న్యూఢల్లీ: వ్యవసాయ రంగాన్ని సంస్కరించడంతోపాటు లాక్‌డౌన్‌ వల్ల దెబ్బతిన్న రంగాలకు త్వరలో రెండో విడత ఉద్దీపన ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించారు. ఇందుకోసం శనివారం కీలక మంత్రిత్వ శాఖలతో వరుస భేటీలు జరిపారు. ఆర్థిక, వాణిజ్య శాఖల సీనియర్‌ అధికారులు సైతం వీటిలో పాల్గొన్నారు. 

లాక్‌డౌన్‌తో కుదేలైన పారిశ్రామిక రంగం కోసం రెండో ఉద్దీపన పథకాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారని అభిజ్ఞవర్గాలు అంటున్నాయి. ఇందుకోసం ఆయన శనివారం హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా కీలక మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు.

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నెలవారీ వసూళ్ల గణాంకాల విడుదలను ఆర్థిక మంత్రిత్వశాఖ ఇప్పటికే వాయిదా వేసింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితిని శనివారం ప్రధానికి వివరించడంతోపాటు ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు చేపట్టాల్సిన వివిధ రకాల చర్యలపై ప్రెజెంటేషన్‌ ఇచ్చింది. 

also read:గుడ్‌న్యూస్: రూ. 5 లక్షల రుణాలిచ్చేందుకు బ్యాంకులు రెడీ

పౌరవిమానయాన, కార్మిక, విద్యుత్‌ తదితర శాఖల మంత్రులతో శుక్రవారం భేటీలు నిర్వహించిన మోదీ.. వాణిజ్య, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) శాఖల మంత్రులతో గురువారం చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు చిన్న వ్యాపారాలు వేగంగా కోలుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై నరేంద్రమోదీ దృష్టి ఈ సమీక్షలను నిర్వహించారు. లాక్‌డౌన్‌ వల్ల అట్టడుగు వర్గాలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి నెలాఖరులో రూ. 1.7 లక్షల కోట్ల విలువైన ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్యాకేజీతో బడుగు, బలహీనవర్గాలకు కొంత ఉపశమనం లభించింది. 

వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం లభించకపోవడంతో తమకూ చేయూతనివ్వాలని ఆయా వర్గాల నుంచి వినతులు రావడంతో త్వరలో రెండో విడుత ఉద్దీపన చర్యలను ప్రకటించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సూక్ష్మ్‌, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎఈ) పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులూ ఇందులో పాల్గొన్నారని తెలిసింది. వైమానిక, కార్మిక, విద్యుత్‌ సహా మరికొన్ని శాఖలతో మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. వాణిజ్య, ఎంఎస్‌ఎంఈ శాఖలతో గురువారం చర్చించారు.