వాషింగ్టన్‌: గతేడాది వరకు వాణిజ్య యుద్ధం.. తాజాగా కరోనా వైరస్ సాక్షిగా అమెరికా, చైనాల మధ్య వైరం రోజురోజుకు మరింతగా ముదురుతోంది. తొలుత వాణిజ్య యుద్ధంగా మొదలైన వైరం కాస్త అటుపై టెక్నాలజీ పోరుకు దారితీసింది.

5జీ టెలికం పరికరాల చైనా దిగ్గజం హువావేపై అమెరికా పలు ఆంక్షలు విధించి దానితో తమ దేశ సంస్థలేవీ వ్యాపార లావాదేవీలు జరపకుండా దాదాపు అడ్డుకట్ట వేసేసింది. కరోనా వైరస్‌ మహమ్మారి వివరాలను తొక్కిపెట్టి ప్రపంచవ్యాప్తంగా దానిని వ్యాప్తి చేసిందంటూ చైనాపై మండిపడుతున్న అమెరికా ప్రస్తుతం మరో కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది.

తమ దేశ స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్టయిన చైనా కంపెనీలను డీలిస్ట్‌ చేయడం ద్వారా బిలియన్ల కొద్దీ అమెరికన్‌ డాలర్లు పెట్టుబడులుగా పొందుతున్న చైనీస్‌ సంస్థలను, పరోక్షంగా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ విషయమై ప్రతిపాదించిన బిల్లుకు అమెరికా సెనేట్‌ తాజాగా ఆమోదముద్ర వేసింది.

‘నేను కొత్తగా మరో ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవడం లేదు. నేను..నాతో పాటు మిగతా అందరూ నిబంధనల ప్రకారం చైనా నడుచుకోవాలనే కోరుకుంటున్నారు‘ అని బిల్లు ఆమోదం పొందాక దీన్ని ప్రవేశపెట్టిన సెనేటర్లలో ఒకరైన జాన్‌ కెనెడీ వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో ఆలీబాబా, బైదు తదితర దిగ్గజ చైనా కంపెనీలకు డీలిస్టింగ్‌ గండం ఏర్పడింది.

హోల్డింగ్‌ ఫారిన్‌ కంపెనీస్‌ అకౌంటబుల్‌ యాక్ట్‌ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం అమెరికా సెక్యూరిటీస్‌ చట్టాలను పాటించడంలో విఫలమైనందుకు నాస్‌డాక్, ఎన్‌వైఎస్‌ఈ స్టాక్‌ ఎక్స్చేంజీల నుంచి చైనా కంపెనీలను డీలిస్ట్‌ చేయొచ్చు. గతేడాది మార్చిలోనే సెనేటర్లు జాన్‌ కెనెడీ, క్రిస్‌ వాన్‌ హోలెన్‌ దీన్ని సెనేట్‌లో ప్రవేశపెట్టారు. 

ఈ బిల్లు ప్రకారం లిస్టెడ్‌ విదేశీ కంపెనీలు తమపై తమ దేశ ప్రభుత్వ నియంత్రణేమీ లేదంటూ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు అమెరికాలో పబ్లిక్‌ కంపెనీల ఖాతాలను సమీక్షించే బోర్డు పీసీఏవోబీ తమ ఖాతాలను కూడా తనిఖీ చేసేందుకు అంగీకరించాలి.

వరుసగా మూడేళ్ల పాటు నిరాకరించిన పక్షంలో నిషేధం, డీలిస్టింగ్‌ తప్పదు. ఈ చట్టంప్రధానంగా విదేశీ కంపెనీలన్నింటికీ వర్తించేదే. అయితే, చైనా కంపెనీల ఆడిటింగ్‌ విషయంలోనే సహకారం దొరకడం లేదంటూ పీసీవోఏబీ చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలపైనే అమెరికా ఎక్కువ కఠినంగా చర్యలు అమలు చేయనుందని విశ్లేషకులు అంటున్నారు.

also read అందరి చేయూత కావాలి.. అద్భుతమైన ప్యాకేజీ అవసరం: రాజన్ ...

ఇప్పటికే సేల్స్‌ అకౌంటింగ్‌ మోసాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటు న్న చైనా సంస్థ ‘లకిన్‌ కాఫీ’ ను డీలిస్ట్‌ చేస్తున్నట్లు నాస్‌డాక్‌ ప్రకటించడం దీనికి మరింత ఊతం ఇస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా తమ కంపెనీలపై గురిపెట్టే ప్రమాదాన్ని ముందే ఊహించినా చైనా కూడా తదుపరి వ్యూహాలతో సిద్ధంగా ఉంది.

