Asianet News TeluguAsianet News Telugu

అందరి చేయూత కావాలి.. అద్భుతమైన ప్యాకేజీ అవసరం: రాజన్

కరోనా ‘లాక్ డౌన్’ వల్ల తలెత్తిన ఆ    ర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు, పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు భారీ, మెరుగైన, అద్భుతమైన ఆర్థిక ప్యాకేజీ అవసరం అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. విపక్షాలు, నిపుణుల సాయం తీసుకోవాలని సూచించారు. వలస కార్మికులకు అన్ని విధాల అండగా ఉండేలా వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. 

India Faces a Major Economic Catastrophe, PMO Can't Handle By Itself, Says Raghuram Rajan
Author
Hyderabad, First Published May 22, 2020, 10:26 AM IST

న్యూఢిల్లీ: భారత్‌ ప్రస్తుతం భారీ ఆర్థిక విపత్తును ఎదుర్కొంటున్నదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక్కటే పోరాడలేదని అభిప్రాయపడ్డారు.

‘మనం (భారత్‌) ఎదుర్కొంటున్న విపత్తు మరింత ముదురుతున్నదని నేను చాలా ఆందోళన చెందుతున్నాను . కేంద్ర ప్రభుత్వం ఒక్కటే దీనిపై పోరాడలేదు. తప్పక విపక్షాలను సంప్రదించాలి. వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి’ అని ఓ ఆంగ్ల వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్‌ అన్నారు. 

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశంలో ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని ప్రధానమంత్రి కార్యాలయం ఒక్కటే ఎదుర్కోలేదని వ్యాఖ్యానించారు. అందుకే దేశంలోని నిపుణులు, ప్రతిభావంతులను సంప్రదించాలని, అలాంటివారు రాజకీయ ప్రత్యర్థులైనా సంశయం వద్దన్నారు. 

అందరూ కలిస్తేనే ఈ మహమ్మారి సృష్టించిన విపత్తుకు పరిష్కారం దొరుకగలదని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. వైరస్‌ ఉద్ధృతి, లాక్‌డౌన్‌ల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఒక్కటే ఇప్పుడు సవాల్‌ కాదన్నారు.

తిరిగి గత ఆర్థిక వైభవాన్ని అందుకోవడం కూడా కీలకమేనని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ స్పష్టం చేశారు. దేశంలో ఎందరో మేధావులు ఉన్నారని, వారందరికీ పిలుపునివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమయంలో సిన్హా, పీ చిదంబరం వంటి వాళ్లను మీరు సిఫార్సు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు పేర్లు చెప్పకుండా రాజకీయ విభేదాలను మరిచి అందరి సాయం తీసుకున్నప్పుడే ఈ కష్టకాలం నుంచి గట్టెక్కగలమని  బదులిచ్చారు.

ద్రవ్యలోటు పెరిగితే రేటింగ్‌ ఏజెన్సీల స్పందన ఎలా? ఉంటుందోనన్న భయాలను కేంద్ర ప్రభుత్వం వీడాలని రఘురామ్ రాజన్‌ హితవు పలికారు. బహుశా దీనివల్లేనేమో ఆర్థికపరమైన నిర్ణయాల్లో ప్రభుత్వం పరిమిత స్థాయిలోనే స్పందిస్తున్నదని అన్నారు. 

also read ఒకే వేదికపై 200 సింగర్స్ తో పాట..పి‌ఎం కేర్స్ ఫండ్‌కు భారీ విరాళం... ...

కానీ దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే ఖర్చుల పెంపు అత్యవసరమని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ గుర్తుచేశారు. ఏదిఏమైనా త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌లు వలస కార్మికులకు జీవన్మరణ సమస్యల్ని తెచ్చిపెట్టాయని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఆహార అవసరాలు, ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్రం ఇటీవల ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో భాగంగా వలస కార్మికులకు ఆహారోత్పత్తులను అందించినా అవి సరిపోవని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ కారణంగా వీరికి ఉపాధి కరువైందని, కాబట్టి పాలు, కూరగాయలు, వంటనూనె అవసరాలతోపాటు అద్దెల చెల్లింపునకు నగదు ఇవ్వాలని సూచించారు.

కేంద్రం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ.. దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోదని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ స్పష్టం చేశారు. జీడీపీ కోలుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన దాదాపు రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ చాలదన్నారు.

ప్యాకేజీ ఆకర్షణీయంగా ఉందా?.. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లకు స్పందన కరువైందా? అన్న ప్రశ్నలకు భారత్‌లో ఇప్పుడు ఎంత స్పందించినా అది తక్కువేనని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ జవాబిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని, దీన్ని పరుగులు పెట్టించాలంటే ఈ ప్యాకేజీలు ఎంతమాత్రం సరిపోవని తేల్చి పారేశారు.

మరిన్ని గొప్ప ఉద్దీపనల అవసరం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌  కుండ బద్ధలు కొట్టారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌తో యావత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థే ప్రమాదంలో పడిందన్న ఆయన కాపాడటానికి ఉన్న వనరులు పరిమితమేనని వ్యాఖ్యానించడం గమనార్హం. 

అందుకే ఈ విపత్తును అరికట్టడానికి ఉన్న ప్రతీ అవకాశాన్నీ భారత ప్రభుత్వం తప్పక ఉపయోగించుకోవాల్సిందేనని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సూచించారు. నిజానికి కేంద్ర ప్యాకేజీలో కొన్ని మంచి నిర్ణయాలున్నా.. ఇంకా అత్యుత్తమ నిర్ణయాలు తీసుకునే వీలుందని చెప్పారు. 

ఇక నిర్మాణ, మౌలిక రంగాల అభివృద్ధితో కూడిన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే ఇప్పుడు అసలైన పరీక్ష అని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. వైరస్‌తో పోరాటం కంటే దేశ జీడీపీని వృద్ధి బాట పట్టించడమే చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ పరిస్థితులను వ్యూహాత్మకంగా జయించడం కూడా ప్రధానమేనన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios