్ కంపెనీ టీఆర్‌ఎం లాబ్స్ తెలిపిన వివరాల ప్రకారం, హ్యాకర్లు సరిగ్గా ఇదే వ్యవస్థను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. డిజిటల్ సెక్యూరిటీ తాళాలు పగలగొట్టడానికి బదులుగా, డబ్బు బయటకు తీసే ఆదేశాలు ఇచ్చే ఆపరేటింగ్ సిస్టమ్‌నే పూర్తిగా తమ కంట్రోల్‌లోకి మార్చుకున్నారు.
కేవలం 20 నిమిషాల్లోనే పక్కా ప్లాన్
సిస్టమ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న వెంటనే హ్యాకర్లు రంగంలోకి దిగారు. ప్రభావితమైన డిజిటల్ వాలెట్ల నుంచి క్రిప్టోకరెన్సీని నేరుగా తమ నియంత్రణలో ఉన్న వేరే వాలెట్లకు వేగంగా బదిలీ చేయడం ప్రారంభించారు. బ్లాక్‌చెయిన్ రికార్డుల సమాచారం ప్రకారం, ఈ డేంజరస్ అటాక్ గురువారం రాత్రి సుమారు 8 గంటల తర్వాత మొదలైంది.
ఇందులో అతిపెద్ద దొంగతనం కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే పూర్తయింది. మొదట ఈ దాడి గురించి స్పందించిన బైనాన్స్ యాజమాన్యం, ఉద్యోగి ఒకరి లాప్‌టాప్ హ్యాక్ కావడం వల్ల ఇది జరిగి ఉండొచ్చని భావించింది. కానీ, తదుపరి అంతర్గత విచారణలో సెక్యూరిటీ ఉల్లంఘనకు సంబంధించిన మరికొన్ని కోణాలు కూడా వెలుగు చూశాయి. భద్రతా కారణాల రీత్యా కంపెనీ అన్ని టెక్నికల్ వివరాలను బయటపెట్టలేదు.
హ్యాకర్లకు చెక్ పెట్టిన కంపెనీలు.. ఫ్రీజ్ అయిన ఆస్తులు
ఇలా భారీ మొత్తంలో క్రిప్టో చోరీ చేసిన తర్వాత, దొంగలు ఆ డబ్బును గుర్తింపు పట్టకుండా ఉండేందుకు వేర్వేరు డిజిటల్ వాలెట్లకు మళ్లించడం మొదలుపెట్టారు. అయితే, ఈ సమయంలో కొన్ని ప్రముఖ క్రిప్టో సంస్థలు అప్రమత్తమై వేగంగా స్పందించాయి. యూఎస్‌డీటీ, యూఎస్‌డీసీ వంటి స్టేబుల్‌కాయిన్‌లను జారీ చేసే కంపెనీలకు టోకెన్‌లను ఫ్రీజ్ చేసే ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
ఒకవేళ ఏదైనా డిజిటల్ కరెన్సీ మోసపూరిత కార్యకలాపాలకు వాడితే, ఆ టోకెన్లను తదుపరి ట్రాన్స్‌ఫర్ చేయకుండా నిలిపివేయవచ్చు. టెథర్, సర్కిల్, రిప్పల్ వంటి కంపెనీలు వెంటనే స్పందించి ఈ చోరీకి సంబంధించిన కొన్ని అసెట్లను బ్లాక్ చేశాయి. దీనివల్ల హ్యాకర్లు ఆ డబ్బును పూర్తిగా వాడుకోలేకపోయారు. అయితే, బిట్‌కాయిన్, ఈథర్ వంటి కరెన్సీలను నేరుగా సెంట్రలైజ్డ్ సంస్థలు ఆపలేవు కాబట్టి ప్రత్యేక ఎక్స్ఛేంజ్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది.
ఈ దాడికి పాల్పడింది ఉత్తర కొరియా హ్యాకర్లేనా?
ఈ దొంగతనం వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న పెద్ద ప్రశ్న. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు గానీ, అంతర్జాతీయ మీడియాలో మాత్రం ఉత్తర కొరియా హ్యాకర్ల హస్తం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అమెరికా, ఇతర బ్లాక్‌చెయిన్ నిపుణులు ఈ అటాక్ విధానాన్ని గతంలో ఉత్తర కొరియా హ్యాకర్ గ్రూప్‌లు చేసిన దాడులతో పోల్చి చూస్తున్నారు.
గత ఏడాది బైబిట్ ఎక్స్ఛేంజ్పై జరిగిన దాడితో ఇది పూర్తిగా సరిపోలుతోందని టీఆర్‌ఎం లాబ్స్ వెల్లడించింది. ఆ ఘటనలో అమెరికా ఎఫ్‌బీఐ కూడా నార్త్ కొరియా హ్యాకర్ల ప్రమేయాన్ని గుర్తించింది. మరోవైపు, ఈ భారీ నష్టం నుంచి కస్టమర్లను కాపాడేందుకు బైనాన్స్ వద్ద సాఫు (SAFU) అనే ప్రత్యేక సేఫ్టీ ఫండ్ ఉంది. దీని ద్వారా సుమారు 1 బిలియన్ డాలర్ల బిట్‌కాయిన్ రిజర్వ్ అందుబాటులో ఉందని, కస్టమర్ల నిధులు సురక్షితంగా ఉంటాయని కంపెనీ భరోసా ఇస్తోంది.