హాంకాంగ్‌లో నిరసనలను అణగదొక్కేందుకు తమకు మద్దతుగా నిల్చిన బ్రిటన్‌ వైపు చైనా చూస్తోంది. ఒకవేళ అమెరికన్‌ ఎక్స్చేంజీల నుంచి డీలిస్ట్‌ అయిపోతే ప్రత్యామ్నాయంగా లండన్‌ ఎక్స్చేంజీలో కంపెనీలను లిస్ట్‌ చేసే ప్రయత్నాల్లో ఉంది. లండన్‌లో లిస్ట్‌ కాదల్చుకున్న కంపెనీల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను పునఃప్రారంభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

చైనాతో వాణిజ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికన్‌ కంపెనీలను అక్కణ్నుంచి వచ్చేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరిస్తున్నారు. దీంతో టెక్‌ దిగ్గజం ఆపిల్‌ సహా పలు కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ తదితర దేశాలకు తయారీ కార్యకలాపాలు మళ్లించడంపై కసరత్తు చేస్తున్నాయి. 

అయితే, ఆయా కంపెనీలను అమెరికాకే రప్పించే ప్రయత్నాల్లో ట్రంప్‌ ఉన్నారు. చైనా నుంచి తయారీ కేంద్రాలను స్వదేశానికే తరలించాలని.. అలా కాకుండా భారత్, ఐర్లాండ్‌ వంటి ఇతర దేశాలకు వెడితే వాటిపై పన్నుల మోత మోగిస్తామని ఈ మధ్యే ట్రంప్ మరోమారు హెచ్చరించారు. అంతే కాకుండా.. చైనా కంపెనీల్లో తమ సంస్థలు పెట్టుబడి పెట్టకుండా కూడా అమెరికా చర్యలు తీసుకుంటోంది.

దీనికి అనుగుణంగా అమెరికాలో లిస్టయిన చైనా కంపెనీల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం శ్రేయస్కరం అంటూ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ బ్లాక్‌రాక్‌కు నేషనల్‌ లీగల్‌ అండ్‌ పాలసీ సెంటర్‌ సూచించింది. పర్యావరణ కార్యకర్తల ఆందోళనల కారణంగా బ్లాక్‌రాక్‌ ఇప్పటికే కొన్ని బొగ్గు కంపెనీల నుంచి తప్పుకుంది.

ప్రభుత్వ పెన్షన్‌ ఫండ్‌ను నిర్వహించే థ్రిఫ్ట్‌ సేవింగ్స్‌ ప్లాన్‌ సంస్థ .. ఇన్వెస్ట్‌ చేసే విదేశీ స్టాక్స్‌ జాబితా నుంచి చైనా కంపెనీలను తప్పించడంలోనూ ట్రంప్‌ ప్రస్తుతానికి సఫలమయ్యారు. ఇది దాదాపు 500 బిలియన్‌ డాలర్ల నిధిని నిర్వహిస్తోంది.

తమ ఇన్వెస్టర్లకు కొత్తగా అంతర్జాతీయ స్టాక్స్‌లో కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో 50 బిలియన్‌ డాలర్ల ఇంటర్నేషనల్‌ ఫండ్‌ పథకం ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన విదేశీ స్టాక్స్‌ జాబితాలో చైనా కంపెనీలు లేకుండా చూసేలా ట్రంప్‌ ఒత్తిడి తెచ్చారని పరిశ్రమవర్గాలు తెలిపాయి.

అమెరికాలోని నాస్‌డాక్, ఎన్‌వైఎస్‌ఈ స్టాక్‌ ఎక్స్చేంజీల్లో దాదాపు 170 చైనా కంపెనీలు లిస్టయి ఉన్నాయి. చైనా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తూ అమెరికాలో లిస్టయిన భారీ కంపెనీలు పదికి పైగా ఉన్నాయి. పెట్రోచైనా, చైనా లైఫ్, చైనా టెలికం, చైనా ఈస్టర్న్, చైనా సదరన్, హువానెంగ్‌ పవర్, అల్యూమినియం కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా, చైనా పెట్రోలియం ఈ జాబితాలో ఉన్నాయి. 

ఇక టెక్‌ దిగ్గజాల్లో బైదు, ఆలీబాబా, పిన్‌డువోడువో, జేడీడాట్‌కామ్‌ మొదలైన సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆలీబాబా గ్రూప్‌ హోల్డింగ్, బైదు, జేడీడాట్‌కామ్‌ సంస్థల సంయుక్త మార్కెట్‌ విలువ 500 బిలియన్‌ డాలర్ల పైగానే ఉంటుంది.